పాండ్యా, రాహుల్‌లపై చర్యలు!

Hartik Pandya and K L Rahul have two ODI bans - Sakshi

2 వన్డేల నిషేధానికి రాయ్‌ సూచన

న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కె.ఎల్‌.రాహుల్‌లపై రెండు వన్డేల నిషేధం విధించే అవకాశాలున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ 2 మ్యాచ్‌ల నిషేధం విధించాలని బీసీసీఐకి సిఫారసు చేశారు. అయితే మరో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వివాదాన్ని బీసీసీఐ లీగల్‌ సెల్‌ పరిశీలించాలని సూచించారు. ‘వారి మాటలు ఆమోదయోగ్యం కాదు. క్షమాపణలు కోరుతూ పాండ్యా ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందడం లేదు.

దీనిపై శిక్ష తీసుకోవాలని నేను, ఎడుల్జీ గట్టిగా భావిస్తున్నాం. వారిద్దరిపై చర్యలు తీసుకునే విషయంలో ఆమె ఇప్పటికే బోర్డు లీగల్‌ సెల్‌ను సంప్రదించింది’ అని రాయ్‌ పేర్కొన్నారు.  బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాండ్యా, రాహుల్‌ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు పెను విమర్శలకు దారితీశాయి. ఇదిలావుండగా... ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌ ఈ శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హార్ధిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్‌ బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోనున్నారు. 

ఫిక్సింగ్‌కు దారి తీయవచ్చు! 
పాండ్యా తరహాలో నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించేవారిని మ్యాచ్‌ ఫిక్సర్లు సునాయాసంగా తమ వలలో వేసుకోగలరని బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌదరి అభిప్రాయ పడ్డారు. అమ్మాయిలను ఎరగా చూపించే ‘హనీ ట్రాప్‌’లో ఇరుక్కుపోతారని ఆయన అన్నారు. పాండ్యా, రాహుల్‌లపై వెంటనే నిషేధం విధించాలని కోరిన అనిరుధ్‌ అసలు వారిని టీవీ కార్యక్రమానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. ‘బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు టీవీ షోకు హాజరయ్యేందుకు అనుమతి తీసుకోనవసరం లేదా. వారు తీసుకుంటే ఎవరు అనుమతి ఇచ్చారు. అనేక సందర్భాల్లో క్రీడా పాత్రికేయులకే ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆటగాళ్లను దూరం పెడుతుంటారు. అలాంటిది ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకు ఎలా వెళ్లనిచ్చారు’ అని చౌదరి ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు నలుగురు సభ్యుల బీసీసీఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీ హెడ్‌గా రాజలక్ష్మి అరోరాను నియమించారు. లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఈ కమిటీ విచారిస్తుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top