హార్దిక్‌ రీ ఎంట్రీ అదిరింది.. | Hardik Pandya Makes Impressive Comeback | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ రీ ఎంట్రీ అదిరింది..

Feb 29 2020 1:18 PM | Updated on Feb 29 2020 1:21 PM

Hardik Pandya Makes Impressive Comeback - Sakshi

ముంబై:  వెన్నుగాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకుని సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకట్టుకున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్‌ తన సహజ సిద్ధమైన ఆటతో అలరించాడు. 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించాడు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ తొలుత మెల్లగా ఆడాడు. తొలి 12 బంతులకు 7 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్‌ ఆపై బ్యాట్‌కు పని చెప్పాడు. సిక్స్‌ల మోత మోగించాడు. రిలయన్స్‌ జట్టు 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తరుణంలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ ముందు క్రీజ్‌లో కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆపై సొగసైన షాట్లతో ఆకట్టుకుని రిలయన్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహకరించాడు.  ఈ మ్యాచ్‌లో రిలయన్స్‌  150 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు 125 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బరోడా జట్టు తరఫున శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు ఈ మ్యాచ్‌లో ఆడటం విశేషం. (టీమిండియాను ఆడేసుకుంటున్నారు..)

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్‌ పూర్తిగా కోలుకోవడంతో ఇక టీమిండియా రీఎంట్రీ ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడైన హార్దిక్‌ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 

 హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించిన ఎంఎస్‌కే
తాజా మ్యాచ్‌లో హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ దగ్గరుండి పర్యవేక్షించాడు. అతను ఎంతవరకూ తేరుకున్నాడు అనే అంశాన్ని ఎంఎస్‌కే పరిశీలించారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ కూడా హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించింది. ఇక ఐపీఎల్‌కు ఎంతో సమయం లేకపోవడంతో హార్దిక్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement