సస్పెన్షన్‌ ఎత్తివేత | Hardik Pandya KL Rahuls suspensions lifted by BCCI | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్‌ ఎత్తివేత

Jan 25 2019 2:16 AM | Updated on Jan 25 2019 2:16 AM

Hardik Pandya  KL Rahuls suspensions lifted by BCCI - Sakshi

న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసింది. దీంతో వీరిద్దరు మళ్లీ క్రికెట్‌ మైదానంలోకి దిగే అవకాశం లభించింది. నిషేధం తొలగించడంతో హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్‌ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ‘కోర్టు సహాయకుడి (అమికస్‌ క్యూరీ)గా నియమితులైన పీఎస్‌ నర్సింహ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని ప్రకారం ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధిస్తూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం. సుప్రీం కోర్టు అంబుడ్స్‌మన్‌ను నియమించిన తర్వాత వీరిద్దరిపై విచారణ కొనసాగుతుంది’ అని సీవోఏ తరఫున బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. 

రెండు వారాల ఉత్కంఠకు తెర... 
మహిళలతో సంబంధాలపై టీవీ షోలో సరదాగా మాట్లాడే క్రమంలో మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాహుల్, పాండ్యాలను ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఈ నెల మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించారు. తొలుత సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ ముందు యువ క్రికెటర్ల కెరీర్‌ సందిగ్ధంలో పడింది. అయితే, సీవోఏ అతిగా స్పందించి తీవ్ర చర్యలు తీసుకుందని విమర్శలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు గంగూలీ, ద్రవిడ్‌ సైతం కుర్రాళ్లు తప్పులు తెలుసుకుని ముందుకుసాగే అవకాశం ఇవ్వాలని సూచించారు.

ఇదే సమయంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సైతం విచారణ కొనసాగిస్తూనే రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. మొత్తానికి కోర్టు సహాయకుడి బాధ్యతల స్వీకారంతో కథ సుఖాంతమైంది. దీనిపై ఖన్నా మాట్లాడుతూ..‘రాహుల్, పాండ్యా ఇప్పటికే తగినంత శిక్ష అనుభవించారు. ఈ పరిణామంతో పరిణతి చెందుతారు. ఇకపై ప్రపంచకప్‌ సన్నాహం మీద దృష్టిపెడతారు. అక్కడ హార్దిక్‌ కీలకం కానున్నాడు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కోర్టు కేసు ఎదుర్కొంటూ కూడా దేశానికి ఆడుతున్నాడు. దీనినే మన క్రికెటర్లకు ఎందుకు వర్తింపచేయకూడదు.’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement