తీవ్ర ఉద్వేగానికి లోనైన గంభీర్

తీవ్ర ఉద్వేగానికి లోనైన గంభీర్


జోలపాటతో ఆమెను నిద్రపుచ్చలేను

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఔనత్యాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, వ్యక్తిగా తాను చేసే పనుల్లో ఎప్పుడూ ఓ మెట్టు ఎదుగుతుంటారు గంభీర్. తాజాగా ఆయన ప్రకటించిన ఓ నిర్ణయమే ఇందుకు కారణం. ఉగ్రదాడిలో మృతిచెందిన అధికారి అబ్దుల్ రషీద్. తండ్రి కోసం ఏడుస్తున్న కూతురు జోహ్రా ఫొటోపై స్పందిస్తూ మనస్సుకు హత్తుకునే పోస్ట్ చేశారు గంభీర్.



'జోహ్రా, జోలపాట పాడి నేను నిన్ను నిద్రపుచ్చలేను. కానీ నువ్వు నీ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు మాత్రం చేతనైన సాయం చేయగలను. నీ చదువు బాధ్యతలను జీవితాంతం చూసుకుంటానని' గంభీర్ ఓ ట్వీట్లో రాసుకొచ్చారు. 'నీ కన్నీటి బొట్టును నేలకు రాలనివ్వకు. నీ కన్నీటిబొట్టు తాకగానే భూమాత గుండె బరువెక్కుతోంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్‌కు ఇదే నా సెల్యూట్' అంటూ అందరిని కదిలించే విధంగా ట్విట్ చేశారు గంభీర్.



గత ఆగస్ట్‌లో జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌లో ఐపీఎల్ లో తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా అందుకున్న పారితోషికాన్ని సుక్మా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేసిన విషయం తెలిసిందే.


థ్యాంక్యూ గౌతమ్ సార్

తనకు సాయం చేస్తానని చెప్పిన క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు జవాను కూతురు జోహ్రా థన్యవాదాలు తెలిపింది. 'మీ ప్రకటనపై నాతో పాటు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా ధ్యేయమని' జోహ్రా చెప్పింది.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top