బెంచీకే పరిమితైన గంభీర్‌.. కొత్త కెప్టెన్‌ వివరణ!

Gautam Gambhir himself decided to sit out vs KKR, says DD skipper Shreyas Iyer - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న గౌతం గంభీర్‌ శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను బెంచీకే పరిమితం కావడం అభిమానుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే, గంభీర్‌ తనంత తానుగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడకూడదనేది ఆయన సొంత నిర్ణయమేనని కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాచ్‌ అనంతరం వివరణ ఇచ్చాడు.

2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న గంభీర్‌ ఇప్పటివరకు 4217 పరుగులు చేశాడు. కానీ ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ గంభీర్‌కు కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గంభీర్‌ కేవలం 96.59 స్ట్రైక్‌రేటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్‌ నాయకత్వంలో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో గెలుపొందింది.

దీంతో కెప్టెన్సీ నుంచి వైదొలగిన గంభీర్‌.. జట్టు నాయకత్వ పగ్గాలను యువకుడు శ్రేయస్‌కు అప్పగించాడు. దీంతో ఈ సీజన్‌లో తనకు అందబోయే వేతనాన్ని సైతం వదులుకోవాలని గంభీర్‌ నిర్ణయించాడు. రూ. 2.80 కోట్లకు ఢిల్లీ జట్టు గంభీర్‌ను కొనుగోలు చేసింది.

శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులతో తేడాతో ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌ తుది జట్టు నుంచి గంభీర్‌ను తొలగించాలని తాను అనుకోలేదని, కానీ, గంభీరే స్వయంగా ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారని శ్రేయస్‌ వివరించాడు. గత మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్‌ ఇలా తుదిజట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమని, ఆయన పట్ల తనకు ఎంతో గౌరవముందని తెలిపాడు. బాగా ఆడడం లేనందుకే ఆయన మ్యాచ్‌కు దూరంగా ఉన్నారని, ఆయన తప్పుకోవడం వల్ల కలిన్‌ మున్రోను తీసుకోవడానికి వీలు కలిగిందని, ఓపెనర్‌గా మున్రో జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడని చెప్పాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top