ఐసీసీపై గంగూలీ ధ్వజం! | Ganguly questions ICC on not using full ground covers | Sakshi
Sakshi News home page

ఐసీసీపై గంగూలీ ధ్వజం!

Jun 14 2019 8:10 PM | Updated on Jun 14 2019 8:20 PM

Ganguly questions ICC on not using full ground covers - Sakshi

నాటింగ్‌హామ్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌లు మొత్తంగా ర‌ద్దు చేయ‌డం ప‌ట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలి అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు. నాలుగేళ్లకోసారి జ‌రిగే ఈ మెగా టోర్న‌మెంట్‌లో వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌లను కనీసం ఓవర్లు నిర్వహించకుండానే ర‌ద్దు చేయాల్సి రావడం స‌హేతుకం కాదంటూ ఐసీసీపై ధ్వజమెత్తాడు. వ‌ర్షం ప‌డిన‌ప్ప‌టికీ మ్యాచ్‌ల‌ను కొన‌సాగించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవస‌రం ఉంద‌న్నాడు. ఒక్క వ‌ర్షానికే మ్యాచ్ మొత్తం ర‌ద్ద‌యిపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశ‌కు గుర‌వుతార‌ని, వాన గండం నుంచి గ‌ట్టెక్క‌డానికి కచ్చితమైన ప్ర‌ణాళిక‌లు ఉండాల్సిందేనంటూ మ్యాచ్‌ల నిర్వహణపై గంగూలీ మండిపడ్డాడు. ఇంగ్లండ్‌లో తయారయ్యే నాణ్యమైన కవర్లను ఇంగ్లండ్‌లోనే వినియోగించకపోవడాన్ని ఈ సందర్భంగా గంగూలీ తప్పుబట్టాడు.

కోల్‌క‌తాలోని ప్ర‌తిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా వ‌ర్షం ప‌డితే.. అవుట్ ఫీల్డ్‌ మొత్తాన్నీ క‌వ‌ర్ల‌తో క‌ప్పేస్తామ‌ని సౌర‌భ్ గంగూలి తెలిపాడు. దీనికోసం అవ‌స‌ర‌మైన క‌వ‌ర్ల‌ను తాము ఇంగ్లండ్ నుంచే కొనుగోలు చేస్తామ‌న్నాడు. ఖ‌రీదు ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.. ఆ క‌వ‌ర్లు భ‌లేగా ప‌నిచేస్తాయ‌ని కితాబిచ్చాడు. వ‌ర్షం వెలిసిన ప‌ది నిమిషాల్లోనే తేమ‌ను పీల్చేస్తాయ‌ని, మైదానం మొత్తంలో త‌డి లేకుండా చేస్తాయ‌ని చెప్పారు. ఎక్క‌డో ఇంగ్లండ్ నుంచి తాము కోల్‌క‌త్‌కు క‌వ‌ర్ల‌ను తెప్పించుకుంటుంటే.. అదే ఇంగ్లండ్‌లో జ‌రిగే మ్యాచ్‌ల కోసం వాటినే ఎందుకు వినియోగించ‌ర‌ని ప్రశ్నల వర్షం కురిపించాడు.
(ఇక్కడ చదవండి: మనకూ తగిలింది వరుణుడి దెబ్బ)

‘ఇంగ్లండ్‌లో త‌యార‌య్యే నాణ్య‌మైన క‌వ‌ర్ల‌ను ఇంగ్లండ్‌లోనే వినియోగించ‌డం వ‌ల్ల ర‌వాణా ఖ‌ర్చులు మిగులుతాయి. అదే సమయంలో ప‌న్నులు క‌ట్టాల్సిన ప‌నీ ఉండ‌దు. ప్ర‌పంచ‌క‌ప్ వంటి మెగా టోర్న‌మెంట్ల‌లో పిచ్‌ను మాత్ర‌మే క‌ప్పేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. అవుట్ ఫీల్డ్‌ మొత్తాన్నీ క‌వ‌ర్ల‌తో క‌ప్పి వేస్తే, వాన వెలిసిన త‌రువాత మ్యాచ్‌ల‌ను త్వరతగతిన కొన‌సాగించ‌డానికి వీలు ఉంటుంది. అవి చాలా తేలిగ్గా ఉంటాయి. ఎక్కువ మంది గ్రౌండ్‌మెన్‌ సాయం కూడా అవసరం లేదు. వరల్డ్‌కప్‌లో ఇంకా ఎన్నోమ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మెజారిటీ మ్యాచ్‌లకు వర్షం వెంటాడే అవకాశాలు లేకపోలేదు. ఇప్ప‌టికైనా స‌రే స్థానికంగా త‌యారయ్యే నాణ్య‌మైన క‌వ‌ర్ల‌ను తెప్పించుకుని గ్రౌండ్ మొత్తాన్నీ క‌వ‌ర్ చేయాల్సిన ఉంది. ఇలాంటి మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ విష‌యం కాస్త ఖ‌ర్చు ఎక్కువైనా భ‌రించ‌క త‌ప్ప‌దు. ఈ విషయంలో రాజీ పడితే వర్షం కారణంగా చాలా మ్యాచ్‌లు రద్దు అవుతాయి’ అని గంగూలీ పేర్కొన్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement