
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య... తాజాగా ఐసీసీ కోడ్ ఉల్లంఘన వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించాడనే కారణంగా జయసూర్యకు నోటీసులు జారీ చేసింది ఐసీసీ. ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు అందుబాటులో లేకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం, కావల్సిన సమాచారాన్ని, డాక్యుమెంట్లను సమర్పించకపోవడం వంటి ఫిర్యాదులతో పాటు ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణ ఆలస్యం కావడానికి ప్రత్యేక్షంగా కారణమవ్వడం, ఆధారాలు, సాక్ష్యాలను మాయం చేయడం వంటి రెండు ఆర్టికల్స్ కింద జయసూర్యకు నోటీసులు జారీ చేసింది ఐసీసీ.
ఈ ఆరోపణలపై తాజాగా స్పందించాడు జయసూర్య. ‘నా మీద మ్యాచ్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ గురించి గానీ లేదా వేరే అవినీతి చేశాననే ఆరోపణలు రాలేదు...కేవలం విచారణకు సహకరించలేదనే ఆరోపణలు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చిన జయసూర్య.. ‘నా వరకూ నేను ఏ పని చేసిన నియమాల ప్రకారమే నడుచుకున్నాను. కచ్చితంగా ఐసీసీ ప్యానెల్ ముందు సంజాయిషీ చెబుతాను’ అన్నాడు.
‘ఓ సిమ్ కార్డ్ దాచేయడం, మొబైల్ ఫోన్ సమర్పించేందుకు నిరాకరించడం’ వంటి ఆరోపణలు ఈ మాజీ సెలక్టర్‌పై వచ్చాయి. ‘నా ఫోన్‌లో పర్సనల్ మెసేజీలు, వీడియోలు ఉంటాయి.... అందుకే యాంటీ కరెప్షన్ అధికారులకు మొబైల్ ఇవ్వలేదు...’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు జయసూర్య. ‘ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడకూడదు... ఐసీసీ రూల్స్ ప్రకారం సమాచారం బయటికి చెప్పకూడదు...’ అంటూ సమాధానమిచ్చాడు ఈ మాజీ క్రికెట్ దిగ్గజం.
శ్రీలంక దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సనత్ జయసూర్య... 445 వన్డేలు, 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1996లో లంకజట్టు వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా లంక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందిస్తున్నాడు. సెలక్టర్స్ ఛైర్మెన్‌గా సేవలందించిన సనత్ జయసూర్య... రెండు వారాల్లోగా తనపై నమోదైన ఆరోపణలకు సమాధానం చెప్పాలని గడువు ఇచ్చిన ఐసీసీ, ఆలోగా అతని దగ్గర్నుంచి సంజాయిషీ రాకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ జయసూర్యపై అభియోగాలు రుజువైతే అతనిపై ఐదేళ్ల పాటు నిషేధం పడే అవకాశం ఉంది.