దుతీ చంద్ జాతీయ రికార్డు | Sakshi
Sakshi News home page

దుతీ చంద్ జాతీయ రికార్డు

Published Fri, Apr 29 2016 1:07 AM

దుతీ చంద్   జాతీయ రికార్డు

అబ్దుల్ నజీబ్‌కు కాంస్యం

న్యూఢిల్లీ: ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు రెండు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఏ అథ్లెట్ కూడా రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయాడు. మహిళల 100 మీటర్ల విభాగం ఫైనల్లో దుతీ చంద్ (ఒడిషా) 11.33 సెకన్లతో గమ్యానికి చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2000లో 11.38 సెకన్లతో రచిత మిస్త్రీ నెలకొల్పిన జాతీయ రికార్డును దుతీ చంద్ తెరమరుగు చేసింది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వ్యక్తిగత కోచ్ నాగపురి రమేశ్ వద్ద దుతీ చంద్ శిక్షణ తీసుకుంటోంది. 0.01 సెకన్లతేడాతో దుతీ చంద్ రియో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయింది.

మరోవైపు పురుషుల 100 మీటర్ల విభాగంలో ఓఎన్‌జీసీ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ 10.50 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు హీట్స్‌లో అమియా కుమార్ మలిక్ (ఒడిషా) 10.26 సెకన్లతో ఈ విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. 2010లో 10.30 సెకన్లతో అబ్దుల్ నజీబ్ నెలకొల్పిన రికార్డును అమియా బద్దలు కొట్టాడు. అయితే ఫైనల్లో అమియా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Advertisement
Advertisement