
ముగిసిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
సచిన్, పారుల్‌లకు రజతాలు
4x100 మీ. రిలేలో మరో రజతం
చివరి రోజు ఆరు పతకాలు
200మీ. స్ప్రింట్‌లో జ్యోతికి నిరాశ
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు కూడా భారత్ పతకాల వేట కొనసాగింది. శనివారం జరిగిన చివరి రోజు పోటీల్లో అథ్లెట్లు మరో అర డజను (6) పతకాలు సాధించారు. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి రజతం గెలుపొందగా. మరో రజత పతకం మహిళల 4్ఠ100 మీ. రిలేలో లభించింది.
పురుషుల 200 మీ. స్ప్రింట్‌లో అనిమేశ్ కుజూర్, మహిళల 800 మీ. పరుగులో పూజ సింగ్, మహిళల 400 మీ. హర్డిల్స్‌లో విత్య రామ్‌రాజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో రెండో పతకం గెలవాలని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మేటి రన్నర్ జ్యోతి యర్రాజీకి 200 మీటర్ల పరుగులో నిరాశ ఎదురైంది. 100 మీ. హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ఆమె... స్ప్రింట్‌లో మాత్రం 23.47 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానానికి పరిమితమైంది.
భారత్‌కు రెండో స్థానం
ఓవరాల్‌గా భారత్ 24 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ (2023లో 27 పతకాలు) ఈవెంట్‌తో పోల్చితే 3 పతకాలు తగ్గినా... బంగారంలో భారత్ మెరుగైంది. నాటి క్రీడల్లో 6 స్వర్ణాలు సాధిస్తే... తాజా ఈవెంట్‌లో 8 పసిడి పతకాలు సహా 10 రజతాలు, 6 కాంస్య పతకాలను భారత బృందం గెలిచింది. చైనా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. బీజింగ్ బృందం 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది.
28 పతకాలు గెలుచుకున్న జపాన్ మూడో స్థానంలో ఉంది. జపనీస్ అథ్లెట్లు రజతాలు (11), కాంస్యాలు (12) ఎక్కువగా సాధించినప్పటికీ స్వర్ణాల్లో (5) వెనుకబడటంతో మూడో స్థానం దక్కింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ చరిత్రలో భారత్ 2017లో 29 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. సొంతగడ్డ (భువనేశ్వర్)పై జరిగిన ఆ ఈవెంట్‌లో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పతకాలను భారత్ చేజిక్కించుకుంది.
పారుల్‌కు రెండో రజతం
ఈ పోటీల్లో ఇదివరకే మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో రజత పతకం సాధించిన పారుల్ చౌదరి డబుల్ ధమాకా సాధించింది. తాజాగా ఆమె మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంతో పోడియంలో నిలిచింది. సుదీర్ఘ పరుగు పోటీని ఆమె 15 నిమిషాల 15.33 సెకన్లలో ముగించి రెండో రజత పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరంలో విసిరి రజతం అందుకున్నాడు.
ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (84.39 మీ.)ను అధిగమించాడు. సచిన్ సహచరుడు... ఫైనల్ బరిలో నిలిచిన యశ్‌వీర్ సింగ్ కూడా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (82. 57 మీటర్లు) నమోదు చేసినప్పటికీ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్‌లో తెలంగాణ అథ్లెట్ నిత్య గంధె, అభినయ, స్నేహ, శ్రావణి నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ ప్రదర్శన 43.86 సెకన్లతో రెండో స్థానంతో రజత పతకాన్ని గెలుచుకుంది.
విత్య, పూజలకు కాంస్యాలు
ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విత్య రామ్‌రాజ్ కాంస్య పతకం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అథ్లెట్ పోటీని 56.46 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంతో ‘పోడియం’లో నిలిచింది. శనివారం ఈ ఫైనల్స్ బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్‌కు ఏడో స్థానం దక్కింది.
ఆమె పోటీని 57.46 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల ఈవెంట్‌లో మరో కాంస్యాన్ని పూజ సింగ్ సాధించింది. మహిళల 800 మీటర్ల పరుగులో పోటీపడిన ఆమె రేస్‌ను 2 నిమిషాల 01.89 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది.
స్ప్రింట్‌లో దశాబ్దం తర్వాత...
కొరియన్ గడ్డపై స్పింట్‌లో పతకానికి పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేశ్ కుజూర్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీలో 21 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ పరుగును 20.32 సెకన్లలో పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. కానీ వెంట్రుక వాసిలో 00.01 సెకన్ తేడాతో రజతం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగాన్ని (20.40 సెకన్లు) మెరుగుపర్చుకున్నాడు.
ఈ ఏడాది సీనియర్ అథ్లెటిక్స్‌లో ఆ టైమింగ్‌ను నమోదు చేశాడు. అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా; 20.31 సె.) రజతం నెగ్గారు. సరిగ్గా పదేళ్ల క్రితం (2015లో) 200 మీ. పరుగులో ధరమ్‌వీర్ సింగ్ కాంస్యంతో స్ప్రింట్‌లో భారత్ తొలి పతకం అందించాడు. ఆ తర్వాత నాలుగుసార్లు 2017, 2019, 2021, 2023 ఆసియా ఈవెంట్ జరిగినా... ఎవరూ స్ప్రింట్‌లో పతకం నెగ్గలేకపోయారు.