‘రాజు’ కూలె పచ్చికపై... | Defending champion Federer crashes out of Wimbledon | Sakshi
Sakshi News home page

‘రాజు’ కూలె పచ్చికపై...

Jul 12 2018 1:16 AM | Updated on Jul 12 2018 1:16 AM

 Defending champion Federer crashes out of Wimbledon - Sakshi

లండన్‌: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. వింబుల్డన్‌ పచ్చిక కోర్టులపై అద్వితీయ రికార్డు కలిగిన ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్రస్థానం ఈసారి క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. ఎనిమిదో సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఫెడరర్‌ 6–2, 7–6 (7/5), 5–7, 4–6, 11–13తో ఓడిపోయాడు. 4 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల పొడవు, 92 కేజీల బరువున్న అండర్సన్‌ 28 ఏస్‌లు సంధించి, 65 విన్నర్స్‌ కొట్టాడు. మరోవైపు తొలి రెండు సెట్‌లు గెలిచి... మూడో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉండి... అండర్సన్‌ సర్వీస్‌లో మ్యాచ్‌ పాయింట్‌ సంపాదించిన ఫెడరర్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ బయటకు కొట్టి విజయం సాధించే సువర్ణావకాశాన్ని వృథా చేసుకున్నాడు.

ఆ తర్వాత అండర్సన్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. అనంతరం ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని మూడో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్‌లో ఒకసారి ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అండర్సన్‌ అదే జోరులో ఈ సెట్‌నూ దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌కూ హోరాహోరీగా పోరాడారు. చివరకు ఫెడరర్‌ సర్వీస్‌ చేసిన 23వ గేమ్‌లో అండర్సన్‌ బ్రేక్‌ పాయింట్‌ సంపాదించాడు. అనంతరం తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సంచలన విజయం దక్కించుకున్నాడు.  వరుసగా 20వసారి వింబుల్డన్‌ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్‌ మ్యాచ్‌ పాయింట్‌ సంపాదించాక ఓడిపోవడం ఇదే తొలిసారి. కెవిన్‌ కరెన్‌ (1983లో) తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్‌ గుర్తింపు పొందాడు.  

జొకోవిచ్‌ జోరు...
మరో క్వార్టర్‌ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 3–6, 6–2, 6–2తో నిషికోరి (జపాన్‌)పై గెలిచి 2015 తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement