
నా కెప్టెన్సీపై నిర్ణయం బీసీసీఐదే: ధోనీ
కెప్టెన్సీ మార్పు విషయంపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు.
ముంబై: కెప్టెన్సీ మార్పు విషయంపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని స్పష్టం చేశాడు. తాను కెప్టెన్గా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తాను నిర్ణయించలేనని, బోర్డే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు.
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా ధోనీ రిటైరయ్యాక విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా టి-20, వన్డే ఫార్మాట్లలో ధోనీ సారథ్యం వహిస్తున్నాడు. ధోనీ వయసు (35), 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించాలని, విరాట్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ధోనీ మాట్లాడుతూ.. 'వచ్చే ప్రపంచ కప్నకు ఇంకా సమయముంది. ఈలోపు మార్పులు జరగవచ్చని భావిస్తున్నా' అని చెప్పాడు.