బాల్‌ ట్యాంపరింగ్‌ నావల్లే : వార్నర్‌ భార్య

David Warners Wife Candice Says Ball Tampering Crisis My Fault - Sakshi

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటన తనవల్లే జరిగిందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భార్య క్యాండిస్‌ వార్నర్‌ తెలిపారు. సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ఈ ఘటనకంతా తానే కారణమని, ఇది తనని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తానేమి తన భర్త తప్పిదాన్ని సమర్ధించడం లేదని, కానీ వార్నర్‌ తన భార్య, పిల్లలను రక్షించుకునే ప్రయత్నంలో మాత్రమే అలా చేసాడన్నారు . కానీ ఆ సమయంలో తానక్కడుంటే ఇలా జరిగేది కాదని, వార్నర్‌ ఒత్తిడికి లోనవ్వకుండా తాను అండగా నిలిచేదానినని పేర్కొన్నారు. అభిమానులు, ప్రత్యర్ధి ఆటగాళ్లు తన మీద జోకులు వేస్తూ.. వార్నర్‌కు ఆగ్రహం తెప్పించేలా మాస్క్‌ల ధరించారని, ఇవే వార్నర్‌ను మానసికంగా దెబ్బతీసాయని క్యాండిస్‌ చెప్పుకొచ్చారు.

వార్నర్‌ భార్య క్యాండిస్‌, న్యూజిలాండ్‌ రగ్బీ స్టార్‌ సోని బిల్‌ విలియమ్స్‌కు ఎఫైర్‌ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డీ కాక్‌ వార్నర్‌ను రెచ్చగొట్టేలా ప్రస్తావించాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్‌ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సోని బిల్‌ మాస్కులు ధరించి రావడం వార్నర్‌ మానసిక స్థితి మరింత దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఓటమి నుంచి తప్పించుకునేందుకు బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించాడని క్యాండిస్‌ వెనుకేసుకొచ్చారు. వార్నర్‌ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆసీస్‌ అభిమానులు సానుభూతి కనబరుస్తూ కొంత ఓపికతో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇక ట్యాంపరింగ్‌ పూర్తి బాధ్యత తనేదనని వార్నర్‌ శనివారం మీడియా ముందు పశ్చాతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరఫున ఆడనని, శాశ్వతంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అంశంపై కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top