‘రైజింగ్‌’కు రెడీ

David Warner return Sunrisers Hyderabad team - Sakshi

రెండో టైటిల్‌ వేటలో హైదరాబాద్‌ టీమ్‌ వార్నర్‌ రాకతో మరింత పటిష్టం

డేవిడ్‌ వార్నర్‌... ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయప్రస్థానంలో సింహభాగం అతనిదే. వరుసగా ప్రతీ ఏటా టాప్‌స్కోరర్‌గా నిలవడంతో పాటు 2016లో కెప్టెన్‌గా కూడా జట్టుకు టైటిల్‌ అందించాడు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో గత ఏడాది లీగ్‌కు దూరమైన అతను ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతుండటంతో సహజంగానే జట్టు బలం పెరిగింది.

వార్నర్‌ గైర్హాజరీలో  టీమ్‌ను అటు ఆటగాడిగా, ఇటు నాయకుడిగా  అద్భుతంగా నడిపించి రన్నరప్‌గా నిలిపిన విలియమ్సన్‌ కెప్టెన్‌గా కొనసాగనుండగా... ఇతర ప్రధాన ఆటగాళ్లు టీమ్‌లోనే ఉండటం రైజర్స్‌ అవకాశాలను మరింత పెంచుతోంది. అటు బ్యాటింగ్, ఇటు పేస్, స్పిన్‌ బౌలింగ్, ఆల్‌రౌండర్‌ నైపుణ్యం... ఇలా అన్ని  రంగాల్లో సరైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్న  హైదరాబాద్‌ రెండోసారి విజేతగా నిలుస్తుందా చూడాలి.  

బలాలు: సన్‌రైజర్స్‌ మొదటినుంచి తుది జట్టు విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఇదే ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. స్థిరమైన ఓపెనర్లు, పేస్‌ బౌలింగ్‌ బృందం, స్పిన్‌ వ్యూహాలు అన్నీ పక్కాగా జరిగాయి. ధావన్‌ దూరమయ్యాడు కాబట్టి వార్నర్, విలియమ్సన్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయం. 2018లో విలియమ్సన్‌ ఏకంగా 8 అర్ధసెంచరీలతో 735 పరుగులు చేసి లీగ్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతనికి వార్నర్‌లాంటి విధ్వంసకారుడు తోడైతే ఇక అద్భుత ఆరంభం ఖాయం. ఆ తర్వాత మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, యూసుఫ్‌ పఠాన్, దీపక్‌ హుడా, రికీ భుయ్‌లాంటి వారు బ్యాటింగ్‌ భారం మోస్తారు.

రైజర్స్‌కు గుర్తుంచుకోదగ్గ విజయాలు అందించిన భువనేశ్వర్‌ మరోసారి పేస్‌ భారం మోయనుండగా, ఇటీవలే భారత జట్టుకు ఆడిన ఖలీల్‌ అహ్మద్, సిద్ధార్థ్‌ అండగా నిలుస్తారు. ఇక రషీద్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్‌కు ఆడిన రెండు సీజన్లలో కలిపి కేవలం 6.68 ఎకానమీతో 38 వికెట్లు తీసిన రషీద్‌ వేసే 4 ఓవర్లను ఎదుర్కోవడం ఏ ప్రత్యర్థి జట్టుకైనా కష్టమే.  తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టిన బెయిర్‌ స్టో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే నలుగురు విదేశీ కోటాలో వార్నర్, విలియమ్సన్, రషీద్‌ ఖాయం కాగా... నాలుగో స్థానం కోసం చాలా పోటీ ఉంది. 

బలహీనతలు:  ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ విజయాలన్నీ ప్రధానంగా బౌలింగ్‌ ప్రదర్శన వల్లే వచ్చాయి. అతి తక్కువ స్కోర్లు చేసి కూడా జట్టు మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా జట్టుకు మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ సమస్య ఉంది. భారత ఆటగాళ్లే ఆడాల్సిన ఈ స్థానాల్లో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. మనీశ్‌ పాండే, హుడా పెద్దగా ఫామ్‌లో లేకపోగా యూసుఫ్‌ పఠాన్‌లో నాటి పదును తగ్గింది. విలియమ్సన్‌ భుజం గాయంనుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది. అయితే గతంలో కూడా ఇలాంటి లోపాలున్నా తమ వ్యూహాలతో వాటిని అధిగమించిన సన్‌రైజర్స్‌కు మళ్లీ ప్లే ఆఫ్‌ చేరగలిగే సత్తా ఉంది.  

జట్టు వివరాలు: విలియమ్సన్‌ (కెప్టెన్‌), వార్నర్, రషీద్, షకీబ్, నబీ, గప్టిల్, స్టాన్‌లేక్, బెయిర్‌స్టో (విదేశీ ఆటగాళ్లు), యూసుఫ్‌ పఠాన్, అభిషేక్‌ శర్మ, సాహా, థంపి, రికీ భుయ్, ఖలీల్‌ అహ్మద్, హుడా, భువనేశ్వర్, నటరాజన్, సందీప్‌ శర్మ, షాబాజ్‌ నదీమ్, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, సిద్ధార్థ్‌ కౌల్, శ్రీవత్స గోస్వామి.

►హైదరాబాద్‌ మొదటి జట్టు దక్కన్‌ చార్జర్స్‌తో పోలిస్తే సన్‌రైజర్స్‌ రికార్డు ఐపీఎల్‌లో ఘనంగానే ఉంది. 2013నుంచి ఆరు సార్లు బరిలోకి దిగిన  జట్టు ఒక సారి టైటిల్‌ గెలుచుకోగా, మరోసారి రన్నరప్‌గా నిలిచి మరో రెండు సార్లు కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో సమష్టితత్వంతో నిలకడగా రాణించిన టీమ్‌ చివరకు ఫైనల్లో ఓడింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top