దేశానికి ఇక ఆడలేనేమో!  | David Warner resigned to never playing for Australia again | Sakshi
Sakshi News home page

దేశానికి ఇక ఆడలేనేమో! 

Apr 1 2018 1:10 AM | Updated on Apr 1 2018 1:10 AM

 David Warner resigned to never playing for Australia again - Sakshi

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం అనంతరం డేవిడ్‌ వార్నర్‌ తొలిసారి మీడియా ముందుకొచ్చాడు. ఆ ఘటనకు సూత్రధారిగా నింద మోస్తున్న అతడు... తన తప్పునకు అందరికీ క్షమాపణలు చెప్పాడు. స్టీవ్‌ స్మిత్‌లాగే ఒక దశలో భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై దేశానికి ఆడలేనేమోనని అనుమానం వ్యక్తం చేశాడు.   

సిడ్నీ: తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, తలవంపులు తెచ్చినందుకు క్రికెట్‌ ప్రేమికులు, అభిమానులకు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో తాను మళ్లీ దేశానికి ఆడలేనేమోనంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే ఈసారి తప్పు చేయనని పేర్కొన్నాడు. ఈ క్రీడా ప్రయాణంలో అండగా నిలిచి, ప్రోత్సహించిన వారి గౌరవం తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. శనివారం అతడు ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ‘జట్టు సభ్యులు, కోచింగ్‌ సిబ్బందికి నా క్షమాపణలు. కేప్‌టౌన్‌ టెస్టులో జరిగిన దానికి నాదే పూర్తి బాధ్యత. క్రికెట్‌ ఆస్ట్రేలియాను కూడా క్షమించమని అడుగుతున్నా. దేశ క్రికెట్‌ సంస్కృతిలో మార్పునకు మీరు తలపెట్టిన సమీక్షకు నా పూర్తి మద్దతునిస్తున్నా’ అని వార్నర్‌ చెప్పాడు. 

అప్పీల్‌పై ఆలోచించి నిర్ణయం... 
ఏడాది నిషేధంపై అప్పీలుకు వెళ్లే ఆలోచనను కుటుంబ సభ్యులతో చర్చించి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తానని వార్నర్‌ చెప్పాడు. ట్యాంపరింగ్‌లో ఇతర ఆటగాళ్ల ప్రమేయం, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అన్నవాటిని ప్రస్తావించలేదు. ట్యాంపరింగ్‌ గురించి ఇంకా వివరాలు కోరగా... ‘ఆ ఘటనలో నా పాత్ర, బాధ్యతకు క్షమాపణలు కోరేందుకే ఈ రోజు మీ ముందుకొచ్చా. తీవ్ర నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం. ఇది క్షమించలేనిది. వైస్‌ కెప్టెన్‌గా నా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యా. ఏం జరిగిందో, ఒక మనిషిగా నేనేవరినో రాబోయే రోజుల్లో ఒక్కసారి తరచి చూసుకుంటా. దీనిపై సలహాలు తీసుకుని భారీ మార్పునకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు.  

భార్య, పిల్లలకూ క్షమాపణలు 
మీడియా సమావేశంలో వార్నర్‌ తన భార్య, పిల్లలతో పాటు విదేశీగడ్డపై ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘నా కుటుంబాన్ని క్షమాపణలు కోరుతున్నా. ప్రత్యేకించి నా భార్య, కూతుళ్లను. మీ ప్రేమే నాకు అన్నింటికంటే ముఖ్యం. మీరు లేకుంటే నేను లేను. ఈ పరిస్థితి మళ్లీ  తీసుకురాను. అందరితో చర్చించాకే ఆటకు వీడ్కోలు చెప్పాలా వద్దా అనేది ఆలోచిస్తా’ అని అన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement