కోహ్లి దళం... గెలుస్తుందా హృదయం?

cricket world cup 2019 team india Strengths and weaknesses - Sakshi

ఆశలు రేపుతున్న కోహ్లి సేన

ప్రపంచ కప్‌ ఫేవరెట్లలో చోటు

ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయాలి

చిన్నచిన్న లోపాలు అధిగమించాలి

ఈ ప్రపంచ కప్‌లో... ఆతిథ్య ఇంగ్లండ్‌ హాట్‌ ఫేవరెట్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఫేవరెట్‌

మరి టీమిండియా...? నిశ్శబ్ద ఫేవరెట్‌!

ఔను... కప్‌ అంచనాల్లో కోహ్లి సేనకు సరిగ్గా సరిపోయే పదం ఇది. అదరగొట్టే ఆటకు తోడు సొంతగడ్డ కాబట్టి ఇంగ్లండ్‌ భీకరంగా కనిపిస్తోంది. అనూహ్యంగా పుంజుకొన్న ఆస్ట్రేలియా సరైన సమయానికి ఊపులోకొచ్చింది. ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు, నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి, విశేష అనుభవజ్ఞుడైన ధోనిలాంటి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్, పేస్‌ ఆల్‌రౌండర్లు, నాణ్యమైన పేస్‌ త్రయం, మణికట్టు స్పిన్నర్ల కూర్పు కారణంగా భారత్‌ మాత్రం మొదటి నుంచి ఒకే తరహా ప్రదర్శనతో పోటీలో ఉంది. ఈ జట్టు కప్‌ కొట్టాలంటే కావాల్సిందల్లా... అలసత్వానికి తావివ్వకుండా, చిన్నచిన్న లోపాలు సరిచేసుకుంటూ పోవడమే. ఈ క్రమంలో గత అనుభవాలు, మరీ ముఖ్యంగా ఇక్కడే జరిగిన 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ పరాజయాన్ని గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు అవకాశం లేకుండా ముందుకెళ్లాలి.

అన్ని రంగాల్లో బలంగా ఉన్నామని... నిలకడగా ఆడుతున్నామని... ఇలా పైకి ఎంత చెప్పుకొన్నా... 1983 నాటి (వేదిక ఇంగ్లండ్‌) సమష్టి గెలుపును మినహాయిస్తే విదేశంలో ప్రపంచ కప్‌ అనగానే టీమిండియా టైటిల్‌ నెగ్గే అవకాశాలు కొంచెం అనుమానమే అన్నట్లుంటాయి. 2003 (దక్షిణాఫ్రికా)లో ఫైనల్‌ చేరినా ఆటతీరులో ఆస్ట్రేలియాను అందుకోలేక చేతులెత్తేసింది. 2015 (ఆస్ట్రేలియా)లో సెమీఫైనల్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఇవికాక విదేశాల్లో జరిగిన మిగతా కప్‌లలో మన ప్రదర్శన సాదాసీదానే. దీన్నిబట్టి చూస్తే ఇంగ్లండ్‌లో జరుగబోయే ప్రపంచకప్‌ టోర్నీలో కోహ్లి సేన కప్‌ సాధిస్తే చరిత్ర తిరగరాసినట్లే. ఈ నేపథ్యం లో భారత జట్టు బలాబలాలు, బలహీనతలు, సరిదిద్దు్దకోవాల్సిన లోపాలు ... ప్రత్యర్థులపై పైచేయికి ఏం చేయాలి? అనే దానిపై సభ్యుల వారీగా విశ్లేషణ...     
–సాక్షి క్రీడా విభాగం

విరాట్‌ కోహ్లి

బలాలు: భూతద్దం పెట్టి వెదికినా లోపాలు కనిపెట్టలేని టెక్నిక్, తిరుగులేని సాధికారత, దూకుడు కలగలిసిన బ్యాట్స్‌మన్‌. జట్టు బ్యాటింగ్‌ మూలస్తంభం. లక్ష్యాల ఛేదనలో మొనగాడు. కెప్టెన్‌గానూ బాధ్యతలు మోస్తున్నా ఆ ప్రభావం బ్యాటింగ్‌పై ఏమాత్రం లేనట్లు ఆడతాడు.  
బలహీనతలు: ఎప్పుడో ఒకసారి విఫలం కావడం తప్ప పెద్దగా ఏమీ లేవు. అయితే, ఈ వైఫల్యం కప్‌లో కీలక మ్యాచ్‌ల సందర్భంగా కాకుండా చూసుకోవాలి.  
ఏం చేయాలి?: సలహాలు ఇవ్వడంలో, వ్యూహాలు పన్నడం లో ధోని, రోహిత్‌ అండగా ఉంటారు కాబట్టి... అనవసర ఒత్తి డిని కొనితెచ్చుకోకుండా బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ చూపాలి.

రోహిత్‌ శర్మ

బలాలు: కుదురుకున్నాడంటే... ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాట్స్‌మన్‌. ముఖ్యంగా వన్డేల్లో. ఓపెనర్‌గా అద్భుత రికార్డుంది. మైదానం నలువైపులా బంతిని బాదుతూ అతి భారీ ఇన్నింగ్స్‌ ఆడగలడు.  
బలహీనతలు: అత్యున్నత శ్రేణి బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో చేతులెత్తేస్తాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ ఇచ్చేస్తాడు.
ఏం చేయాలి?: క్రీజులో దిగిన వెంటనే బాదేసేయాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. కాసేపు నిలిస్తే పరుగులు అవే వస్తాయని గ్రహించి సంయమనం చూపాలి.

శిఖర్‌ ధావన్‌

బలాలు:  జట్టులోని ఏకైక ఎడంచేతి స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌. ఇంగ్లండ్‌లో జరిగిన గత ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించాడు.  
బలహీనతలు: టెక్నిక్‌ గొప్పదేమీ కాదు. కొన్నిసార్లు తేలిగ్గా వికెట్‌ ఇచ్చేస్తాడు. శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడు. తన వికెట్‌కు తానే విలువివ్వడం లేదన్నట్లు ఉంటుంది ఇతడి బాడీ లాంగ్వేజ్‌.
ఏం చేయాలి?: రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ తరహాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌లో నిలకడ ముఖ్యమని తెలుసుకోవాలి. ఓపెనర్‌గా తాను నిలదొక్కుకుంటే జట్టుకు ఎంత ప్రయోజనమో గ్రహించి భారీ స్కోర్లకు ప్రయత్నించాలి.

కేఎల్‌ రాహుల్‌

బలాలు: క్లాస్, మాస్‌ కలగలిసిన నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. తనదైన శైలి షాట్లతో పరుగులు రాబడతాడు. భారీ స్కోర్లు చేయగలడు.  
బలహీనతలు: జట్టులో చోటు అనుమానాస్పదం కారణంగానో, మరే ఇతర అంశాల రీత్యానో మానసిక దృఢత్వం తక్కువ.  
ఏం చేయాలి?: ఓపెనింగ్‌ తప్ప మరే స్థానంలో ఆడలేనన్నది రాహుల్‌ ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. ఆటతీరూ అంతే ఉంటుంది. ఈ భావన నుంచి అతడు బయటపడాలి. ఒకటి, రెండు మ్యాచ్‌లు విఫలమైనా స్థయిర్యం కోల్పోకుండా ఉండాలి.  

మహేంద్రసింగ్‌ ధోని

బలాలు: వికెట్ల వెనుక మహా మేధావి. బ్యాట్స్‌మెన్‌ కదలికలను చదువుతూ బౌలర్లకు ఇతడిచ్చే సలహాలు మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఇతడు ఆడే ఇన్నింగ్స్‌లు జట్టు ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి.
బలహీనతలు: బ్యాటింగ్‌లో... మరీ చెప్పుకోవాలంటే ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో ఎలా రాణిస్తాడనేది కీలకం. ఐపీఎల్‌ ఫామ్‌ ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి.  
ఏం చేయాలి?: చివరి ప్రపంచ కప్‌ ఆడబోతున్నందున దానిని మరపురానిదిగా మార్చుకోవాలి. ఫినిషర్‌గా పూర్వ ఫామ్‌ను అందుకోవాలి. తను దూకుడుగా ఆడలేకపోయినా... హార్దిక్‌ పాండ్యా వంటి యువకులను స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాలి.

విజయ్‌ శంకర్‌

బలాలు: అచ్చం హార్దిక్‌లానే మూడు అంశాల్లోనూ ఉపయోగపడగల ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని చూస్తున్నారు. ఇంగ్లండ్‌ వాతావరణం కలిసొస్తే బౌలింగ్‌లోనూ ప్రభావవంతం అవుతాడు.
బలహీనతలు: బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా ఇతడి ప్రతిభపై భరోసా ఉంచలేని పరిస్థితి. ఒక మ్యాచ్‌లో రాణించకుంటే మళ్లీ అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ప్రస్తుత భారత జట్టులో ఇంగ్లండ్‌ గడ్డపై ఆడిన అనుభవం లేని ఏకైక ఆటగాడు.
ఏం చేయాలి: ఇప్పుడు వేగంగా చేస్తున్న 40–50 పరుగులనే మరింత భారీ స్కోర్లుగా మలచాలి. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బౌలర్‌గానూ ఓ చెయ్యేస్తే జట్టు వనరులు మరింత మెరుగుపడతాయి.

కేదార్‌ జాదవ్‌

బలాలు: మంచి బ్యాట్స్‌మన్‌. అనూహ్యంగా బౌలర్‌గానూ ఓ చేయి వేస్తున్నాడు. చివరి ఓవర్లలో భారీ షాట్లతో స్కోరు పెంచగలడు. ఐదో నంబరు బ్యాట్స్‌మన్‌గా స్థానం ఖాయం చేసుకున్నాడు. లక్ష్యం ఎంత ఉన్నా నిబ్బరంగా ఆడగలడు.
బలహీనతలు: తొందరగా గాయపడే శరీరం జాదవ్‌ది. గత మూడేళ్లలో ఐపీఎల్‌ సహా సీజన్‌కు కనీసం ఒక సిరీస్‌కైనా ఇతడు ఈ కారణంగానే దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. తాజాగా గాయం నుంచి కోలుకుంటూనే ప్రపంచ కప్‌కు వచ్చాడు.
ఏం చేయాలి?: మెగా టోర్నీలో బంతితోనూ ఉపయోగపడగల విలువైన ఆటగాడు జాదవ్‌. జట్టు వ్యూహాల్లో కీలకం అవుతాడు కాబట్టి ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఉండాలి.

దినేశ్‌ కార్తీక్‌

బలాలు: రిజర్వ్‌ కీపర్‌ అయినా పరిస్థితులను బట్టి బ్యాట్స్‌మన్‌ గా నాలుగో స్థానంలో దింపగల సత్తా ఉన్నవాడు. మధ్య ఓవర్లలో కీలకమవుతాడు. బ్యాటింగ్‌ టెక్నిక్, దూకుడు రెండూ ఉన్నాయి.
బలహీనతలు: మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశాలు రాకపోవడం, అంచనాలు పెరిగి అవకాశం వచ్చినపుడు విఫలమవడం కార్తీక్‌లోని లోపం.  
ఏం చేయాలి?: ప్రపంచ కప్‌లో చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి నాలుగో స్థానంలోనో, ధోని బదులుగానో కార్తీక్‌కు అవకాశం తప్పకుండా ఉంటుంది. దీనిని అతడు ఆత్మ విశ్వాసంతో తీసుకోవాలి.  

హార్దిక్‌ పాండ్యా

బలాలు: హార్డ్‌ హిట్టర్‌. మంచి పేస్‌ ఆల్‌రౌండర్‌. దీంతో మూడో పేసర్‌ స్థానాన్ని ఇతడితో భర్తీ చేసే వీలు కలుగుతోంది.  
బలహీనతలు: పూర్తిగా కాకున్నా, గాయాల బెడద కొంత ఉంది. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా చూసుకోవాలి.
ఏం చేయాలి?: చేదు జ్ఞాపకాలు మర్చిపోయి... ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్న హార్దిక్‌ మంచి లయలో ఉన్నాడు. లోయరార్డర్‌లో స్కోరు పెంచే బాధ్యతను తీసుకోవాలి.  

రవీంద్ర జడేజా

బలాలు: హార్దిక్‌ తర్వాత జట్టులో ఉన్న మరో ఆల్‌రౌండర్‌. చకచకా ఓవర్లు వేస్తాడు.   
బలహీనతలు: పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే బంతిని స్పిన్‌ చేయలేడు. వికెట్లు తీయలేకపోవడం మరో పెద్ద లోపం.   
ఏం చేయాలి?: పరుగులు నిరోధిస్తూనే వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్‌లో మెరిపించాలి. ఫీల్డింగ్‌లో హార్దిక్‌తో కలిసి పరుగులు నిరోధించాలి.  

భువనేశ్వర్‌  

బలాలు: 140 కి.మీ.పైగా వేగం కొనసాగిస్తూనే స్వింగ్‌ రాబట్టగల పేసర్‌. ప్రారంభ ఓవర్లలో వికెట్‌ తీస్తూ, చివరి ఓవర్లలో పరుగులు నిరోధిస్తాడు. ఇంగ్లండ్‌ వాతావరణంలో కీలకం కాగలడు.  
బలహీనతలు: ఇటీవల ఒక్కసారిగా ఫామ్‌ కోల్పోయాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా సిరీస్‌ లో టెస్టు ఆడే అవకాశం ఇవ్వలేదు. తర్వాత వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు.ప్రస్తుతం ఫామ్‌ కొంత డోలాయమానంగా ఉంది.   
ఏం చేయాలి?: తన బౌలింగ్‌కు నప్పే ఇంగ్లండ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే జట్టుకు మేలు అవుతుంది.

యజువేంద్ర చహల్‌

బలాలు: మణికట్టు స్పిన్నర్‌. కప్‌లో మిగతా జట్లలో చాలావాటికి సవాల్‌ విసరగలడు. లయ దొరికితే చహల్‌ను తట్టుకోవడం కష్టం.
బలహీనతలు: కొన్ని సిరీస్‌ల నుంచి చహల్‌ను ప్రత్యర్థులు చదివేస్తున్నట్లు కనిపిస్తోంది. అతడి బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొంటుండటమే దీనికి నిదర్శనం.  
ఏం చేయాలి?: ప్రత్యర్థులు మెరుగైనంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. చక్కటి వ్యూహాలతో వారిని కట్టడి చేయగలిగితే చహల్‌ విజయవంతమైనట్లే.

కుల్దీప్‌ యాదవ్‌

బలాలు: ప్రపంచ కప్‌లో ఏకైక చైనామన్‌ బౌలర్‌. ప్రత్యర్థులకు ఇతడి బౌలింగ్‌ అర్ధమయ్యేలోపే చేయాల్సినంత నష్టం చేస్తాడు. గతేడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు.  
బలహీనతలు: ఐపీఎల్‌లో వైఫల్యంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. జట్టు నుంచి తప్పించడం మానసికంగా ప్రభావం చూపింది.  
ఏం చేయాలి?: అనవసర అంశాల జోలికి పోకుండా ఆటపై దృష్టి పెడితే బాగుటుంది. ఫీల్డింగ్‌లోనూ మెరుగుపడాలి. జట్టు యాజమాన్యం అండ ఉంది కాబట్టి మనో నిబ్బరంతో మైదానంలో రాణించాలి.

జస్‌ప్రీత్‌ బుమ్రా

బలాలు: యార్కర్లు, అంతుచిక్కని బంతుల కారణంగా ఈ కప్‌లో అందిరి కళ్లూ ఇతడి పైనే ఉన్నాయి. విశేషంగా రాణిస్తాడని అంచనాలు వేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటూనే పని ముగిస్తాడు.  
బలహీనతలు: బౌలింగ్‌ పరంగా పెద్దగా పొరపాట్లు చేయకున్నా... చిన్నచిన్న తప్పులే బుమ్రాను విలన్‌ను చేస్తాయి. రెండేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ‘నో బాల్‌’ ఇలాంటిదే.  
ఏం చేయాలి?: పరిణతి సాధించిన బుమ్రా ప్రస్తుతం కెరీర్‌ అత్యున్నత స్థితిలో ఉన్నాడు. పరిపూర్ణ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. కప్‌లో భారత బౌలింగ్‌ భారాన్ని మోస్తున్న స్పృహతో రాణిస్తే జట్టు అవకాశాలు మరింత పెరుగుతాయి.

మొహమ్మద్‌ షమీ

బలాలు:  కచ్చితత్వంతో ఆరంభంలో, చివర్లో యార్కర్లతో చెలరేగే షమీని ఎదుర్కొనడం సవాలే. సరిగ్గా బంతులేస్తే బుమ్రా కంటే ఇతడే ప్రమాదకారి.
బలహీనతలు: బైస్‌ రూపంలో కానీ, బ్యాట్స్‌మన్‌ ద్వారా కానీ పరుగులివ్వడం షమీ బలహీనత. గాయపడకుండా చూసుకోవడమూ ముఖ్యమే.
ఏం చేయాలి?: షమీ ఇప్పుడు మెరుగుపడ్డాడు. గాయాల బెడద కూడా లేదు. బుమ్రాకు తోడుగా షమీ ప్రత్యర్థిపై విరుచుకుపడితే చాలావరకు బ్యాట్స్‌మెన్‌కు భారం తగ్గినట్లే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top