ప్రస్తుతం క్రికెట్‌లో అవకాశాలతో పాటు పోటీ కూడా పెరిగిందని, ఈ స్థితిలో చక్కటి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే నిలబడగలరని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డారు.
మాదాపూర్, న్యూస్‌లైన్: ప్రస్తుతం క్రికెట్‌లో అవకాశాలతో పాటు పోటీ కూడా పెరిగిందని, ఈ స్థితిలో చక్కటి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే నిలబడగలరని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డారు. అందుకోసం వ్యక్తిగత కోచింగ్ కీలకంగా మారిందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడి ట్రియంప్ అకాడమీలో రాజూస్ క్రికెట్ క్లబ్‌లో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గతంలో క్రికెట్‌లో శిక్షణకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా స్పష్టత ఉండకపోయేది.
కోచ్‌లు కూడా ఆటకంటే క్రమశిక్షణవంటి విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. అయితే ఇప్పుడు క్రికెట్‌లో పోటీతో పరిస్థితి మారింది’ అని కిర్మాణీ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆయన చెప్పారు. ‘ఎప్పటికప్పుడు క్రికెటర్లు తమ ఆటకు పదును పెట్టాలి. ఎంత బాగా ఆడుతున్నా మరింతగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
పైగా ఒక టోర్నీలో పరుగులు సాధించడం గొప్ప విషయం కాదు. నిలకడగా ఆడితేనే కుర్రాళ్లకు భవిష్యత్తు ఉంటుంది’ అని ఈ దిగ్గజ కీపర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, అంకితభావంతోనే ఇది సాధ్యమని ఆయన అన్నారు. ఇటీవల భారత జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలక్షన్ కమిటీపై తరచూ వివాదాలు వస్తున్నాయని, ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఇలాంటి ప్రశ్నలు ఎదురు కావని కిర్మాణీ విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో జెమ్ మోటార్స్ చైర్మన్ రాజు యాదవ్, క్రికెట్ క్లబ్ నిర్వాహకులు రాజు, ట్రియంప్ స్పోర్ట్స్ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.