
ఒక్క మాదాపూర్ జోన్‌లోనే 644 కెమెరాలు నో వర్క్
రోడ్ల విస్తరణలో 300 సీసీ టీవీలు మాయం
సరైన నిర్వహణ లేక మిగిలినవీ మొరాయింపు
అక్రమ కేబుళ్ల తొలగింపులో కెమెరాల వైర్లూ కత్తిరింపు
శాంతిభద్రతల నిర్వహణ, నేరాల దర్యాప్తులపై ప్రభావం
సాక్షి,హైదరాబాద్: దొంగలను గుర్తించాలన్నా, దోపిడీ ముఠాల ఆటకట్టించాలన్నా.. ఏమూలలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం. కానీ.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీసీ కెమెరాల నిర్వహణ డొల్లతనంగా మారింది. రోడ్ల విస్తరణ, అక్రమ కేబుల్ వైర్ల తొలగింపు సమయంలో కెమెరాల వైర్లూ తొలగించడం, వార్షిక నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలలో నిఘా నేత్రాలు నిద్దరోయాయి. సైబరాబాద్‌లో అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్‌లో ఏకంగా 644 సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు.
రోడ్ల విస్తీర్ణం, వైర్ల కత్తిరింపు..
రోడ్డు ప్రమాదాలు, చెయిన్ స్నాచింగ్‌లు, దాడులు, హత్యోదంతాలు ఇతరత్రా కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలు కీలకం. కేసుల దర్యాప్తు, పోలీసుల పరిశోధనకు ఆయువుపట్టు లాంటి కెమెరాల నిర్వహణపై నిర్లక్ష్యం అలుముకుంటోంది. వార్షిక నిర్వహణ సరిగా లేక, విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ తీగలను తొలగించే సమయంలో సీసీటీవీ కెమెరాల వైర్ల తొలగింపు తదితర కారణాలతో కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు నేరాల దర్యాప్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.14 లక్షల సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో ‘నేను సైతం’ కింద 1.87 లక్షల కెమెరాలు, ‘నిర్భయ, సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్‌ల కింద 27 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 41 శాతం కెమెరాలు పని చేయడం లేదని అధికారులు గుర్తించారు.
ప్రత్యేక వ్యవస్థే లేదు..
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థే లేకుండాపోయింది. అంతేకాకుండా ప్రత్యేకంగా నిధుల కేటాయింపులూ లేవు. హైవేలతో పాటు నగరాలు పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే విరాళాలు, నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా ప్రపంచదేశాలతో పోటీ పడుతున్న సైబరాబాద్‌లో కెమెరాలు పని చేయకపోవడం విచారకరం.
నిర్వహణ చేయకపోయినా బిల్లుల చెల్లింపు
మాదాపూర్ జోన్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. సదరు సంస్థ కెమెరాల నిర్వహణ పేలవంగా ఉన్నట్లు గుర్తించిన ఓ ఉన్నతాధికారి ఆ సంస్థ యజమానిని కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ సమయంలో సుమారు 300 కెమెరాలు ఎటో పోయాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఒప్పందంలో కెమెరాలు పోయినా కూడా కొత్తవి ఏర్పాటు చేసే బాధ్యత నిర్వహణ సంస్థదే కదా అని సదరు అధికారి ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది.
పైగా సదరు అధికారి తనను వేధిస్తున్నాడంటూ ఆపై ఉన్నతాధికారులకు, పలుకుబడి ఉన్న వాళ్లతో చెప్పడంతో సదరు అధికారి షాక్‌కు గురయ్యారు. అయితే 2020 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ అదే నిర్వహణ సంస్థకు కెమెరాల నిర్వహణ బిల్లులు పేరిట రూ.5.75 కోట్లు ప్రభుత్వం నుంచి చెల్లించడం గమనార్హం. నిర్లక్ష్యం, నిర్వహణ చేయకపోవడంపై సదరు ఏఎంసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారి లేఖ రాసినట్లు సమాచారం.