
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి మొత్తం 16వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. దీని విలువు దాదాపు 400 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కబ్జాదారులపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని ఆక్రమణలకు హైడ్రా తొలగించింది. మాదాపూర్‌లో జైహింద్ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని అక్కడి ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన లే అవుట్‌లో ఉన్న నాలుగు పార్కుల్లో రెండు పార్కులతో పాటు, ఐదువేల గంజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని దాదాపు 16వేల గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది.
హైడ్రా గుర్తించిన భూమి విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. 1995లో అనుమతి పొందిన లే అవుట్‌ను 2006లో అప్పటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీంతో, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్, హోర్డింగ్‌లను హైడ్రా తొలగించింది. హోటల్ అద్దె, ప్రకటనల ద్వారా జైహింద్ రెడ్డి నెలకు 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం.. పార్కులు, ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు పెట్టింది. ఇక, కబ్జాదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిసింది.