కొలంబియా చిందేసింది 

Colombia Keeps World Cup Hopes Alive While Dashing Poland - Sakshi

పోలాండ్‌పై 3–0తో ఘన విజయం

నాకౌట్‌ అవకాశాలు సజీవం 

చెలరేగిన రోడ్రిగ్స్‌ 

టోర్నీ నుంచి పోలాండ్‌ నిష్క్రమణ  

జేమ్స్‌ రోడ్రిగ్స్‌... గత ప్రపంచ కప్‌లో ఆరు గోల్స్‌తో కొలంబియాను క్వార్టర్‌ ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన స్టార్‌ ఆటగాడు. ఈ సారి టోర్నీలో జపాన్‌తో తొలి మ్యాచ్‌లో అతను గాయంతో కేవలం అరగంట ఆటకే పరిమితమయ్యాడు. జట్టు పరాజయానికి అది కూడా కారణమైంది. కానీ తన విలువేమిటో అతను పోలాండ్‌తో మ్యాచ్‌లో చూపించాడు. రోడ్రిగ్స్‌ తన అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌లో కీలక పాత్ర పోషించి కొలంబియాను గెలిపించగా... రెండు  పరాజయాలతో పోలాండ్‌ నాకౌట్‌ అవకాశాలు కోల్పోయింది. మరోవైపు క్వాలిఫయింగ్‌లో చెలరేగి ప్రపంచకప్‌కు ముందు భారీ అంచనాలతో బరిలోకి దిగిన పోలాండ్‌ కెప్టెన్‌ లెవాండోస్కీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడు. రెండు వరల్డ్‌కప్‌లకు దూరమైన తర్వాత ఈ సారి అర్హత సాధించిన పోలాండ్‌  టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి యూరోప్‌ జట్టుగా నిలిచింది.   

కజన్‌ ఎరీనా: గత డిసెంబర్‌లో వరల్డ్‌ కప్‌ గ్రూప్‌లు ఖరారైన తర్వాత పోలాండ్‌ కెప్టెన్‌ రాబర్ట్‌ లెవాండోస్కీ... రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. ‘గత వరల్డ్‌ కప్‌లో నీ అద్భుత గోల్స్‌ చూశాను. ఈసారి రష్యా నుంచి నా గోల్స్‌ గుర్తు పెట్టుకుంటావని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత సవాల్‌ విసిరాడు. అయితే పోలాండ్‌ ఎత్తులేమీ కొలంబియాపై పని చేయలేదు. లెవాండోస్కీ విఫలం కాగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోడ్రిగ్స్‌ తన జట్టును గెలిపించుకున్నాడు. ఆదివారం రాత్రి ఏకపక్షంగా సాగిన గ్రూప్‌ ‘హెచ్‌’ మ్యాచ్‌లో కొలంబియా 3–0తో పోలాండ్‌పై ఘన విజయం సాధించింది. కొలంబియా తరఫున యెరీ మినా (40వ నిమిషం), రాడమెల్‌ ఫాల్కావో (70వ నిమిషం), యువాన్‌ క్వాడ్రాడో (75వ నిమిషం) గోల్స్‌ సాధించాడు. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న పోలాండ్‌... 16వ స్థానంలో ఉన్న కొలంబియాకు ఏ దశలోనూ పోటీనివ్వలేక చేతులెత్తేసింది. తాజా విజయంతో కొలంబియా నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ గ్రూప్‌లో గురువారం జరిగే మ్యాచ్‌లలో జపాన్‌తో పోలాండ్, సెనెగల్‌తో కొలంబియా తలపడతాయి.  

హోరాహోరీగా... 
టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన రెండు జట్లు కాస్త ఒత్తిడిలోనే బరిలోకి దిగాయి. అయితే ఆరంభం నుంచే కొలంబియా దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించలేదు. రోడ్రిగ్స్‌తో పాటు క్వాంటెరో, క్వాడ్రాడో ప్రత్యర్థి వైపు పదే పదే దూసుకుపోయారు. మరోవైపు పోలాండ్‌ కూడా సెనెగల్‌తో ఓడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కానీ లెవాండోస్కీని సమర్థంగా మార్కింగ్‌ చేయడంలో కొలంబియా సఫలమైంది. ఎట్టకేలకు 40వ నిమిషంలో కొలంబి యాకు అవకాశం వచ్చింది. ఫాల్కావోను పోలాండ్‌ ఆటగాళ్లు అడ్డుకోవడంతో జట్టుకు పెనాల్టీ దక్కింది. రోడ్రిగ్స్‌ ఇచ్చిన షార్ట్‌ కార్నర్‌ను క్వాంటిరో ప్రశాంతంగా అందుకొని మళ్లీ వెనక్కి పంపించాడు. చురుగ్గా ఉన్న రోడ్రిగ్స్‌ మళ్లీ క్రాస్‌ షాట్‌ కొట్టగా...దానిని హెడర్‌ ద్వారా మినా గోల్‌పోస్ట్‌లోకి పంపిం చాడు. తొలి అర్ధభాగం ముగిసే సరికి బంతి దాదాపు సమాన సమయం ఇరు జట్ల ఆధీనంలో ఉంది.  

కొనసాగిన జోరు... 
విరామం తర్వాత పోలాండ్‌ కౌంటర్‌ అటాక్‌ చేసింది. ఈ క్రమంలో కొన్ని అవకాశాలు సృష్టించుకోగలిగినా కొలంబియా కీపర్‌ డేవిడ్‌ ఒస్పినా వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఒక దశలో లెవాండోస్కీ గోల్‌ కొట్టేందుకు అత్యంత చేరువగా వచ్చినా మిడ్‌ ఫీల్డ్‌ నుంచి అతను కొట్టిన లాంగ్‌ పాస్‌ పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అతనికి తగిన సహకారం లభించలేదు. ఆ తర్వాత కొలంబియా తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 70వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి దూసుకొచ్చిన క్వాంటిరో పాస్‌ అందించగా, ఫాల్కావో ఎలాంటి తప్పూ చేయలేదు. గాయంతో గత వరల్డ్‌కప్‌కు దూరమైన ఫాల్కావో ఈ గోల్‌తో ఉద్వేగంగా సంబరాలు చేసుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత కొలంబియా మళ్లీ చెలరేగింది. పోలాండ్‌ ఆటగాళ్లందరినీ వెనక్కి తోస్తూ జోరుగా దూసుకొచ్చిన రోడ్రిగ్స్‌ అందించిన క్రాస్‌ పాస్‌ను క్వాడ్రాడో గోల్‌గా మార్చడంతో ‘లాస్‌ కాఫిటోర్స్‌’కు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కొలంబియా పట్టు నిలబెట్టుకోగా, పోలాండ్‌ నిరాశగా వెనుదిరిగింది.  

చంపేస్తామంటూ బెదిరింపులు... 
జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో నిమిషంలోనే కొలంబియా ఆటగాడు కార్లోస్‌ సాంచెజ్‌  రెడ్‌కార్డుకు గురై నిష్క్రమించాడు. పది మందితోనే ఆడిన కొలంబియా చివరకు పరాజయం పాలైంది. ఇప్పుడు అతడిని చంపేస్తామంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. 1994 ప్రపంచకప్‌లో సెల్ఫ్‌ గోల్‌ చేసినందుకు కొలంబియాకు చెందిన ఎస్కోబార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని జట్టు కోచ్‌ జోస్‌ పోకర్‌మన్‌ అన్నారు.‘సాంచెజ్‌ చాలా బాధలో, ఆందోళనలో ఉన్నాడు. అలాంటి సమయంలో మేమంతా ఈ విజయాన్ని అతనికి అంకితం ఇచ్చి సాంచెజ్‌ను ఆనందంలో భాగం చేయాలనుకుంటున్నాం. బెదిరింపులు నిజమా కాదా చెప్పలేను కానీ మాకూ సమాచారముంది. ఇలాంటి విషయాలను చిన్నదిగా చూడలేం. ఫుట్‌బాల్‌ ఆట మాత్రమే కాదని ఇప్పుడనిపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top