మె ’కల్లోలమ్ | Brendon McCullum powers Chennai Super Kings past Sunrisers | Sakshi
Sakshi News home page

మె ’కల్లోలమ్

Apr 12 2015 1:45 AM | Updated on Sep 3 2017 12:10 AM

మె ’కల్లోలమ్

మె ’కల్లోలమ్

ఐపీఎల్ అంటేనే విభిన్న షాట్లతో కనువిందు చేసే టోర్నీ. ఇక మెకల్లమ్ లాంటి విధ్వంసకర ఆటగాడు

  •  56 బంతుల్లో అజేయంగా 100
  •  9 సిక్సర్లతో చెలరేగిన చెన్నై ఓపెనర్
  •  ధోని మెరుపు ఇన్నింగ్స్
  •  సన్‌రైజర్స్‌పై సూపర్‌కింగ్స్ విజయం

  • ఐపీఎల్ అంటేనే విభిన్న షాట్లతో కనువిందు చేసే టోర్నీ. ఇక మెకల్లమ్ లాంటి విధ్వంసకర ఆటగాడు అలాంటి షాట్లనే తన ఆయుధంగా చేసుకుంటే... పరుగుల సునామీయే. సంప్రదాయ డ్రైవ్‌లు, కట్‌లతో పాటు స్కూప్ షాట్లతో మెకల్లమ్ పరుగుల మోత మోగించాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో సెంచరీల బోణీ చేసిన మెకల్లమ్ జోరుకు... ధోని మెరుపులు తోడవడంతో... చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం నమోదు చేసింది. సీజన్‌లోని తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 45 పరుగులతో ఓడిపోయింది.

    చెన్నై: స్టెయిన్‌లాంటి ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ అందుబాటులో ఉన్నా తుది జట్టులోకి తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పు చేసినందుకు సన్‌రైజర్స్ భారీ మూల్యమే చెల్లించుకుంది. బౌలింగే తమ బలమనుకున్న హైదరాబాద్ ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టిన మెకల్లమ్ (56 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు; 9 సిక్సర్లు), ధోని (29 బంతుల్లో 53; 4 ఫోర్లు; 4 సిక్సర్లు) చెన్నై ఖాతాలో రెండో విజయాన్ని చేర్చారు. చెపాక్ స్టేడియంలో శనివారం జరిగిన ఐపీఎల్-8 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగులతో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసి ఓడింది. వార్నర్ (42 బంతుల్లో 53; 1 ఫోర్; 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. మోహిత్ శర్మ, బ్రావోలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం మెకల్లమ్‌కి దక్కింది.

    మెకల్లమ్, ధోని దూకుడు
    ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ బాదిన ఓపెనర్ మెకల్లమ్ తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. అందరి బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ స్మిత్ (26 బంతుల్లో 27; 4 ఫోర్లు; 1 సిక్స్), రైనా (12 బంతుల్లో 14; 1 ఫోర్) తక్కువ స్కోర్లకే రనౌట్ అయ్యారు. ఇషాంత్ శర్మ వేసిన 7వ ఓవర్‌లో మెకల్లమ్ రెండు సిక్స్‌లు ఓ ఫోర్‌తో మొత్తం 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ధోని రాకతో మ్యాచ్ టాప్ గేర్‌లో వెళ్లింది. కరుణ్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో తను మూడు సిక్స్‌లు బాదాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి మరుసటి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మెకల్లమ్, ధోని మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. మెకల్లమ్ 89 పరుగుల మీద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ చివరి మూడు బంతులు ఆడే అవకాశం వచ్చింది. వరుసగా రెండు స్కూప్ షాట్లతో సిక్సర్, ఫోర్ కొట్టిన మెకల్లమ్... ఆఖరి బంతికి సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

    వార్నర్ ఒక్కడే..
    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ చెన్నై బౌలర్ల ముందు తేలిపోయారు. క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ (18 బంతుల్లో 26; 5 ఫోర్లు) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత వార్నర్‌కు సహకారం ఇచ్చే వారు కరువయ్యారు. ఓజా (11 బంతుల్లో 15; 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన తను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 15వ ఓవర్‌లో పాండే బౌలింగ్‌లో వార్నర్ అవుటయ్యాడు. చివర్లో బొపారా (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది.

    స్కోరు వివరాలు:
    చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (రనౌట్) 27; మెకల్లమ్ నాటౌట్ 100; రైనా (రనౌట్) 14; ధోని (సి) వార్నర్ (బి) బౌల్ట్ 53; జడేజా (రనౌట్) 0; బ్రేవో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 209.

    వికెట్ల పతనం: 1-75, 2- 135, 3-198, 4-198. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-31-0; బౌల్ట్ 4-0-34-1; ఇషాంత్ 3-0-46-0 కరుణ్ 4-0-51-0; బొపారా 4-0-29-0; రసూల్ 1-0-11-0.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్మిత్ (బి) పాండే 53; ధావన్ (సి) జడేజా (బి) మోహిత్ 26; రాహుల్ (బి) మోహిత్ 5; ఓజా (సి) మోహిత్ (బి) అశ్విన్ 15; బొపారా (బి) బ్రేవో 22; విలియమ్సన్ నాటౌట్ 26; కరుణ్ (సి) రైనా (బి) బ్రేవో 4; రసూల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164.

    వికెట్ల పతనం: 1-30, 2-46, 3-91, 4-114, 5-136, 6-150.
    బౌలింగ్: నెహ్రా 4-0-31-0; మోహిత్ 4-0-36-2; పాండే 3-0-26-1; అశ్విన్ 4-0-22-1; బ్రేవో 4-0-25-2; జడేజా 1-0-17-0.

    32
    ఐపీఎల్‌లో ఇప్పటిదాకా నమోదైన సెంచరీలు. మెకల్లమ్‌కు ఇది రెండోది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement