
కొద్దిలో తప్పింది
ఆరేళ్లుగా తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేయని ప్రయత్నం లేదు.
పాక్-జింబాబ్వే వన్డే జరుగుతుండగా స్టేడియం సమీపంలో బాంబు దాడి
లాహోర్ : ఆరేళ్లుగా తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేయని ప్రయత్నం లేదు. భద్రత పరంగా ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నా ఏ ఒక్క దేశం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేకపోయింది. అయితే 2009 అనంతరం ఇన్నాళ్లకు వారికి జింబాబ్వే జట్టు అంతులేని సంతోషాన్ని కలిగించింది. రెండు టి20లు, మూడు వన్డేల కోసం వారు పాక్‌లో అడుగుపెట్టారు. దీనికి తగ్గట్టుగానే ఆ జట్టు ఆటగాళ్లకు దేశాధ్యక్షుడి తరహాలో సురక్షిత భద్రతను ఏర్పాటు చేసింది.
ఇక్కడి దాకా బాగానే ఉన్నా జింబాబ్వే పర్యటన మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా పీసీబీకి గట్టి షాకే తగిలింది. మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియానికి కిలో మీటర్ దూరంలోనే శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. అది కూడా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సమయంలోనే.. రిక్షా తొక్కుతూ స్టేడియంలో చొరబడేందుకు ప్రయత్నించిన ఈ మిలిటెంట్‌ను కిలో మీటర్ దూరంలోనే ఓ పోలీసు అధికారి అడ్డుకున్నాడు. అయితే ఈక్రమంలో మిలిటెంట్ తనను తాను పేల్చుకోగా పోలీసు కూడా మరణించాడు. స్టేడియంలో ఉన్న 20 వేల మందికి ఈ విషయం తెలి స్తే తొక్కిసలాట జరిగి మరింత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితేఆదివారం జరిగే చివరి వన్డే ఆడాకే పర్యటన ముగిస్తామని జింబాబ్వే చెప్పడం పాక్ బోర్డుకు ఊరట.
2-0తో పాక్‌కు సిరీస్
కెప్టెన్ అజహర్ అలీ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు) సూపర్ శతకం సహాయంతో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 2-0తో గెలుచుకుంది. అలాగే పాకిస్తాన్ ఓ వన్డే సిరీస్‌ను గెలువడం 17 నెలల అనంతరం ఇదే తొలిసారి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 268 పరుగులు చేసింది. సికిందర్ రజా (84 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. చిబాబా (99) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది.