బిగ్‌ హిట్టర్‌ ఎడ్వర్డ్స్‌ కన్నుమూత

Big Hitting New Zealand Batsman Jock Edwards Dies At 64 - Sakshi

వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌ క్రికెట్‌లో బిగ్‌ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌(64) కన్నుమూశారు.ఎడ్వర్డ్స్‌ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.  అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్‌ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్‌ ఇక లేరని విషయం తమకు తీరని లోటని పేర్కొంది.  1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఎడ్వర్డ్స్‌..  ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఇక 64 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను ఎడ్వర్డ్స్‌ ఆడారు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది. 

అంతర్జాతీయ క్రికెట్‌ను కేవలం నాలుగేళ్లు మాత్రమే ఆస్వాదించిన ఎడ్వర్డ్స్‌ తన ఆటతో పించ్‌ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్‌కు అచ్చం సరిపోయే ఎడ్వర్డ్స్‌.. 2011లో స్థానిక న్యూస్‌ పేపర్‌ నెల్సన్‌ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన బ్యాటింగ్‌ స్టైల్‌ టీ20 క్రికెట్‌కు సరిపోతుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. తన దూకుడైన ఆటను అడ్డుకట్ట వేసేందుకు కోచ్‌లు ప్రత్యేకంగా ప‍్రణాళికలు సిద్ధం చేసుకునే వారని ఈ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు.  తనకు హిట్టింగ్‌ అంటే ఇష్టమనే విషయాన్ని కూడా ఆ ఇంటర్యూలో తెలిపాడు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను, వన్డే మ్యాచ్‌ను భారత్‌పైనే ఆడటం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top