నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా బెన్‌స్టోక్స్‌

Ben Stokes Become No 1 All Rounder in ICC Test Rankings - Sakshi

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వీర విహారం చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఆల్‌ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న మొదటి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా నిలిచాడు. విండీస్‌ టెస్టు కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌(459)ను వెనక్కినెట్టి 497 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మూడో స్థానం((827))లో నిలిచాడు. కాగా మాంచెస్టర్‌లో విండీస్‌లో జరిగిన రెండో టెస్టులో 113 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లండ్‌ జట్టు... సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. (బెన్‌స్టోక్స్‌ రికార్డు బ్యాటింగ్‌)

ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో  255 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన బెన్‌స్టోక్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి సత్తాచాటాడు. తద్వారా టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతుల్లో 78 స్కోర్‌ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ప్రత్యర్థి జట్లులో డ్రాపై ఆశలు రేపి హాఫ్‌ సెంచరీతో దూసుకుపోతున్న జర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ వికెట్‌ తీసి మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పాడు. ఈ క్రమంలో మ్యాన్‌ ఆఫ్‌ ‘ది మ్యాచ్‌ అవార్డు’ అందుకున్న స్టోక్స్‌.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. కాగా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన జో రూట్‌ సేన తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రపోర్డ్‌ మైదానంలో ఆడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top