బతికి 'చెడ్డ' వాడు!

Ben Stokes and Alex Hales dropped by England until further notice

ప్రమాదంలో బెన్‌ స్టోక్స్‌ కెరీర్‌

అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

వరుస వివాదాలతో సమస్యలు

ఒకప్పుడు సమకాలీన క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్, రికీ పాంటింగ్‌ మధ్య ఎవరు గొప్ప అనే చర్చ చాలా సార్లు సాగింది. పరుగుల పరంగా చాలా సందర్భాల్లో వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అయితే ఒక్క విషయంలో మాత్రం సచిన్‌కు పాంటింగ్‌ దరిదాపులకు కూడా రాలేకపోయాడు. ‘జెంటిల్‌మన్‌ గేమ్‌’లో సచిన్‌ పాతికేళ్ల పాటు అసలైన జెంటిల్‌మన్‌లా నిలబడితే... పాంటింగ్‌ తన ప్రవర్తనతో కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో గొడవలు, దుర్భాషలాడటం ‘పంటర్‌’కు పరుగులు తీసినంత సులువుగా కనిపిస్తే... సచిన్‌ తన హుందాతనాన్ని నిలబెట్టుకొని అందరికంటే భిన్నంగా శిఖరాన నిలిచాడు. ఆటగాళ్లు ఆటతో మాత్రమే గొప్పవాళ్లు కాలేరని, మైదానం బయట వారి ప్రవర్తన కూడా ఎంతో ముఖ్యమని వీరిద్దరి పోలిక గుర్తు చేస్తుంది.

మంచి బ్యాటర్, బౌలరే కాదు, మంచి ఫైటర్‌ కూడా... ఇప్పుడు స్టోక్స్‌ అసలైన ఆల్‌రౌండర్‌!  బ్రిస్టల్‌ ఘటన తర్వాత అతనిపై వినిపిస్తున్న వ్యాఖ్యల్లో ఇదొకటి. తమ దిగ్గజం ‘సర్‌’ ఇయాన్‌ బోథమ్‌ తర్వాత అంతటివాడుగా ఇంగ్లండ్‌ మీడియా, అభిమానులు స్టోక్స్‌ను కీర్తించారు. దానికి తగినట్లుగా అతను కూడా ఆటతో అద్భుతాలు చేసి చూపించాడు. చేయి జారే, నోరు జారే అవలక్షణాన్ని చాలా సార్లు ప్రదర్శించినా అతని ప్రతిభకు విలువనిస్తూ క్రికెట్‌ ప్రపంచం స్టోక్స్‌ను క్షమించింది. కానీ ఇప్పుడు అతను చేసిన తప్పు చిన్నది కాదు. మత్తులో విచక్షణ కోల్పోయి ఒక వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించడం అందరూ నివ్వెరపోయేలా చేసింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో అతను ఎంత కీలకమో తెలిసి కూడా మొహమాటం లేకుండా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తప్పించాలని ఆలోచిస్తుండటం స్టోక్స్‌ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది.   

సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా ఏడాది క్రితం... ప్రపంచ హెవీవెయిట్‌ బాక్సింగ్‌ మాజీ చాంపియన్‌ టైసన్‌ ఫ్యూరీ తాను మత్తుమందులకు బానిసగా మారానని, ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నానని ప్రకటించాడు. ఆ తర్వాత తన బాక్సింగ్‌ టైటిల్స్‌ అన్నీ పోగొట్టుకున్న అతను, చివరకు లైసెన్స్‌ కూడా కోల్పోయాడు. ఈ సమయంలో ‘ఫ్యూరీని చూసి ప్రొఫెషనల్‌ క్రీడ సిగ్గు పడుతుంది’ అని బెన్‌ స్టోక్స్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు సరిగ్గా సంవత్సరం తర్వాత తాను అలాంటి స్థితిలోనే నిలవడం విశేషం. క్రికెటరే అయినా బాక్సింగ్‌ పంచ్‌లతో పవర్‌ ప్రదర్శించిన 26 ఏళ్ల స్టోక్స్‌... యాషెస్‌ సిరీస్‌కు దూరం కావడమే కాదు, దోషిగా తేలితే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.  

అపార ప్రతిభ... : సగటు క్రీడాభిమానికి బెన్‌ స్టోక్స్‌ అంటే గత ఏడాది టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచే గుర్తుకొస్తుంది. ఆఖరి ఓవర్లో విండీస్‌ విజయానికి 19 పరుగులు అవసరం కాగా... స్టోక్స్‌ బౌలింగ్‌లో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం, షాక్‌తో స్టోక్స్‌ మైదానంలో కుప్పకూలిపోవడం అందరికీ చిరపరిచితమైన దృశ్యం. కానీ అప్పటికే అతను ప్రపంచ క్రికెటర్లలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నాతో స్టోక్స్‌ను పోలుస్తున్నారు గానీ 26 ఏళ్ల వయసులో నేను కూడా ఇంత బాగా ఆడలేదు’ అని స్వయంగా బోథమ్‌ ప్రశంసలు కురిపించాడు. అసలైన ఆల్‌రౌండర్‌కు అతను నిర్వచనం. రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటగల స్టోక్స్‌... బౌలింగ్‌కు దిగితే పూర్తి స్థాయి పేస్‌ బౌలర్‌గా మారిపోగలడు. కలిస్‌ తర్వాత ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో అలాంటి ఆల్‌రౌండర్‌ ఎవరూ రాలేదు. టి20 ప్రపంచ కప్‌కు కొన్నాళ్ల ముందు కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కేవలం 198 బంతుల్లో 258 పరుగులతో చెలరేగినప్పుడు అతని సత్తా ఏమిటో ప్రపంచం గుర్తించింది. టెస్టుల్లో ఇది రెండో వేగవంతమైన డబుల్‌ సెంచరీ. టెస్టుల్లో అతని రాకనే అద్భుతంగా జరిగింది. ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై 0–5తో చిత్తు చిత్తుగా ఓడిన యాషెస్‌ సిరీస్‌లో అరంగేట్రం చేసిన స్టోక్స్‌... పెర్త్‌లో తన రెండో టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌కు అవమానం మిగిలిన ఆ పర్యటనలో చెప్పుకోదగ్గ విశేషం ఏదన్నా ఉందంటే ‘ఇంగ్లండ్‌ భవిష్యత్తు తార’గా స్టోక్స్‌కు గుర్తింపు రావడమే. ఆ తర్వాత కూడా కీలక ఆటగాడిగా అతను ఇంగ్లండ్‌ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.  

జాబితా పెద్దదే...: ఒకటి, రెండు సార్లు కాదు... పదే పదే స్టోక్స్‌ వివాదాలతో సహవాసం చేశాడు. ఆరేళ్ల క్రితమే తాగిన మత్తులో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకొని వివాదంలో నిలిచాడు. పోలీసులు హెచ్చరికతో వదిలేశారు. రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్‌ యువ (లయన్స్‌) జట్టు సభ్యుడిగా ఆసీస్‌ పర్యటనలో ఉన్న సమయంలో రెండు సార్లు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అతడిని స్వదేశం  పంపించారు. 2014లో విండీస్‌తో మ్యాచ్‌లో రనౌట్‌ అయ్యాక కోపం పట్టలేక డ్రెస్సింగ్‌ రూమ్‌లో లాకర్‌ను పంచ్‌ కొట్టి చేతిని గాయపర్చుకున్నాడు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌కు దూరం కావాల్సి వచ్చింది. గత ఒక్క ఏడాదే పరిమితికి మించిన వేగంతో డ్రైవింగ్‌ చేసి ఇంగ్లండ్‌ పోలీసుల రికార్డుల్లో నిలిచాడు. ఇక రెండేళ్ల క్రితం విండీస్‌ క్రికెటర్‌ శామ్యూల్స్‌తో జరిగిన గొడవ టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మీదుగా తాజా సిరీస్‌ వరకు కూడా కొనసాగుతోంది. ఐసీసీ జరిమానాలు, ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు కనీసం షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడంవంటివి స్టోక్స్‌ డైరీలో చాలా ఉన్నాయి. అదృష్టం కలిసొస్తే తప్ప అతను ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు తక్కువ. అదే జరిగితే ఒక పర్‌ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు.

బ్రిస్టల్‌ ఘటనకు సంబంధించి స్టోక్స్‌కు అనుకూలంగా మరో వార్త ముందుకు వచ్చింది. ఇద్దరు ‘గే’లను మరో ఇద్దరు కుర్రాళ్లు ఎగతాళి చేస్తుండగా వారిని రక్షించేందుకు స్టోక్స్‌ జోక్యం చేసుకున్నాడని దాని సారాంశం. స్టోక్స్‌ తన సన్నిహితులకు, పోలీస్‌ విచారణలో చెప్పిన దాని ప్రకారం ‘ఇద్దరు వ్యక్తులను ‘గే’ అంటూ పదే పదే వ్యాఖ్యలతో వేధించడాన్ని నేను చాలా సేపు చూశాను.  దాంతో ఉండబట్టలేక కల్పించుకొని బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అందులో ఒకరి చేతిలో బాటిల్‌ కూడా ఉంది. వాడు మమ్మల్ని బెదిరించాడు కూడా. జరిగిన దానికి నేను చింతిస్తున్నాను. నేను ఆ ఇద్దరిని రక్షించే ప్రయత్నం చేశాను. అతను నా ముఖంపై బాటిల్‌తో కొట్టే వరకు వేచి చూడాలా! సరిగ్గా చెప్పాలంటే వాళ్లు మొదలు పెట్టారు. నేను దానిని ముగించాను’ అని స్టోక్స్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top