మోసపోయిన బీసీసీఐ | BCCI lost Rs 50 crore on fraud land deal, admits National Cricket Academy | Sakshi
Sakshi News home page

మోసపోయిన బీసీసీఐ

Aug 9 2013 1:39 AM | Updated on Aug 16 2018 4:36 PM

వివాదాస్పద భూ వివాదంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దాదాపు రూ.50 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సబ్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

న్యూఢిల్లీ: వివాదాస్పద భూ వివాదంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దాదాపు రూ.50 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సబ్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఈ స్కామ్‌కు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయం దగ్గర కుర్కి అనే ప్రదేశంలో బీసీసీఐ 49 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
 
 ఈ కొనుగోలుపై కర్ణాటక పరిశ్రమల అభివృద్ధి సంస్థ బోర్డు (కేఐఏడీబీ)తో బీసీసీఐ తరఫున గురుదత్ షాన్‌బాగ్ అనే వ్యక్తి సంతకం చేశాడు. అయితే షాన్‌బాగ్‌కు అటు బీసీసీఐతో కానీ ఇటు ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో కానీ సంబంధం లేదని ఎన్‌సీఏ సబ్ కమిటీ తేల్చింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంపై బీసీసీఐ రూ.49,97,60,000 చెల్లించిన అనంతరం ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో పలు పిల్స్ నమోదు కావడంతో బోర్డు పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నెల జూన్ 20న హైకోర్టు కూడా ఈ డీల్ చట్ట         వ్యతిరేకమని తీర్పునిచ్చింది. దీంతో తాము ఒప్పందం విషయంలో మోసపోయామని బీసీసీఐ గ్రహించింది. 

డీలింగ్ అనంతరం షాన్‌బాగ్ కూడా పత్తా లేకుండా పోయాడు. అతనితో సంబంధం ఉన్న మాజీ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) ఏకే ఝాపై బోర్డు అధికారులు దృష్టి సారించారు. ‘అసలు ఈ మొత్తం వ్యవహారంలో షాన్‌బాగ్ ఎలా ప్రవేశించాడనే విషయం అంతుచిక్కడం లేదు. ఇదే విషయాన్ని ఝాను కూడా ప్రశ్నించాం. ఎవరికీ అతడి నేపథ్యం ఏమిటో తెలీదు. అయితే అతడు ఝా కార్యాలయంలో ఎక్కువగా కనిపించేవాడని తెలిసింది’ అని బోర్డు ఆఫీస్ బేరర్ ఒకరు తెలిపారు. ఈ ఉదంతంతో ఝాను బీసీసీఐ నుంచి తప్పించగా గురువారం ఈ మొత్తం వ్యవహారాన్ని వర్కింగ్ కమిటీకి ఎన్‌సీఏ తెలిపింది. బీసీసీఐ ప్రతినిధిగా షాన్‌బాగ్ సంతకం చేస్తున్నప్పుడు అప్పటి కోశాధికారి ఇంత భారీ మొత్తాన్ని ఎలా విడుదల చేశారనేది పెద్ద ప్రశ్న.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement