సరికొత్తగా టీ20 లీగ్‌.. ఇవేం రూల్స్‌రా నాయనా..!

Bangladesh Cricket Board Introduced T20 Premier League New Rules - Sakshi

ఢాకా : బంగ్లాదేశ్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీలతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీపీఎల్‌లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అన్ని దేశాలు పాటించిన రూల్స్‌నే అనుసరించిన బంగ్లా క్రికెట్‌ బోర్డు బీపీఎల్‌ను తన అధీనంలోకి తీసుకుని తాజా నిర్ణయాలను ప్రకటించింది. మేటి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ దేశ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌లో మెరుగ్గా రాణించేందుకు తాజా నిబంధనలు దోహదపడతాయని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ మహబూబల్‌ అనమ్‌ చెప్పారు. వచ్చే సీజన్‌ నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని వెల్లడించారు.

కాగా, ఏడు ప్రాంచైజీలు ఉన్న బీపీఎల్‌లో ఆరు జట్ల యజమానులతో బంగ్లా క్రికెట్‌ బోర్డుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌ను బంగ్లా బోర్డు అధీనంలోకి తీసుకుంది. అయితే, బీసీబీ కొత్త నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. మోకాలుకు బోడి గుండుకు ముడిపెట్టుగా రూల్స్‌ చెత్తగా ఉన్నాయని సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సరుకంతా విదేశాలదైతే బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌ అనే పేరెందుకుని క్రికెట్‌ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బంగ్లా టీ20 ప్రీమియర్‌ లీగ్‌ తాజా రూల్స్‌..

  • ఏడు టీమ్‌లలో ఒక విదేశీ ఫాస్ట్‌ బౌలర్‌ తప్పనిసరి.
  • అతను 140 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేయగలగాలి
  • టీమ్‌లో ఒక లెగ్‌ స్పిన్నర్‌ తప్పనిసరిగా ఉండాలి
  • ప్రతి జట్టులో ఉన్న మణికట్టు స్పిన్నర్‌ తప్పనిసరిగా పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్‌ చేయాలి 
  • విదేశీ ప్రధాన కోచ్‌, ఫిజియోథెరపిస్టు, ట్రెయినర్‌లే ఉండాలి. 
  • స్వదేశానికి చెందిన కోచ్‌లు ఈ ప్రధాన కోచ్‌కు సహాయకుడిగా మాత్రమే ఉంటారు.
  • టీమ్‌లకు డైరెక్టర్‌ను ఎంపిక చేసే అధికారం బీసీబీ డైరెక్టర్‌కు ఉంటుంది.
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top