సంఖ్యే కాదు..పతకాలూ పెరుగుతాయి

Badminton World Championship india win more medals - Sakshi

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అవకాశాలపై  చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ విశ్వాసం

బరిలో 25 మంది షట్లర్లు

ఈ నెల 30 నుంచి చైనాలో మెగా ఈవెంట్‌   

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. 2018లో దాదాపు ఏడు నెలలు ముగిసినా అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో ఒక్క పెద్ద టోర్నీ కూడా (కామన్వెల్త్‌ క్రీడలను మినహాయిస్తే) మన షట్లర్లు గెలవలేదు. ఇక ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఈ నెల 30 నుంచి చైనాలోని నాన్‌జింగ్‌ నగరంలో జరగబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 మంది షట్లర్ల బృందం ఇందులో పాల్గొంటుండటం విశేషం. 40 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ మొత్తం కలిపి 7 పతకాలు గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఈసారి మన షట్లర్లు ఎన్ని పతకాలు సాధిస్తారనేది ఆసక్తికరం.  

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం భారత్‌ ఖాతాలో చేరాయి. అయితే ఈసారి మన ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఎక్కువ పతకాలు సాధించగలరని జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా, మనకు వేర్వేరు విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 2018లో వరల్డ్‌ టూర్‌ టోర్నీల్లో మన షట్లర్ల ప్రదర్శన ప్రభావం దీనిపై ఉండదన్న గోపీచంద్‌... భారత్‌ సన్నాహాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... 

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు సన్నద్ధత... 
పోటీ చాలా తీవ్రంగా ఉండే ఇలాంటి పెద్ద టోర్నీకి సరైన రీతిలోనే మా సన్నద్ధత సాగుతోంది. అయితే వరుస టోర్నీల వల్ల మాకు తగినంత సమయం లభించలేదు. అనేక మంది ఆటగాళ్లు ఇప్పుడు సర్క్యూట్‌లోనే ఉన్నారు. ఈ జులై నెలలోనే చాలా మంది వరుసగా మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, ప్రస్తుతం రష్యా (24–29) టోర్నీ లలో ఆడుతూ వచ్చారు. దాంతో క్యాంప్‌లో ఒకేసారి శిక్షణ సాధ్యం కాలేదు. అయితే అంతా ఫిట్‌గా ఉన్నారు కాబట్టి సమస్య లేదు. మెరుగైన ప్రదర్శన ఇవ్వగలమని నమ్మకముంది.  

జట్టు సంఖ్యపై... 
మొత్తం 25 మంది సభ్యులతో భారత్‌ బరిలోకి దిగుతుండటం సంతోషకర పరిణామం. ఇంత పెద్ద సంఖ్యలో మనోళ్లు ఒకేసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఆడలేదు. కటాఫ్‌ తేదీ నాటికి ఉన్న ప్రపంచ ర్యాంక్‌ను బట్టి ఆటగాళ్లు అర్హత సాధిస్తారు. అంటే మనోళ్ల ప్రదర్శన వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో చాలా మెరుగ్గా ఉందనే అర్థం. వరల్డ్‌ ర్యాంక్‌ ద్వారా క్వాలిఫై అయ్యారంటే వారి ఆటను ప్రశంసించాల్సిందే. దీని వల్లే నాకు నమ్మకం మరింత పెరిగింది.  వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మన షట్లర్లు పతకం గెలవడం కొత్త కాదు. ఈసారి మరిన్ని పతకాలు గెలుస్తామనే నమ్మకం ఉంది. కేవలం సంఖ్యతో సరిపెట్టకుండా విజయాలు కూడా సాధించాలని పట్టుదలగా ఉన్నాం. 

2018లో మన ఆటగాళ్ల ప్రదర్శనపై... 
వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్పగా ఏమీ లేదు. సూపర్‌ సిరీస్‌ స్థాయి విజయాలు దక్కలేదనేది వాస్తవం. అయితే మరీ నిరాశాజనకంగా ఏమీ లేదు. కామన్వెల్త్‌ క్రీడల్లో మన జట్టు అద్భుతంగా ఆడి 6 పతకాలు సాధించింది. నా అభిప్రాయం ప్రకారం కొన్ని టోర్నీల్లో బాగా ఆడినా అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటిపైనే ఫోకస్‌ చేస్తూ దాని ప్రకారమే ట్రైనింగ్‌ సాగడంతో ఇతర పెద్ద టోర్నమెంట్‌లలో ఫలితాలు సానుకూలంగా రాలేదు. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఏడాదికి 12 తప్పనిసరి టోర్నీల కొత్త నిబంధన కూడా కొంత ఇబ్బంది పెట్టింది. అయితే ఈ ప్రదర్శన ప్రభావం వరల్డ్‌ చాంపియన్‌షిప్‌పై మాత్రం ఉండదని నా నమ్మకం. 

సింధు, సైనా ఫామ్‌పై... 
వీళ్లిద్దరు వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లు. ఎప్పుడైనా, ఎలాంటి స్థితిలోనైనా సత్తా చాటగల సమర్థులు కాబట్టి రాబోయే టోర్నీల్లో వారి గురించి ఆందోళన లేదు. ఈ సంవత్సరం సింధు రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి మరో రెండు టోర్నీల్లో సెమీస్‌ వరకు వచ్చింది. కామన్వెల్త్‌ ఫైనల్లో సింధును ఓడించిన సైనా, ఇండోనేసియా మాస్టర్స్‌లో ఫైనల్‌ చేరింది. వారిలో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు కాబట్టి మెగా టోర్నీలో మళ్లీ సత్తా చాటగలరు. గత ఏడాది కూడా సింధు (రజతం), సైనా (కాంస్యం) పతకాలు సాధించిన విషయం మరచిపోవద్దు.  

శ్రీకాంత్‌ ఆటతీరుపై... 
ఆందోళన పడాల్సిందేమీ లేదు. అతని ఆటలో లోపాలు లేవు. అన్ని విధాలా బాగానే ఆడుతున్నాడు. అయితే ఒక ఏడాది గెలిచిన టోర్నీలను మరుసటి ఏడాది వరుసగా నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. శ్రీకాంత్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ఇండోనేసియా ఓపెన్‌ తొలి రౌండ్‌లో ఓడిపోవడం కొంత అనూహ్యం. వారం రోజుల వ్యవధిలో కెంటో మొమోటా (జపాన్‌) చేతిలోనే అతను రెండు సార్లు ఓడిపోవడమే ఆశ్చర్యపరచింది. మేం కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాం. మళ్లీ అది జరగకుండా కొత్త వ్యూహంతో శ్రీకాంత్‌ సిద్ధమవుతున్నాడు.  

కశ్యప్‌ కెరీర్‌పై... 
వరుస గాయాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపించాయి. సర్క్యూట్‌లో చురుగ్గానే ఉన్నాడు కానీ గాయాల వల్ల పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కోలుకొని ప్రయత్నిస్తున్నా ఆశించిన విజయాలు దక్కడం లేదు. సింగపూర్‌ ఓపెన్‌లో అతను 15 నిమిషాల్లోనే ఓడిపోయిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ అసలు ఆడకుండా ఉండాల్సింది. ప్రత్యర్థి భారత్‌కే చెందిన ఆటగాడు (సౌరభ్‌ వర్మ) కావడం వల్ల నిబంధనల ప్రకారం వాకోవర్‌ ఇవ్వకూడదు. దాంతో ఏదోలా బరిలోకి దిగి మ్యాచ్‌ ముగించాడు. మన్ముందు అతని కెరీర్‌ గురించైతే ఇప్పుడే చెప్పలేను.  

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ బరిలో భారత షట్లర్లు 
►పురుషుల సింగిల్స్‌: శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్‌ వర్మ. 
►మహిళల సింగిల్స్‌: పీవీ సింధు, సైనా నెహ్వాల్‌. 
►పురుషుల డబుల్స్‌: సుమీత్‌ రెడ్డి–మను అత్రి, సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్, తరుణ్‌ కోన–సౌరభ్‌ శర్మ. 
►మహిళల డబుల్స్‌: సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప; కుహూ గార్గ్‌– నింగ్‌షి హజారికా; మేఘన–పూర్వీషా; సంయోగిత–ప్రజక్తా సావంత్‌. 
►మిక్స్‌డ్‌ డబుల్స్‌: సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా; సాత్విక్‌–అశ్విని పొన్నప్ప; సౌరభ్‌ శర్మ–అనౌష్క పారిఖ్‌; రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌. 

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన 
►1983: ప్రకాశ్‌ పదుకోన్‌ ( పురుషుల సింగిల్స్‌లో కాంస్యం) 
►2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం) 
►2013, 2014: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యాలు) 
►2015: సైనా నెహ్వాల్‌ (మహిళల సింగిల్స్‌లో రజతం) 
►2017: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం), సైనా నెహ్వాల్‌ (మహిళల సింగిల్స్‌లో కాంస్యం). 
►మొత్తం: 2 రజతాలు, 5 కాంస్యాలు 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top