చైనా చేతిలో భారత్‌ చిత్తు

Badminton: India Sudirman Cup campaign ends - Sakshi

ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత క్రీడాకారులు

సుదిర్మన్‌ కప్‌లో ముగిసిన పోరు  

నానింగ్‌ (చైనా): మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వ్యూహాత్మక తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్న భారత బ్యాడ్మింటన్‌ జట్టు... పదిసార్లు చాంపియన్‌ చైనాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సుదిర్మన్‌ కప్‌ నుంచి లీగ్‌ దశలోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. గ్రూప్‌ ‘1డి’లో భాగంగా బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0–5తో ఓటమి చవిచూసింది.  క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే చైనాపై కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిరాశాజనక ప్రదర్శన కనబర్చారు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 5–21, 11–21తో వాంగ్‌ యిల్యు–హువాంగ్‌ డాంగ్‌పింగ్‌ జోడీ చేతిలో ఓడింది.

రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 17–21, 20–22తో చెన్‌ లాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా గాయం కావడంతో చైనాతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్‌ బదులు సమీర్‌ వర్మను ఆడించిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–18, 15–21, 17–21తో హావోడాంగ్‌ జు–హాన్‌ చెంగ్‌కాయ్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా 12–21, 17–21తో చెన్‌ యుఫె చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 12–21, 15–21తో చెన్‌ కింగ్‌చెన్‌–జియా యిఫాన్‌ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top