ఫించ్‌ ఫటాఫట్‌

Australia beats Sri Lanka by 87 runs - Sakshi

ఆసీస్‌ కెప్టెన్‌ అద్భుత శతకం

శ్రీలంకపై 87 పరుగులతో కంగారూల విజయం

రాణించిన స్మిత్, స్టార్క్‌ కరుణరత్నే సెంచరీ మిస్‌

బ్యాటింగ్, బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు శ్రీలంకపై ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. తొలుత కెప్టెన్‌ ఫించ్‌ భారీ సెంచరీతో అదరగొట్టడంతో శ్రీలంకకు సవాల్‌ విసిరిన కంగారూలు... అనంతరం ప్రత్యర్థి పోరాటాన్ని తట్టుకుని గెలుపును అందుకున్నారు. ఓ దశలో సింహళీ జట్టు సంచలనం సృష్టిస్తుందేమో అనిపించినా ఆసీస్‌ ముందు వారి ఆటలు సాగలేదు.   

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌లో మరో విజయం దక్కింది. శనివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌ లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో శ్రీలంకను తేలిగ్గా ఓడించింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (132 బంతుల్లో 153; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీకి తోడు, స్టీవ్‌ స్మిత్‌ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. చివర్లో మ్యాక్స్‌వెల్‌ (25 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) మెరిశాడు.

ఉదాన (2/57) కీలక వికెట్లు తీయడంతో పాటు రెండు చురుౖకైన రనౌట్లు చేశా డు. ఛేదనలో ఓపెనర్లు కెప్టెన్‌ కరుణరత్నే (108 బంతుల్లో 97; 9 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (36 బంతుల్లో 52; 5 ఫోర్లు, సిక్స్‌) ఇచ్చిన అద్భుత ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన లంక 45.5 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు స్టార్క్‌ (4/55), రిచర్డ్‌సన్‌ (3/47) కీలక సమయంలో విజృంభించి ప్రత్యర్థిని నిలువరించారు. ఫించ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండా బరిలో దిగడం గమనార్హం.

వారిద్దరికి తోడు.. చివర్లో అతడు
కెప్టెన్‌ హోదాకు తగ్గట్లు ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు ఫించ్‌ మూలస్తంభంలా నిలిచాడు. అతడితో కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించినా ఇబ్బందిగా కనిపించిన మరో ఓపెనర్‌ వార్నర్‌ (48 బంతుల్లో 26; 2 ఫోర్లు)ను ధనంజయ బౌల్డ్‌ చేశాడు. 53 బంతుల్లో ఫించ్‌ అర్ధశతకం అందుకున్నాడు. ఉస్మాన్‌ ఖాజా (10)నూ ధనంజయే ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 23 ఓవర్లలో సరిగ్గా 100. రన్‌రేట్‌ 5 లోపే. ఈ దశలో ఫించ్‌కు స్మిత్‌ తోడవడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ధనంజయ బౌలింగ్‌లో ఫోర్, రెండు సిక్స్‌లు బాది ఫించ్‌ ఊపు తెచ్చాడు.

సిరివర్దన ఓవర్లో లాంగాఫ్‌లోకి లాఫ్టెడ్‌ షాట్‌తో సిక్స్‌ కొట్టి సెంచరీ (97 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్మిత్‌ అర్ధ సెంచరీ (46 బంతుల్లో) మార్క్‌ను చేరుకోవడం, ఫించ్‌ దూకుడు మీద ఉండటంతో ఆసీస్‌ 350 పైనే చేసేలా కనిపించింది. తిసారా పెరీరా, నువాన్‌ ప్రదీప్, మలింగ వేసిన వరుస ఓవర్లలో వీరు ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. 128 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్న ఫించ్‌ ఇదే జోష్‌లో ఉదాన బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మరుసటి ఓవర్లోనే మలింగ పదునైన యార్కర్‌తో స్మిత్‌ వికెట్లను గిరాటేశాడు. ప్రదీప్‌ బౌలింగ్‌లో (45వ ఓవర్‌) మ్యాక్స్‌వెల్‌ నాలుగు ఫోర్లు, సిక్స్‌ బాది జట్టు స్కోరును 300 దాటించాడు.

ఆ ఐదు ఓవర్లు...
మొదటి 25 ఓవర్లలో 110 పరుగులే చేసిన ఆసీస్‌ తర్వాతి 20 ఓవర్లలో 192 పరుగులతో చెలరేగింది. అయితే, ఆ జట్టు ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భీకరంగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ను కట్టడి చేయడంతో పాటు, షాన్‌ మార్‌‡్ష, అలెక్స్‌ క్యారీలను అడ్డుకుని లంక ఒక్కసారిగా పుంజుకుంది. ఈ క్రమంలో 46, 47 ఓవర్లలో మలింగ, ఉదాన నాలుగేసి పరుగులే ఇచ్చారు. 48వ ఓవర్లో మలింగ 7 పరుగులతో సరిపెట్టాడు. 49వ ఓవర్లో ఉదాన సైతం 7 పరుగులే ఇచ్చి... డైరెక్ట్‌ హిట్‌లతో క్యారీ (4), కమిన్స్‌ (0)లను రనౌట్‌ చేశాడు. తిసారా వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులే వచ్చాయి. మొత్తమ్మీద చివరి ఐదు ఓవర్లలో కంగారూలు మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేయగలిగారు.

లంక కలకలం రేపినా...
తమ స్థాయి ఆటకు భారీ అనదగ్గ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక అనూహ్యంగా విజృంభించింది. కరుణరత్నే, కుశాల్‌ తొలి ఓవర్‌ నుంచే బౌండరీలు బాదుతూ సులువుగా పరుగులు సాధించారు. ఒకటికి రెండుసార్లు బంతి ఓపెనర్ల బ్యాట్‌ లోపలి అంచుకు తగిలినా వాటికీ ఫోర్లు రావడంతో రన్‌రేట్‌ జోరుగా సాగింది. 43 బంతుల్లో కరుణరత్నే, 33 బంతుల్లో కుశాల్‌ అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. 13వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. అయితే, కుశాల్‌ను బౌల్డ్‌ చేసి స్టార్క్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తిరిమన్నె (16) పేలవ ఫామ్‌ కొనసాగిస్తూ వెనుదిరిగాడు. సెంచరీ ముంగిట కరుణరత్నే ఔటయ్యాడు. మాథ్యూస్‌ (9), మెండిస్‌ (30) పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయారు. ఒకే ఓవర్లో సిరివర్ధన (3), తిసారా పెరీరా (7)లను పెవిలియన్‌ చేర్చి లంక ను స్టార్క్‌ దెబ్బకొట్టాడు. ఉదాన (8), మలింగ (1) వికెట్లు రిచర్డ్‌సన్‌కు దక్కాయి.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) ధనంజయ 26; ఫించ్‌ (సి)       కరుణరత్నే (బి) ఉదాన 153; ఖాజా (సి) ఉదాన (బి) ధనంజయ 10; స్మిత్‌ (బి) మలింగ 73; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 46; షాన్‌ మార్‌‡్ష (సి) సిరివర్ధన (బి) ఉదాన 3; క్యారీ (రనౌట్‌) 4; కమిన్స్‌ (రనౌట్‌) 0; స్టార్క్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 7          వికెట్లకు) 334.

వికెట్ల పతనం: 1–80, 2–100, 3–273, 4–278, 5–310, 6–317, 7–320.  

బౌలింగ్‌: మలింగ 10–1–61–1, ప్రదీప్‌ 10–0–88–0, ఉదాన 10–0–57–2, తిసారా పెరీరా 10–0–67–0, డి సిల్వా 8–0–40–2, సిరివర్ధన 2–0–17–0.

శ్రీలంక ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) రిచర్డ్‌సన్‌ 97; కుశాల్‌ పెరీరా (బి) స్టార్క్‌ 52; తిరిమన్నె (సి) క్యారీ (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 16; మెండిస్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 30; మాథ్యూస్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 9; సిరివర్ధన (బి) స్టార్క్‌ 3; తిసారా పెరీరా (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 7; ధనంజయ నాటౌట్‌ 16; ఉదాన (సి) ఫించ్‌ (బి) రిచర్డ్‌సన్‌ 8; మలింగ (సి) ఖాజా (బి) రిచర్డ్‌సన్‌ 1; ప్రదీప్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్‌) 247.

వికెట్ల పతనం: 1–115, 2–153, 3–186, 4–205, 5–209, 6–217, 7–222, 8–236, 9–237, 10–247.

బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–55–4; కమిన్స్‌ 7.5–0–38–2; బెహ్రెన్‌డార్ఫ్‌ 9–0–59–1; రిచర్డ్‌సన్‌ 9–1–47–3; మ్యాక్స్‌వెల్‌ 10–0–46–0.

లంక నిరసన
ప్రపంచ కప్‌లో బస, ప్రాక్టీస్‌ ఏర్పాట్లు, మ్యాచ్‌ వేదికల విషయంలో తమ పట్ల వివక్ష చూపుతున్నందుకు నిరసన తెలుపుతూ... శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశాన్ని బహిష్కరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టు తరఫున ఎవరైనా ఒకరు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవాలి. దీనిని ఉల్లంఘించినందుకు లంక జట్టుపై చర్యలు తీసుకునే వీలుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top