రజతాలు నెగ్గిన షూటర్లు లక్షయ్, దీపక్‌ 

Asian Games 2018: Shooter Deepak Kumar and lakshay wins air rifle silver - Sakshi

పాలెంబాంగ్‌లో భారత షూటర్లు దీపక్‌ కుమార్‌ 10 మీటర్ల రైఫిల్‌ ఈవెంట్‌లో... లక్షయ్‌ షెరాన్‌ ట్రాప్‌ పోటీలో రజత పతకాలు నెగ్గారు. ఈ రెండు ఈవెంట్లలో రవి కుమార్, మానవ్‌జీత్‌ సింగ్‌ సంధు నాలుగో స్థానంలో నిలిచి పతకం అవకాశాన్ని కోల్పోయారు. ఓ మెగా ఈవెంట్‌ పతకాన్వేషణలో దీపక్‌ కుమార్‌ది సుదీర్ఘ నిరీక్షణ. ఇండోనేసియాలో రజతంతో  ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది. ఒకట్రెండు కాదు...  ఏకంగా 14 ఏళ్లుగా పతకం కోసం శ్రమించాడు. ఈ సారి మాత్రం 33 ఏళ్ల దీపక్‌ గురితప్పలేదు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల రైఫిల్‌ పోటీలో అతను 17 షాట్ల వరకు రేసులోనే లేడు. 18వ షాట్‌ 10.9 పాయింట్లు తెచ్చిపెట్టడంతో అనూహ్యంగా పతకం రేసులోకి వచ్చాడు. 24 షాట్లలో 247.7 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. ఇందులో యంగ్‌ హరన్‌ (చైనా; 249.1) స్వర్ణం, లూ షావోచున్‌ (చైనీస్‌ తైపీ; 226.8) కాంస్యం నెగ్గారు.
 

రవి కుమార్‌ (205.2) నాలుగో స్థానం పొందాడు. సంస్కృతంలో నిష్ణాతుడైన దీపక్‌ పతక విజయంపై ఆధ్యాత్మిక ధోరణిలో స్పందించాడు. ‘ప్రతి ఒక్కరు తమకు దక్కేదానిపై ఆశావహ దృక్పథంతోనే ఉంటారు. నేనూ అంతే... జీవితంలో రాసిపెట్టి ఉంటే అదెప్పుడైనా దక్కుతుంది. అతిగా ఆశించి చింతించాల్సిన పనిలేదు. ఈ విషయాల్ని నేను గురుకుల్‌ అకాడమీలో పాఠశాల విద్యలోనే నేర్చుకున్నా’ అని దీపక్‌ అన్నాడు. ఢిల్లీకి చెందిన అతని తల్లిదండ్రులు నగర అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో దీపక్‌ను డెహ్రాడూన్‌లోని గురుకుల్‌లో చేర్పించారు. 
ట్రాప్‌ ఈవెంట్‌లో మరో భారత షూటర్‌ లక్షయ్‌ 43 పాయింట్లతో రజతం చేజిక్కించుకోగా, వెటరన్‌ షూటర్, మాజీ ప్రపంచ చాంపియన్‌ మానవ్‌జీత్‌ సింగ్‌ గురి తప్పింది. అతను 26 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో యంగ్‌ కున్‌పి (చైనీస్‌ తైపీ; 48) ప్రపంచ రికార్డును సమం చేసి బంగారు పతకం గెలువగా, డేమియంగ్‌ అహ్న్‌ (కొరియా; 30) కాంస్యం నెగ్గాడు. మహిళల విభాగంలో భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. 10 మీ. రైఫిల్‌ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా ఐదో స్థానం, ట్రాప్‌లో సీమ తోమర్‌ ఆరో స్థానం పొందారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top