ముద్దలుగా మారిన మృతదేహాల మూటలను పోస్టుమార్టం అనంతరం కర్నూలు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచేందుకు తీసుకొస్తున్న సిబ్బంది
బస్సు ప్రమాదం మిగిల్చిన విషాదం
కూతురును ఉద్యోగానికి వదిలిపెట్టేందుకు వెళ్లి ఆమెతోపాటు చనిపోయిన ఓ తల్లి
మళ్లీ త్వరలో వస్తానంటూ సుదూర తీరాలకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు.
ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి.
అదే అతనికి చివరి పుట్టినరోజు
ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు.
పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు.
తల్లీ కూతురు మృతి
హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు.
మళ్లీ త్వరలో వస్తానంటూ..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్‌లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు.
బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది.


