భువనేశ్వర్‌ గురించే ఆందోళన!

Anxiety about Bhubaneshwar - Sakshi

సునీల్‌ గవాస్కర్‌

భారత జట్టు బ్రబోర్న్‌ స్టేడియంలో ఎలాంటి లోపాలు లేని ఆటను ప్రదర్శించి సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొన్ని క్యాచ్‌లు వదిలేయడం మినహా ఈ మ్యాచ్‌ మొత్తంగా జట్టుకు సానుకూలంగా సాగింది. విరాట్‌ కోహ్లి కూడా అప్పుడప్పుడు విఫలమవుతాడని, అతను సెంచరీ చేయకపోయినా కూడా జట్టు భారీ స్కోరు సాధించగలదని కూడా ఈ మ్యాచ్‌ నిరూపించింది. క్రికెట్‌ అంటే కేవలం బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే సమరం మాత్రమే కాదు. ఇందులో మానసికంగా కూడా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. పుణే వన్డేలో హోల్డర్‌ అద్భుత బంతికి బౌల్డయిన్‌ రోహిత్‌ శర్మ ఈ సారి స్వింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు ఆరంభంలోనే ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఇదే జోరులో అతను భారీ సెంచరీ సాధించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అంబటి రాయుడు కూడా అద్భుతమైన ఆటతో సెంచరీ నమోదు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

పునరాగమనం చేయడం ఎప్పుడూ సులువు కాదు కానీ రాయుడు తనపై నమ్మకం పెంచేలా, అదీ అవసరమైన సమయంలో చేసి చూపించాడు. బౌలింగ్‌ విషయానికి వస్తే ఖలీల్‌ బంతిని చక్కగా స్వింగ్‌ చేసి చూపించాడు. అనుభవజ్ఞుడైన శామ్యూల్స్‌ను అతను ఔట్‌ చేసిన తీరు మాత్రం హైలైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ స్లిప్‌ క్యాచింగ్‌ కూడా ఆకట్టుకుంది. ఒకే ఒక ఆందోళన భువనేశ్వర్‌ గురించే. ప్రస్తుతం అతను ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అతను ఎంత ఎక్కువగా బౌలింగ్‌ చేస్తే ఆస్ట్రేలియాలో అంత మేలు జరుగుతుంది.  సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్‌లో అందరూ అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. కానీ బ్రబోర్న్‌లో వారి శారీరక భాష చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే వైజాగ్, పుణేల తరహాలో వారు అందరినీ ఆశ్చర్యపరచవచ్చు కూ డా. అదేజరిగితే అద్భుతమైన ముగింపు కాగలదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top