భారత క్రికెట్ జట్టు కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
భారత కోచ్ పదవిపై ఠాకూర్
ముంబై : భారత క్రికెట్ జట్టు కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి అర్హులైనవారితో షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫలానా తేదీలోగా అనేది ఇప్పుడు చెప్పలేమని ఠాకూర్ స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్‌తో డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. ‘కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాస్త సమయం పట్టడం సహజం. కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
అయితే సమర్థుడైన, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందించగల కోచ్ రావడం మాత్రం ఖాయం’ అని ఠాకూర్ అన్నారు. క్రికెట్ సలహా కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన, మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఆటకంటే ఆటగాళ్లు ఎవరూ గొప్ప కాదంటూ, కోహ్లి ఇకపై తప్పు చేయడంటూ ఆశాభావం వ్యక్తం చేసిన ఠాకూర్... వివాదరహితంగా ఈ ఏడాది ఐపీఎల్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.