Sakshi News home page

ఠాకూర్‌ క్షమాపణ చెప్పారు

Published Fri, Jul 14 2017 1:19 AM

ఠాకూర్‌ క్షమాపణ చెప్పారు - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించలేదని ఆయన తెలిపారు. గతంలో లోధా ప్యానెల్‌ ప్రతిపాదనల అమలు విషయంలో తను కోర్టులో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసినందుకు సుప్రీం కోర్టు సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కరణ కేసును తప్పించుకోవాలంటే భేషరతుగా మరోసారి క్షమాపణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఈనెల 7న ఆదేశించింది. ‘కోర్టుకు తప్పుడు సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు.

అనుకోకుండా కొంత సమాచార లోపం కారణంగానే ఇదంతా జరిగింది. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా, బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెబుతున్నాను’ అని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే కోర్టు సూచనల మేరకు నేడు (శుక్రవారం) ఆయన స్వయంగా హాజరుకావాల్సి ఉంది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలంటూ 2016, ఆగస్టులో ఠాకూర్‌ ఐసీసీకి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో తాను ఎవరికీ లేఖ రాయలేదని నాడు కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌ అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement