మనోళ్లకు మరో పరీక్ష | Another test | Sakshi
Sakshi News home page

మనోళ్లకు మరో పరీక్ష

Sep 16 2015 1:40 AM | Updated on Sep 3 2017 9:27 AM

మనోళ్లకు మరో పరీక్ష

మనోళ్లకు మరో పరీక్ష

స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ భారత ఇతర అగ్రశ్రేణి

కొరియా ఓపెన్ బరిలో సింధు, కశ్యప్, శ్రీకాంత్

 సియోల్ : స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ భారత ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు అసలు సిసలు పరీక్ష ఎదుర్కోనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు... పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరందరికీ తొలి రౌండ్‌లోనే గట్టి ప్రత్యర్థులు ఎదురుకానున్నారు.

 ప్రపంచ మాజీ చాంపియన్, ఐదో ర్యాంకర్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0-3తో వెనుకంజలో ఉంది. ఇప్పటిదాకా ఆమెతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్ నెగ్గలేకపోయింది. అయితే గాయం నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్న సింధు జకార్తాలో ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)ను ఓడించి తాను ఫామ్‌లోకి వచ్చానని చాటింది. ఈ సీజన్‌లో గొప్ప విజయాలు సాధించలేకపోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి కొరియా ఓపెన్‌లో ఆ లోటు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.

 మరోవైపు ప్రపంచ 18వ ర్యాంకర్ వీ నాన్ (హాంకాంగ్)తో ఎనిమిదో ర్యాంకర్ కశ్యప్; ప్రపంచ ఏడో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో 12వ ర్యాంకర్ ప్రణయ్; ప్రపంచ 11వ ర్యాంకర్ హూవీ తియాన్ (చైనా)తో నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్; ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో 31వ ర్యాంకర్ అజయ్ జయరామ్ తలపడనున్నారు.
 
 సిక్కి-తరుణ్ జంట ఓటమి

 మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జంట తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. జాంగ్ నాన్-జావో యున్‌లీ (చైనా) జోడీతో జరిగిన మ్యాచ్‌లో సిక్కి-తరుణ్ జంట 11-21, 10-21తో ఓడింది. బుధవారం జరిగే మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో  నైటో-షిజుకా (జపాన్) లతో సిక్కి-ప్రద్న్యా గాద్రె తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement