ఆండ్రూ రస్సెల్‌ అద్భుత రికార్డు!

Andre Russell claims one-man show In CPL - Sakshi

సీపీఎల్‌లో వన్‌ మ్యాన్‌ షో

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ : వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రస్సెల్‌ అద్భుత రికార్డు నమోదు చేశాడు. కరేబీయన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. శుక్రవారం ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా తలవాస్‌ కెప్టెన్‌ అయిన రస్సెల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. తొలుత హ్యాట్రిక్‌తో రెచ్చిపోయిన జమైకన్‌ స్టార్‌ అనంతరం బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు సెంచరీ సాధించిన రెండో టీ20 ప్లేయర్‌గా రస్సెల్‌ గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌ ఆటగాడు జోయ్‌ డెన్లీ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు.

డ్వాన్‌బ్రేవో జట్టైన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. రస్సెల్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లో మెకల్లమ్(56)‌, బ్రావో(29), రామ్‌దిన్‌(0)లను పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్‌ సాధించాడు. దీంతో బ్రేవో జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

రస్సెల్‌ వీరవిహారం..
224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తలవాస్‌.. ఆ బాధ్యతలను సారథిగా రస్సెల్‌ స్వీకరించాడు. ఒక వైపు త్వరగా వికెట్లు కోల్పోయినా 7 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి లూయిస్‌(51) సహకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో  6 ఫోర్లు 13 సిక్సర్లతో 121 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో జమైకా తలవాస్‌ 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఇక సీపీఎల్‌లో రస్సెల్‌దే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఇక ఐపీఎల్‌లో రస్సెల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top