పరుగు తీయబోయి ఇద్దరూ పడిపోయారు!

After Azhar Ali Shocker, Yet Another Farcical Run Out Has Twitter In Meltdown  - Sakshi

వెల్లింగ్టన్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఆటగాడు అజహర్‌ అలీ విచిత్రంగా రనౌటైన సంగతి తెలిసిందే. ఆసీస్‌ పేసర్‌ సిడెల్‌ వేసిన ఓవర్‌లో ఒక బంతిని అజహర్‌ అలీ థర్డ్‌ మ్యాన్‌ దిశగా షాట్‌ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది.  ఇది ఫోర్‌గా భావించిన అజహర్‌ అలీ-అసద్‌ షఫిక్‌లు పిచ్‌ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆ బంతిని అందుకున్న స్టార్క్‌.. కీపర్‌ పైనీకి విసిరాడు. ఫలితంగా అజహర్‌ అలీ రనౌటై భారంగా పెవిలియన్‌ చేరాడు. (ఇలాంటి రనౌట్‌ ఎప్పుడైనా చూశారా?)

ఇదిలా ఉంచితే, మరో ఫన్నీ రనౌట్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  న్యూజిలాండ్‌ వేదికగా జరిగే ప్లంకెట్‌ షీల్డ్‌ ట్రోఫీలో భాగంగా వెల్లింగ్టన్‌లో ఒటాగో-వెల్లింగ్టన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగు తీసే క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు జారిపడటంతో ఒకరు రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. వివరాల్లోకి వెళితే.. ఒటాగో తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్‌ ఐదో బంతిని రిప్పన్‌ ఫైన్‌ లెగ్‌ దిశగా షాట్‌ ఆడాడు. అయితే తొలి పరుగును పూర్తి చేసుకున్న రిప‍్పన్‌.. రెండో పరుగు కోసం నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌ నుంచి వచ్చే క్రమంలో జారి పడ్డాడు. ఇది గమనించని నాథన్‌ స్మిత్‌ బంతి వైపు చూస్తూ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి దాదాపుగా వచ్చేశాడు. అయితే రిప్పన్‌ జారిపడ్డ విషయాన్ని ఒక్కసారిగా చూసిన నాథన్‌ స్మిత్‌ కూడా జారిపడిపోయాడు. ఇద్దరూ ఆటగాళ్లు ఒకే ఎండ్‌లో జారిపడి పైకి లేవడానికి ఆపసోపాలు పడుతుంటే పీకెల్‌ నుంచి బంతి అందుకున్న వికెట్‌ కీపర్‌ లాచీ జాన్స్‌ వికెట్లు గిరటేశాడు. ఫలితంగా నాథన్‌ రనౌట్‌ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో క్రికెట్‌ ప్రేమికుల్లో నవ్వులు తెప్పిస్తోంది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌ ఇన్నింగ్స్‌ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top