
కొలంబియా శుభారంభం
కోపా అమెరికా కప్ సెంటినరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో కొలంబియా శుభారంభం చేసింది.
అమెరికాపై 2-0తో విజయం కోపా అమెరికా కప్
సాంటా క్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ సెంటినరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో కొలంబియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికా జట్టును ఓడించింది. జేమ్స్ రోడ్రిగెజ్, క్రిస్టియాన్ జపాటా ఒక్కో గోల్ చేసి కొలంబియా విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. దాంతో సొంతగడ్డపై శుభారంభం చేయాలని ఆశించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. 67,439 మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ అయిన స్టేడియంలో ఆద్యంతం కొలంబియా ఆధిపత్యం చలాయించింది. ఆట ఎనిమిదో నిమిషంలోనే జపాటా గోల్‌తో కొలంబియా ఖాతా తెరిచింది. ఎడ్విన్ కార్డోనా కొట్టిన కార్నర్ షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న జపాటా గోల్‌గా మలిచాడు.
42వ నిమిషంలో కొలంబియా ప్లేయర్ ఫరీద్ దియాజ్ కొట్టిన షాట్‌ను అమెరికా డిఫెండర్ చేతితో అడ్డుకోవడంలో రిఫరీ కొలంబియాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. ఈ కిక్‌ను రోడ్రిగెజ్ లక్ష్యానికి చేర్చడంతో విరామ సమయానికి కొలంబియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ కొలంబియా ఆటగాళ్లు సమన్వయంతో కదులుతూ అమెరికాపై ఒత్తిడిని కొనసాగించారు. దాంతో అమెరికా నిర్ణీత సమయంలోపు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌ల్లో కోస్టారికాతో అమెరికా; పరాగ్వేతో కొలంబియా తలపడతాయి.