ఆ కప్పు ...ఓ కను విప్పు

2007 World Cup Which Seriously Bolstered India - Sakshi

భారత్‌ను తీవ్రంగా కలచివేసిన 2007 వరల్డ్‌ కప్‌

ద్రవిడ్‌ నేతృత్వంలోని జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ

అదే దారిలో దాయాది పాకిస్తాన్‌

ఒక్కసారిగా కళ తప్పిన టోర్నమెంట్‌

నిర్వహణ పరంగానూ తీవ్ర విమర్శలు

జట్టులో నలుగురు దిగ్గజాలు...తోడుగా ఊపుమీదున్న కుర్రాళ్లు...రన్నరప్‌ హోదాతో బరిలోకి... హాట్‌ ఫేవరెట్‌గా పరిగణన......ఇదీ 2007 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాపై అంచనాలు. కప్‌ వచ్చి ఒళ్లో వాలడమే మిగిలిందన్నంత ఊహాగానాలు.

కానీ, జరిగింది పూర్తిగా భిన్నం. కలలోనూ అనుకోని విధంగా పరాభవం. విదేశీ గడ్డపై ఆటగాళ్లంతా ఖిన్నులవగా, స్వదేశంలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొత్తానికి నాటి ప్రపంచ కప్‌ భారత క్రికెట్‌ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం. పొరపాటుగానైనా మరచిపోలేని గుణపాఠం. ఇంతకూ నాడేం జరిగిందంటే...?      

సాక్షి క్రీడా విభాగం 
అందానికి, ఆస్వాదించడానికి వెస్టిండీస్‌ దీవులు ఎంతటి పేరుగాంచాయో... అక్కడ జరిగిన ఏకైక ప్రపంచ కప్‌ భారత్‌కు అంతటి పీడకలను మిగిల్చింది. టైటిల్‌ కొట్టేస్తారన్నంత జోరులో ఆ దేశం వెళ్లిన రాహుల్‌ ద్రవిడ్‌ బృందం... అప్పటి పసి కూన బంగ్లాదేశ్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అనామక బెర్ముడాపై భారీ విజయంతో ఆశలు రేపినా, కీలక సమయంలో శ్రీలంక చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

దీంతో ఓ పెద్ద సౌధం కళ్లముందే కుప్పకూలినట్లైంది. లంకపై పరాజయం ఖాయమవుతుండగా డగౌట్‌లో కెప్టెన్‌ ద్రవిడ్‌ హావభావాలు మారిపోసాగాయి. ఆటగాళ్లంతా ఏడుపు ఒక్కటే తక్కువన్నట్లు కనిపించారు. ఫలితం తేలాక ద్రవిడ్‌ ముఖం రక్తపు చుక్క కూడా లేనట్లయింది. ఇక పెద్దఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు సరేసరి. అయితే, ఈ దారుణ పరాజయం... దేశంలో క్రికెట్‌ వ్యవస్థ గాడిన పడేలా మేల్కొలొపి మనకు ఓ విధంగా మేలే చేసింది.

ఈ జట్టు ఎలా ఓడింది? 
టాపార్డర్‌లో గంగూలీ, ఉతప్ప, సెహ్వాగ్, మిడిలార్డర్‌లో సచిన్, ద్రవిడ్, ఆ తర్వాత యువరాజ్, ధోని, బౌలింగ్‌లో పేసర్లు జహీర్‌ ఖాన్, అగార్కర్, స్పిన్నర్లు హర్భజన్, కుంబ్లే. ఇలాంటి కూర్పున్న జట్టు తడబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓడుతుందని అసలే భావించరు. అలసత్వం, ఏమరపాటు, నిర్లిప్తత ఏదైనా కానీ, గ్రూప్‌ ‘బి’లో బంగ్లాతో తొలి మ్యాచ్‌లోనే దెబ్బ పడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ గంగూలీ (129 బంతుల్లో 66; 4 ఫోర్లు) నింపాదిగా ఆడగా, యువరాజ్‌ (58 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్‌) నయమనిపించాడు.

మష్రఫె మొర్తజా (4/38), అబ్దుర్‌ రజాక్‌ (3/38), మొహమ్మద్‌ రఫీఖ్‌ (3/35) ధాటికి ఉతప్ప (9), సచిన్‌ (7), సెహ్వాగ్‌ (2), ద్రవిడ్‌ (14) ధోని (0) విఫలమయ్యారు. బంగ్లాను బౌలింగ్‌తో కట్టిపడేయొచ్చనుకుంటే.. అదీ వీలు కాలేదు. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు ముష్ఫికర్‌ రహీమ్‌ (107 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షకిబుల్‌ హసన్‌ (86 బంతుల్లో 53; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలు తోడవడంతో బంగ్లా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 9 బంతులుండగానే గెలిచేసింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో తేలికైన రెండు, క్లిష్టమైన రెండు క్యాచ్‌లు జారవిడవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. 

బెర్ముడాను బెంబేలెత్తించినా... 
బంగ్లా దెబ్బతో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూ ప్రత్యర్థులపై గెలవాల్సిన స్థితిలో బెర్ముడాపై భారత్‌ జూలు విదిల్చింది. టాస్‌ గెలిచిన బెర్ముడా బౌలింగ్‌ ఎంచుకోవడమూ మనకు కలిసొచ్చింది. గంగూలీ (114 బంతుల్లో 89; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) గట్టి పునాది వేయగా సెహ్వాగ్‌ (87 బంతుల్లో 114; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో శివమెత్తాడు. యువరాజ్‌ (46 బంతుల్లో 83; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), సచిన్‌ (29 బంతుల్లో 57 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కదంతొక్కారు. దీంతో భారత్‌ ఐదు వికెట్లకు 413 పరుగుల భారీ స్కోరు చేసింది. మన జట్టు వన్డేల్లో 400 పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. బెర్ముడా 43.1 ఓవర్లలో 156కే పరిమితమైంది. 257 పరుగుల భారీ విజయం భారత్‌ సొంతమైంది. 

లంక దెబ్బకొట్టింది 
గెలిస్తేనే సూపర్‌ 8 దశకు వెళ్లే స్థితిలో గ్రూప్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియాకు శ్రీలంక ఝలక్‌ ఇచ్చింది. టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తరంగా (90 బంతుల్లో 64; 6 ఫోర్లు), చమర సిల్వ (68 బంతుల్లో 59; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు చేయగా, దిల్షాన్‌ (38), ఆర్నాల్డ్‌ (19), వాస్‌ (19) మెరుపులతో లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. మోస్తరు లక్ష్యమే అయినా భారత్‌ ఛేదించలేకపోయింది. ఓపెనర్లు ఉతప్ప (18), గంగూలీ(7) విఫలమవగా సచిన్‌ (0), ధోని (0) ఖాతా తెరవలేకపోయారు. సెహ్వాగ్‌ (46 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ ద్రవిడ్‌ (82 బంతుల్లో 60; 6 ఫోర్లు) పోరాటం సరిపోలేదు. యువరాజ్‌ (6) రనౌట్‌ అవకాశాలను దెబ్బతీసింది. దీంతో 43.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. 69 పరుగుల తేడాతో ఓడి ఇంటిముఖం పట్టింది. 

పాక్‌కూ తప్పలేదు 
ఇదే టోర్నీ గ్రూప్‌ ‘డి’లో ఆతిథ్య వెస్టిండీస్, ఐర్లాండ్‌ చేతిలో ఓడిన దాయాది పాకిస్తాన్‌ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐర్లాండ్‌పై ఓటమి అనంతరం ఆ జట్టు కోచ్‌ బాబ్‌ వూమర్‌ అనుమానాస్పద మరణం తీవ్ర వివాదాస్పదమైంది. 

ఈ దెబ్బకు ఫార్మాటే మారింది 
16 జట్లు 4 గ్రూప్‌లుగా లీగ్‌ దశలో తలపడిన 2007 కప్‌ పేలవంగా సాగిన తీరుతో తదుపరి ప్రపంచ కప్‌ ఫార్మాటే మారిపోయింది. భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2011 కప్‌లో 14 జట్లను ఏడు చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించి ఆడించారు. పెద్ద జట్లు దురదృష్టవశాత్తు ఒక మ్యాచ్‌లో ఓడినా వాటి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేశారు.   

►అగ్రశ్రేణి జట్లయిన భారత్, పాక్‌ లేకపోవడంతో మొత్తం టోర్నీనే కళ తప్పింది. భారీ నష్టాలతో ప్రసారకర్తలు లబోదిబోమన్నారు. దీంతోపాటు ప్రపంచ కప్‌ ప్రారంభ తేదీ (మార్చి 11) నాటికి సైతం మైదానాలు సిద్ధం కాకపోవడం, టిక్కెట్ల ధరలు భారీగా ఉండటం ఇలా పలు అంశాలు విండీస్‌ బోర్డు వైఫల్యాన్ని ఎత్తిచూపాయి. ఇక శ్రీలంక– ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ ప్రహసనంగా మారి కప్‌కే అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. వర్షం అడ్డంకితో 38 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్‌ (146) సునామీ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ 281 పరుగులు చేసింది.

లంక ఇన్నింగ్స్‌ సందర్భంగా మళ్లీ వర్షం కురవడంతో లక్ష్యాన్ని 36 ఓవర్లలో 269గా మార్చారు. 33వ ఓవర్‌ ముగిసేసరికి లంక ఈ లక్ష్యానికి 63 పరుగుల దూరంలో ఉంది. అయితే, వెలుతురు లేదంటూ అంపైర్లు మ్యాచ్‌ నిలిపివేశారు. ఈలోగా ఆసీస్‌ ఆటగాళ్లు విజయ సంబరాలు మొదలుపెట్టేశారు. అంతరాయం వర్షం కారణంగా తలెత్తలేదు కాబట్టి మిగిలిన మూడు ఓవర్లను తర్వాతి రోజు ఆడిస్తామని అంపైర్లు పేర్కొన్నారు. లంక కెప్టెన్‌ జయవర్ధనే మాత్రం ఆ అవసరం లేదని అప్పుడే ఆడేస్తామని చెప్పాడు. ఆసీస్‌ కెప్టెన్‌ పాంటింగ్‌... స్పిన్నర్లతో బౌలింగ్‌కు అంగీకరించాడు. పూర్తి చీకటిలో సాగిన ఈ మూడు ఓవర్లలో లంక 9 పరుగులే చేసింది. 53 పరుగులతో ఆసీస్‌ గెలిచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top