ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 15 ఏళ్లు

15 Years For MS Dhoni International Cricket - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2004లో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో అరంగేట్రం చేసిన ధోని సోమవారం డిసెంబర్‌ 23తో 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ఈ జార్ఖండ్‌ స్టార్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 17, 266 పరుగులు చేశాడు. 38 ఏళ్ల ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇప్పటివరకు 350 వన్డేలు, 98 టి20లు, 90 టెస్టులు ఆడాడు. 829 వికెట్ల పతనంలో పాలు పంచుకున్నాడు.

అతని సారథ్యంలో భారత్‌ ఇటు పొట్టి ఫార్మాట్‌ (2007)లో, అటు వన్డేల్లో (2011) ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత సారథిగా ధోనిది ఘనమైన రికార్డు. 2013లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ధోని సేన గెలిచింది. టీమిండియాను ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా అతనిదే. ప్రస్తుతం అతని చుట్టూ రిటైర్మెంట్‌ వార్తలు వస్తున్నా... ఇప్పటివరకు తను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. జనవరి దాకా తనను ఈ విషయమై అడగొద్దని ఇటీవల మీడియాతో అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అతను బరిలోకి దిగలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top