పాఠ‘శాలసిద్ధి’ | integrated schools development programme by hrd | Sakshi
Sakshi News home page

పాఠ‘శాలసిద్ధి’

Feb 5 2018 3:45 PM | Updated on Feb 5 2018 3:45 PM

integrated schools development programme by hrd - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్‌దైనా కావాల్సినవి వసతులు, వనరులు. ఈ విషయంలో తేడాలొస్తే ఇబ్బంది పడేది విద్యార్థులే. దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ‘శాలసిద్ధి’ కార్యక్రమం చేపట్టింది. దేశంలోని అన్ని పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర స్వరూపం క్షణాల్లో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. త్వరలో దీన్ని ప్రైవేట్‌ పాఠశాలలకూ వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాఠశాలల సమగ్ర అభివృద్ధి పథకాన్నే ఆంగ్ల అక్షర క్రమంలో సంక్లిప్తంగా ‘శాలసిద్ధి’ అని పిలుస్తున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల హెచ్‌ఎంలు శాలసిద్ధి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తొలుత యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకోసం స్కూల్‌ యూడైస్‌ కోడ్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. శాలసిద్ధిలో వివరాలు అప్‌లోడ్‌  చేయడానికి ఇప్పటికే హెచ్‌ఎంలకు శిక్షణనిచ్చారు. ఇదే పనిలో హెచ్‌ఎంలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాల సమాచారం కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారు.  

నివేదికపై కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలన
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు పంపిన తర్వాత ఆ నివేదికలను జాతీయస్థాయిలో పరిశీలిస్తారు. వాస్తవాలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలనకు వస్తుంది. పాఠశాలలో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం శాలసిద్ధి కార్యక్రమం చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోని పీఎస్, యూపీఎస్, హైస్కూళ్ల స్థితిగతులు, వనరులపై అంచనాకు వచ్చేందుకు ఈ వివరాల సేకరణ దోహదం చేస్తుంది.

నిధుల మంజూరుకు సమాచారమే ప్రామాణికం
శాలసిద్ధి ద్వారా ప్రతి పాఠశాల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇక ఏ పాఠశాల సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అప్పుడే వసతులు, వనరులు, సమస్యలు, అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుంది. భవిష్యత్‌లో పాఠశాలల అవసరాల మేరకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ఈ సమాచారం దోహదపడుతుంది. 
– ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement