ఫొటో చలానాలపై నిరసన | protest on photo challans in shamshabad | Sakshi
Sakshi News home page

ఫొటో చలానాలపై నిరసన

Jan 26 2018 3:03 PM | Updated on Jan 26 2018 3:03 PM

protest on photo challans in shamshabad - Sakshi

శంషాబాద్‌ పట్టణంలో బీఎంఎస్‌ ర్యాలీ...

శంషాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీస్తూ చలానాలు వేయడంతో బతుకు బండి లాగలేకపోతున్నామని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) ఆధ్వర్యంలో గురువారం శంషాబాద్‌ పట్టణంలో ఆటో, ట్యాక్సీ, డీసీఎం, వ్యాన్‌ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సామా ఎన్‌క్లేవ్‌ నుంచి ఆర్‌జీఐ పోలీస్‌స్టేషన్‌ మీదుగా తొండిపల్లి ఆటో స్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీఎంఎస్‌ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్స్‌ జిల్లా నాయకుడు చింతల నందకిషోర్‌ మాట్లాడుతూ పోలీసులు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీయడంతో ఒక నెలలోనే శంషాబాద్‌ పట్టణంలో ఆటోలు నడుపుకుని జీవించే డ్రైవర్లు మూడు లక్షల రూపాయల వరకు చలానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

వృద్ధులు, వికలాంగుల కోసం రోడ్డుపై ఆటో ఆపినా వెనుక నుంచి ఫొటో తీస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆటో స్టాండ్, పార్కింగ్‌ స్థలాలను ఖరారు చేసి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని పెద్ద పెద్ద హోటళ్ల ముందు విచ్చలవిడిగా వాహనాలు నిలిపినా పట్టించుకోని పోలీసులు.. ప్రయాణికుల కోసం రోడ్డుపై అనివార్య పరిస్థితుల్లో వాహనాలను ఆపితే చలానాలు వేయడంతో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆటో, ట్యాక్సీ, డీసీఎం డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకుని ఫోటో చలానాలను నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్‌ జిల్లా నాయకులు జనార్దన్, భానుప్రకాష్, రామిరెడ్డి, కె.శ్రీనివాస్, ఎం.డి.సయ్యద్, కె.రాజా, జగన్, ఆజామ్, సురేష్, బాలకృష్ణ, రమేష్, మల్లేష్, దేవేందర్, కృష్ణ, సిద్దు, నిరంజన్, శేఖర్, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement