నెలవారీ పింఛన్‌ సేవలకే

old woman service for trusts donate her pension money - Sakshi

ఆదిలక్ష్మి సేవలు అమోఘం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోట: సమాజంలో పేదలు, నిస్సహాయుల కోసం పరితపించి తన భర్త మరణానంతరం వస్తున్న పింఛన్‌ను వారికే అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారు ఎమ్వీరావ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు ఆదిలక్ష్మమ్మ. భర్త మరణానంతరం తనకు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని పేదలకు పంచాలని భావించి.. తదనుగుణంగా భర్త పేరుతో ఫౌండేషన్‌ను స్థాపించి సమాజసేవలో పునీతులవుతున్నారు. కుమారుడు, కుటుంబసభ్యుల అండతో తమ సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ అన్ని వర్గాల మన్ననలను పొందుతున్నారు.

భర్త ఆశయాలు కలకాలం గుర్తుండాలని
మండలంలోని చెందోడుకు చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త, దివంగత ముప్పవరకు వెంకటేశ్వరరావు ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడు, విద్యావేత్త. పనిచేసిన చోటల్లా అభ్యుదయవాదిగా పేరు గడించారు. సంఘసంస్కర్త, అణగారిన వర్గాల చైతన్యం కోసం పాటుపడ్డారు. అందరూ సంతోషంగా ఉండాలని కష్టనష్టాలను పంచుకుంటూ వారితో మమేకమవుతూ ఆఖరి శ్వాసవరకు జీవించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరైన అనంతరం స్నేహితులతో కలిసి 2001లో విద్యానగర్‌లో విద్యావికాస్‌ పాఠశాలను ప్రారంభించారు. విద్యారంగానికి చివరి శ్వాసవరకు సేవచేసి 2008 నవంబర్‌ 17న మరణించారు. అప్పటి వరకు గృహిణిగా ఇంటిపట్టునే ఉండి కుటుంబబాధ్యతలు నెరవేర్చిన ఆదిలక్ష్మమ్మ తన భర్త ఆశయాలు ప్రజల్లో కలకాలం గుర్తుండాలని సంకల్పించారు. 2009 మార్చిన కుమారుడు, ముగ్గురు కుమార్తెలతో చర్చించి వారి నిర్ణయం మేరకు ఎమ్వీరావ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.

ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో 2,250కు పైగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కుటుంబసభ్యుల తోడ్పాటు కలిసిరావడంతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం లభించింది. రక్తదానంపై విరివిగా ప్రచారం చేస్తూ శిబిరాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ మోటివేటర్‌గా నెల్లూరు రెడ్‌క్రాస్‌ ద్వారా 8 సార్లు, కలెక్టర్‌ చేతుల మీదుగా రెండు సార్లు అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం వచ్చే పెన్షన్‌ రూ.22 వేలు కాగా, గ్రాట్యుటీ రూ.10 వేల మొత్తాన్ని సేవల కోసం కేటాయిస్తున్నాను. వేసవిలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు విలువైన సేవలందిస్తున్నారు. మారుమూల పల్లెలు, గిరిజన కాలనీల్లో వసతులు కల్పిస్తూ శక్తివంచన లేకుండా చేతనైన సాయం చేస్తున్నారు. తల్లి దారిలోనే కుమారుడు ముప్పవరకు లీలామోహన్‌ నడుస్తున్నారు. కుల, మత, ప్రాంతీయతత్వం అడ్డురాదని నిరూపిస్తూ ఫౌండేషన్‌ సేవలను విస్తృతం చేస్తున్నారు.  

సాయం అందించడమే లక్ష్యం  
ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. మనుషులు దూరమైనా వారి జ్ఞాపకాలు మంచి మార్గంలో నడిపిస్తాయి. భర్త ఆశయసాధన కోసం పాటుపడుతున్నా. కొన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. దృఢచిత్తంతో ముందుకు సాగుతూ వందలాది సేవా కార్యక్రమాలను నిర్వహించా. కొడుకు, కోడళ్లతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నా. – ఆదిలక్ష్మమ్మ

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top