
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం లోక్‌సభ ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన నోటీసును వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే అవిశ్వాసం పెడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని అన్నారు.
పార్లమెంటులో చర్చ జరిగేవరకూ అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకొని.. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారని అన్నారు.