
సాక్షి, విజయవాడ : తిత్లీ తుపాను కారణంగా అల్లకల్లోమైన ప్రాంతాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు విమర్శించారు. తుపాను బాధితులను వైఎస్సార్‌సీపీ ఆదుకుంటోందని, సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆపదలోనూ చంద్రబాబు అవకాశాలను వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు.
తిండి, నీరు లేక అవస్థలు పడుతుంటే.. అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి బాధితులకు నరకయాతనగా మారిందని అన్నారు. తప్పుడు లెక్కలు, పన్నులు ఎగ్గొట్టినా ఐటీ సోదాలు జరుగుతాయని, సీఎం రమేష్ మాటలు ఎవరూ నమ్మరని, ఓటుకు కోట్లు కేసులో రూ. 50లక్షలు ఎక్కడివని ప్రశ్నించారు. మిగిలిన నాలున్నర కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.