ఎవరితోనూ పొత్తు ఉండదు: వైఎస్‌ జగన్‌

YSRCP President YS Jagan Mohan Reddy Exclusive Interview With Sakshi

సాక్షి, అమరావతి :

సాక్షి : పాదయాత్ర మీ కుటుంబానికి కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేశారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వారందరూ అధికారంలోకి వచ్చారు. మీరూ వస్తారని ఆశిస్తున్నా. గత 14 నెలలుగా చేస్తున్న పాదయాత్రలో మీరు చాలా విషయాలపై మాట్లాడారు. స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రాలేదని బయట అనుకుంటున్నారు. కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా.. రాజకీయాలు వదిలేసి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాటం నుంచి దూరమయ్యారన్న విమర్శ ఉంది. మీరు ఏమంటారు? 
జగన్‌ : పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. పోరాటం అసెంబ్లీలో 2014 నుంచి చేస్తూనే ఉన్నాం. చివరకు 2017 దాకా కూడా చేశాం. అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించగలిగాం. కానీ, ఆ అసెంబ్లీ పనితీరులో ప్రజాస్వామ్యం అసలు ఉందా? లేదా? అన్నట్టుగా తయారైంది. ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా అధికార పార్టీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించలేదు. వారి రాజీనామా కోసం అసెంబ్లీలో ఒత్తిడి చేశాం. దాదాపు రెండేళ్ల పాటు వేచి చూశాం.

2014లో శాసనసభ మొదలైతే ఆ ఏడాది చివరి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పశ్చాత్తాపం గానీ చేసింది తప్పనే భావన గానీ ఎక్కడా లేకుండా పోయింది. అదే తప్పును నిస్సిగ్గుగా వరుసగా చేయడం మొదలు పెట్టారు. చివరకు ఆ సిగ్గు లేని తనం ఏ స్థాయికి చేరిందంటే వాళ్లల్లో నలుగుర్ని ఏకంగా మంత్రులను కూడా చేశారు. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది. చట్టసభలకు మనం ఎవరమైనా వెళ్లేది ఎందుకంటే చట్టాలను చేస్తామని. ప్రజలు మనవైపు చూసేది అందుకే. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.   

సాక్షి : ప్రతిపక్షం లేని శాసనసభలో ప్రత్యేక హోదా మొదలు పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మీరు మీ పాదయాత్ర ద్వారా సమాధానం ఇచ్చామనుకుంటున్నారా? 
జగన్‌ : తప్పకుండా.. అసెంబ్లీలో ఉన్నా అంతకన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. అసెంబ్లీలో అయితే అది కూడా ఇవ్వనివ్వరేమో... ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎలాగూ ఖూనీ అయిపోయింది. 2014 నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక వ్యవస్థను ఆ స్పీకర్‌ అనే వ్యక్తే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించరు. ఏదైనా మాట్లాడబోతే మైకులు కట్‌ చేస్తారు. అడుగడుగునా అవాంతరాలు కల్పిస్తారు.

అటువంటి పరిస్థితుల్లో జనం మధ్యనైనా మేము చెప్పదలచుకున్నది ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పగలుగుతాం. బాధితులు ప్రజలు. ప్రజల దగ్గరకే మేము పోతున్నాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అక్కడ జరిగిన అన్యాయాలు.. రాజధాని దగ్గర్నుంచి మొదలుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వరకు, చివరకు ఆయన ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ.. దాన్నే ధర్మపోరాట దీక్షలుగా మళ్లీ అభివర్ణిస్తూ ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారో, మోసం చేస్తున్నారో అవన్నీ ప్రజలకు అసెంబ్లీలో కన్నా మంచిగా వివరించగలిగాం.  

ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు మాదిరి బుక్కులు బుక్కులు తయారు చేయను. కులానికో పేజీ పెట్టి, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలన్న ఆరాటంతో మేనిఫెస్టో చెయ్యను. నా మెనిఫెస్టో ఒకటి.. మహా అయితే రెండు పేజీలుంటాయి. ఆ మేనిఫెస్టోలో అంశాలు ఇవీ అని ప్రజలకు చూపించి, ఓట్లు వేయించుకున్న తర్వాత నేను అది అమలు చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు మనస్తత్వం నాకు లేదు. నాకు అపారమైన విశ్వసనీయత ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే, చెయ్యగలిగితే ప్రజలకు మంచి చేస్తాను. 

సాక్షి : శాసనసభలో మీ సభ్యుల్ని కొనుగోలు చేసినట్టే లోక్‌సభలోనూ మీ సభ్యుల్ని టీడీపీ కొనుగోలు చేసింది. అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి చేసినట్టుగా లోక్‌సభ స్పీకర్‌పై అంత ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదన్న విమర్శ ఉంది? 
జగన్‌ : అక్కడా, ఇక్కడా తీవ్రంగానే ఆక్షేపించాం. తప్పుబట్టాం. అక్కడా ఇక్కడా అదే పరిస్థితి. టీడీపీ, బీజేపీలు ఇద్దరూ కలిసి నాలుగేళ్లు సంసారం చేశారు. అక్కడ వాళ్లు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని తొక్కిపెట్టారు.
 
సాక్షి : ఇప్పుడు విడిపోయామంటున్నారు, ఇప్పుడైనా చర్య తీసుకుని ఉండాల్సింది కదా? 

జగన్‌ : ఆ మేరకు వ్యవస్థలు దిగజారిపోయాయి. బహుశా బీజేపీకి, చంద్రబాబుకు మధ్య లోపాయికారిగా సంబంధాలు కొనసాగుతున్నాయేమో.. 

సాక్షి :  చంద్రబాబు నాయుడు తాజాగా మీ మీద చేసిన ఆరోపణ.. సీనియర్‌ మోదీ కేసీఆర్‌ అయితే జూనియర్‌ మోదీ మీర (జగన్‌)ని. అసలు మోదీ, సీనియర్, జూనియర్‌ మోదీలు ముగ్గురూ ముసుగులు తీసి కలిసి పోటీ చేయండంటున్నారు. మీరేమంటారు? 
జగన్‌ : మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఒకటుంది. అసలు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారు? చేశారు? 2014 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, మోదీ ముగ్గురూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మా మీద యుద్ధం చేశారు. అప్పుడు వారన్న మాటలు కూడా చూడండి. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు వేసినట్టే అని చంద్రబాబు అన్నాడు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు. తనకున్న ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం కూడా చేయించారు. ఆ తర్వాత ఏమి జరిగింది? 2014 ఎన్నికలు అయిపోయాయి. 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదేళ్లలో మేము ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీతో కలవలేదు.

కానీ అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశాడు. ఆ సమయంలో బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ పరస్పరం విపరీతంగా పొగుడుకున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడం, చంద్రబాబు కోరిక మేరకు ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చెప్పడం.. దానికి ఏకంగా అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడు తీర్మానాలే చేసి బీజేపీని పొగడడం, చివరకు 2017 జనవరి 27న ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిందనడం, చేసి ఉంటే చెప్పండని ప్రతిపక్షాలను సవాల్‌ చేయడం జరిగింది. ఆ దశ వరకు ఆ ఇద్దరూ చిలకా గోరింకల్లా సంసారం చేశారు. కేవలం ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయనగా చంద్రబాబు నాయుడు తాను చేసిన మోసాలకు, అన్యాయాలకు, అవినీతి, అబద్ధాలకు ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలని బలిపశువు కింద కేంద్రంపై ఆరోపణలు నెట్టేసి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.

ఇదే కాంగ్రెస్‌ పార్టీని ఆవేళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అన్యాయంగా విభజించిందని చెప్పిన వ్యక్తి, తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ అని అన్న వ్యక్తి, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి మళ్లా వస్తుందన్న ఇదే పెద్దమనిషి తానే కంకణం కట్టుకుని అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి అబద్ధాలు చెప్పారో ఈవేళ కూడా.. అదే ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయుడు గొప్పగా పాలిస్తాడు, గొప్పగా మేలు చేస్తాడనే పాత హామీలనే మళ్లీ తెరపై చూపిస్తున్నాడు. ఏదైనా ఆరోపణ చేయాలంటే దానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. కానీ చంద్రబాబు చేసే వాటికి అటువంటివేమీ ఉండవు. ఆ మనిషి ఏది చెప్పాలనుకుంటే అది చెబుతాడు, తాను ఏది చేస్తే అది కరెక్టు, అలా కాదన్నవాళ్లపై బురద జల్లుతారు.

చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన అనైతిక పొత్తుల్లోనే కాదు.. నాలుగున్నరేళ్ల పాలనలోనూ అదే కనిపిస్తుంది. ఆయన నైజమే అంత. ఎన్నికలప్పుడు రైతులకు 87,612 కోట్ల రూపాయల పంట రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈవేళ ఏమైంది? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణ మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబూ ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటీ? ఆయన చేసిన మోసంతో రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాకపోగా సున్నా, పావలా వడ్డీలకు రుణాలు రాకుండా పోయాయి.

సున్నా, పావలా వడ్డీల కోసం గత ప్రభుత్వాలు వీళ్ల తరఫున వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ఆ డబ్బుల్ని కట్టకుండా అన్యాయం చేశాడు. ఆయన చేసిన మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఏ చదువు లేకపోయినా పర్వాలేదమ్మ.., ఇంటింటికీ ఉద్యోగమో, ఉపాధో చూపిస్తా. లేకుంటే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ రెండు వేలూ పోయే, ఉద్యోగాలూ రాలేదు, చివరకు ఉద్యోగాలు వచ్చేందుకు అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రత్యేక హోదానూ ఖూనీ చేశారు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, మోసాలే. దారుణమైన పరిపాలన. ఎదుటి వాళ్ల మీద బురద జల్లడం, మీడియా మేనేజ్‌మెంట్‌ వంటి అన్యాయమైన పాలన చూస్తున్నాం.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు దాన్ని ఖూనీ చేశాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని, అదేమన్నా సంజీవినా అన్నాడు. హోదా అంటే జైల్లో పెడతాను. పీడీ యాక్ట్‌ తెరుస్తాను అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాట్లాడితే ఇక ప్రత్యేక హోదా సాధన ఎలా జరుగుతుంది? కాబట్టి వీళ్ళందరూ మోసం చేశారు. అలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. హోదాకు మద్దతుగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని కూడా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా కోసం మన 25 మంది ఎంపీలు వినిపిస్తున్న వాణికి మరో 15 మంది తోడవుతున్నారు. పార్లమెంట్‌ సాక్షిగా మీరు ఇచ్చిన ప్రత్యేక హోదా కావాలని అడిగే స్వరం 25 నుంచి 42 మందికి పెరిగింది. ఆ అడుగు వేసేందుకు కేసీఆర్‌ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.
  

సాక్షి : తెలంగాణ ఫలితం చూశారు కదా.. మీకు ఏమనిపించింది? 
జగన్‌ :  ప్రజలు చంద్రబాబు అనుకున్నంత పిచ్చోళ్లు కాదు. అది చంద్రబాబుకు అర్థం అయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పారు. బయటి నుంచి ఎవరైనా మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే ఏమిటీ వ్యవస్థ అనిపిస్తుంది. రాజకీయ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఈ రాజకీయ నాయకుల్ని ఎలా క్షమించగలం అనేలా వ్యవస్థను దిగజార్చారు. అటువంటి అన్యాయమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థను దిగజార్చి మళ్లీ అవే అబద్ధాలతో తెలంగాణకు వెళ్లి అవే మాటల్ని చెబితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నిజంగా చైతన్యవంతులు కాబట్టి.. జరుగుతున్నది చూస్తున్నారు కాబట్టి.. అనైతిక పొత్తులకు, అనైతిక వ్యవహారాలకు తెర దింపే విధంగా తీర్పు ఇచ్చారు.

అత్యధికంగా ఆంధ్రా సెటిలర్లు ఉన్న ఏరియా హైదరాబాద్‌. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు 40, 50, 60 వేల తేడాతో గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లోనే ఓడిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లే ఓటేయలేదంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు చంద్రబాబుపై ఏ స్థాయిలో కోపం పెంచుకుని ఉన్నారో అనేదానికి అదే నిదర్శనం. సెటిలర్లే ఓటేయకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎందుకు వేస్తారు? 

సాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చంద్రబాబును ఉద్దేశించి ఒకమాట అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో  నేను ఇక మొదలు పెడతానన్నారు? 
జగన్‌ :  కేసీఆర్‌ గారు ఏమన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు గానీ వాస్తవం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్‌ గారు ఏదయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడిన మాటల్ని స్వాగతించాను. ఎందుకంటే కేసీఆర్‌ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను ప్రధాన మంత్రికి లెటర్‌ కూడా రాస్తానని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తానన్న మాటలు హర్షించదగినవి. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని చట్టంలో చేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది. అదే కాంగ్రెస్‌ పార్టీ ఆవేళ రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉన్నా బాగుండేది.  

2014 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ కలిసి ఏమి చెప్పారో ఈవేళ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కలిసి అవే హామీలు ఇస్తున్నారు. సినిమా ఒక్కటే.. యాక్టర్లే వేరు. ఇందులో విరుద్ధ (ఐరానిక్‌) విషయం ఏమిటంటే ఇద్దరితోనూ కాపురం చేసింది చంద్రబాబే. బీజేపీతో కాపురం చేసి విడాకులు ఇచ్చారు, మళ్లీ కాంగ్రెస్‌తో సంసారం చేస్తున్నాడు. ఇద్దరితోను కాపురం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్‌ కాంగ్రెసే. మరి ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. తలాతోకా ఉండదు. 

సాక్షి : మీరు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో ఇలా చెబుతున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నదేమిటి? తాను తెలంగాణకు వెళ్లి పోటీ చేస్తే టీఆర్‌ఎస్‌ దాన్ని సెంటిమెంట్‌కు ఎలా వాడుకుందో, ఇక్కడా అదే రీతిలో తెలంగాణ సీఎం వచ్చి జగన్‌మోహన్‌ రెడ్డితో కలవబోతున్నాడని, జగన్, మోదీ, కేసీఆర్‌ కలవబోతున్నారని ఇప్పటికే  ప్రచారం మొదలు పెట్టారు. దానివల్ల ఇక్కడ ఎలాంటి పరిణామాలుంటాయి?  
జగన్‌ : అక్కడా కేసీఆర్‌.. కాంగ్రెస్, మోదీతో విభేదించి పోటీ చేశాడు. మోదీ హైదరాబాద్‌కొచ్చి తిట్టిపోయాడు. కేసీఆర్‌ కూడా మోదీని తిట్టాడు. కాంగ్రెస్, బీజేపీతో పోటీపడి ఆయన గెలిచాడు. ఎక్కడా కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిందీ లేదు. కలిసి సపోర్ట్‌ చేసిందీ లేదు. పోనీ ఐదేళ్లలో ఆయన చేశాడా అంటే అదీ లేదు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు బీజేపీతో సంసారం చేశాడు తప్ప, ఆయనేం చేయలేదు. అదే వ్యక్తితో పొత్తు పెట్టుకునేందుకు ఇదే చంద్రబాబు నాయుడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో ప్రతిపాదన చేశానని నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు.

‘తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, కలిసి పోటీ చేద్దామని నేను ప్రతిపాదించాను. కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు. అందుకే నేను కాంగ్రెస్‌తో జత కట్టాన’ని తనంతట తానే చెప్పాడు. ఇది చెప్పి రెండు నెలలు కాలేదు. అక్టోబర్‌లో హరికృష్ణ చనిపోయాడు. ఇది జరిగి నాలుగు నెలలు కాలేదు. అంటే నాలుగు నెలల క్రితం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆయనే సంసిద్ధత వ్యక్తం చేశాడు. అంటే దానర్థమేంటి? కేసీఆర్‌ మోదీతో లేనట్టే కదా? అలాంటి చంద్రబాబు నాలుగు నెలల తర్వాత చెప్పిందేంటి? ఆయన తప్ప కేసీఆర్, నేను మోదీతో ఉన్నామట.  

సాక్షి : 2014 ప్రస్తావన తెచ్చారు మీరు. పవన్‌ కళ్యాణ్, బీజేపీతో కలిసి టీడీపీ అధికారంలోకొచ్చింది. అదీ ఒకటి ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో. అప్పట్లో మీరు అలాంటిదేదన్నా చేసుంటే అధికారంలోకి వచ్చుండే వారు. ఇప్పటికైనా పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకు అధికారం చాలా సులభంగా వస్తుందని చెబుతున్నారు.  
జగన్‌ : రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు. ఈ పరిస్థితికి ఎవరు కారణమని ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ, ఇదే పవన్‌ కళ్యాణ్‌. ఆ రోజు ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడి, ప్రతీ హామీని మేం నెరవేరుస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇదే పవన్‌కళ్యాణ్‌ ఊరూరా తిరిగి చంద్రబాబుకు ఓటేయమన్నాడు. ఆయనకు అనుభవం ఎక్కువగా ఉందని, ఆయనిచ్చిన హామీలకు తాను పూచీ అంటూ చెప్పాడు. చంద్రబాబు గురించి చెప్పాడు.

మోదీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాడు. ఎన్నికలయిపోయిన తర్వాత జరిగిందేమిటి? ప్రత్యేక హోదా విషయమే కాకుండా,  రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, చదువుకున్న పిల్లలను.. అందరినీ చంద్రబాబు ఎలా మోసం చేశాడు? ఆయన మేనిఫెస్టో చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా చేస్తానని ప్రతీ కులాన్ని నమ్మించాడు. తన చేతుల్లో లేనిది కూడా చెప్పి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించాడు. ఎంత నేర్పుగా మోసం చేయగలమన్న దానిపై పీహెచ్‌డీ చేసి మరీ మోసం చేశాడు.  

బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం నోటీసులు రైతుల ఇళ్లకు వస్తున్నాయి. చివరకు ఆయన చేసిన రుణమాఫీ అన్నది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతుల రుణాలు ఆవేళ 87,612 కోట్ల రూపాయలు ఉంటే 2018 వచ్చే సరికి రైతుల రుణాలు 1,26,000 కోట్లకు చేరాయి. వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడయి ఈయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. 

సాక్షి : మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా ఇస్తానన్న పార్టీకే మద్దతిస్తామంటున్నారు. రాçహుల్‌ గాంధీ హోదా ఇస్తానంటున్నాడు. కాంగ్రెస్‌తో కలిసిపోతారా? 
జగన్‌ : నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇప్పటి వరకూ మేం చాలా మోసపోయాం. హోదా ఇస్తామని అంతా మోసం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ హోదాను చట్టంలో చేర్చకుండా మోసం చేసింది. బీజేపీ చేస్తానని ముందుకొచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలికారు. వాళ్లూ మోసం చేశారు. ఎవరో ఏదో చేస్తామని చెబితే నమ్మే పరిస్థితుల్లో మేం లేం. ఏపీ ప్రజలను కోరేది ఒకటే. 25కు 25 ఎంపీ స్థానాలను మనం సొంతం చేసుకుందాం. ఎవరికీ మద్దతునివ్వాల్సిన పనిలేదు. గెలిచిన తర్వాత సంతకం పెట్టు మద్దతిస్తామందాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి హోదాకు సంతకం పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ మద్దతిస్తే.. ఇప్పుడు జరిగినట్టే మళ్లీ వాళ్లు చేతులెత్తేస్తే హోదా ఇవ్వకపోతే ఎవరిని అనగలుగుతాం?  

సాక్షి : సంతకం పెట్టాలంటే వాళ్లు అధికారంలోకి రావాలిగా?  
జగన్‌ : ఆ పరిస్థితి ఉంటేనే. ప్రధాని అయిన ఒకటో రోజో.. రెండో రోజో హోదా ఇస్తానని చెప్పు. అప్పుడు నేనొస్తా. చంద్రబాబునాయుడు మాదిరి నాలుగేళ్లు నిరీక్షించే అవకాశమే ఉండదు. వారమో... రెండు రోజులో ఎప్పుడో చెబితే నేను మద్దతిస్తా.  

సాక్షి : పోలవరం, అమరావతితో పాటు తాను చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మేం రావాల్సిందే. జగన్‌మోహన్‌ రెడ్డి వస్తే ఇవన్నీ ఆపేస్తాడని చెబుతున్నారు..  
జగన్‌ : అసలు అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? పోలవరం ప్రాజెక్టు పునాది దాటి ముందుకెళ్లలేదు. గట్టుదాటి ముందుకు కదల్లేదు. ఒక బొట్టు నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. డీపీఆర్‌ ఇంకా అవ్వలేదు. 48 గేట్లకు ఒకే ఒకటి పెట్టారు. ఒకటి పెట్టడానికి రెండు నెలలు పడుతుందట. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇక రాజధాని వ్యవహారం ఓ పెద్ద స్కాం. ఇంతకన్నా పెద్ద స్కాం ప్రపంచంలో ఎక్కడా కన్పించదేమో. రాజధాని ప్రాంతం ఎందుకు ముందుకు కదలడం లేదంటే అది స్కాం కాబట్టే. పర్మినెంట్‌ అనే పేరుతో రాజధానిలో ఒక్క ఇటుకా పడలేదు.

శాశ్వత అసెంబ్లీ, సచివాలయం ఏదీ లేదు. హైకోర్టు భవనం కూడా తాత్కాలికమే. ఆ తాత్కాలిక భవనాల నిర్మాణానికి అడుక్కు రూ.10 వేలు. మళ్లీ భూమి ఉచితంగా వచ్చిందే. ఇక దాని నాణ్యత ఎలాంటిదంటే, బయట మూడు సెంటీమీటర్లు వర్షం పడితే, లోపల ఆరు సెంటీమీటర్లు నీళ్లొస్తాయి. అభివృద్ధి పేపర్‌ మీదే తప్ప ఎక్కడన్నా కన్పిస్తోందా? తనకున్న ఎల్లో మీడియా సామ్రాజ్యంతో, తనకున్న ఛానళ్లు, పేపర్లతో మభ్యపెట్టేందుకు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారమే తప్ప అభివృద్ధి ఉందా? 

సాక్షి : అభివృద్ధి గురించి శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా? 
జగన్‌ : శ్వేతపత్రాల్లో ఉన్నదంతా పూర్తిగా అవాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో ఏం జరుగుతోందనేది ఏ సామాన్యుడిని అడిగినా చెబుతారు. ఎంత అన్యాయమైన, దౌర్భాగ్యమైన పాలన సాగుతుందనేది అందరూ చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అనే పదానికి అర్థమేంటి? పేదవాడి ఇంట్లో మంచి జరిగితే, పేదవాళ్లకు మంచి జరిగితే, పేదవాడి పొలంలో మంచి జరిగితే, పేదవాడు వెళ్లే స్కూల్లో మంచి జరిగితే, హాస్పిటల్‌లో మంచి జరిగితే అదీ అభివృద్ధి. ఇలా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అంతా దిగజారిపోయింది. చివరకు పంట పడించే సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనిపిస్తోంది. పంట దిగుబడి తగ్గిన పరిస్థితి ఉంది. దీన్ని అభివృద్ధి అంటారా?  

ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో పెట్టి ఉంటే కనీసం సుప్రీంకోర్టుకన్నా వెళ్లి దాన్ని అమలు చేయమని అడిగే పరిస్థితన్నా ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ ఆ రెండూ చేయకుండా ఆ విధంగా అన్యాయం, మోసం చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా. వాళ్లు అధికారంలో ఉన్నారు.. చేసే హోదాలో ఉన్నారు, చేస్తామని పార్టీ ప్రణాళికలో పెట్టారు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని మాట్లాడారు. మోదీ అయితే ఏకంగా తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. చేసే పొజిషన్‌లో ఉండి చేయకుండా వాళ్లు రాష్ట్రానికి అన్యాయం చేశారు. 

రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం

సాక్షి : విడిపోయిన రాష్ట్రానికి రాజధాని అవసరం కదా? 
జగన్‌: అక్కడ జరిగిన స్కాంలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు. ఫలానా చోట రాజధాని వస్తుందని తనకు తెలిసి ఉన్నా, నూజివీడు ప్రాంతంలో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందంటూ తప్పుదారి పట్టించారు. మేలో తాను అధికారంలో కొస్తే, డిసెంబర్‌ చివరి దాకా రాజధాని ఎక్కడొస్తుందనేది చెప్పలేదు. కానీ రాజధాని ఎక్కడొస్తుందనేది మాత్రం ఆయనకు, ఆయన బినామీలకు మాత్రం తెలుసు. అందరినీ పక్కదారి పట్టించి, ఆయన, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీ ఏకంగా 14 ఎకరాలు కొనుగోలు చేసింది. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అనౌన్స్‌మెంట్‌ చేసే మధ్య కాలంలో కొనుగోలు చేశారు.

ఎక్కడ రాజధాని వస్తుందనేది తెలిసి రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు ముఖ్యమంత్రి, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ మొదలు పెట్టారు. అదెంత అన్యాయమంటే, తను, తన బినామీల భూములను మినహాయించారు. లింగమనేని అనే వ్యక్తి విషయాన్ని చూస్తే, ఆయన భూముల దాకా వచ్చి ల్యాండ్‌ పూలింగ్‌ ఆగిపోతుంది. ఇక్కడేమో లింగమనేని తన రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. కొంతమంది బినామీలను ల్యాండ్‌ పూలింగ్‌లో తక్కువ శాతం భూములిచ్చేట్టు వాడుకున్నాడు. ఎక్కువ శాతం బినామీల భూములు పూలింగ్‌కు ఇవ్వకుండా ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ, గుంటూరు జిల్లాలు జోనింగ్‌ అన్నాడు.

తన బినామీలకు చెందిన భూములను రియల్‌ ఎస్టేట్‌ జోన్లలో పెట్టాడు. మిగతా రైతులు పోటీకి రాకూడదని వాళ్లను వ్యవసాయ జోన్‌లో పెట్టాడు. ఆ తర్వాత మరో స్కాం. ఇంకో అడుగు ముందుకేశాడు. తను రైతుల దగ్గర్నుంచి బలవంతంగా సేకరించిన భూమిని తన ఇష్టమొచ్చిన రేట్లకు, ఇష్టమొచ్చినన్ని ఎకరాలు, ఇష్టమొచ్చిన వ్యక్తులకు శనక్కాయలు, బెల్లాలకు కట్టబెట్టాడు. రాజధాని భూముల్లో ఈ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు జరుగుతుంటే ఇవి విచారణకు పోవా? రాజ్యాంగ అవసరాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోనని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. దీన్ని ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ అంటారు. స్టాక్‌ మార్కెట్లో ఇలాగే చేస్తే దాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇలా చేస్తే సాధారణంగా బొక్కలో పెడ్తారు. అలాంటి నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తి, ఇంత అవినీతి చేసిన పరిస్థితుల్లో వాటిపై విచారణ కచ్చితంగా జరుగుతుంది.

అసలు రాజధాని అంటే ఏమిటనేది ఓ స్పష్టత ఉండాలి. రాజధాని అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు. ఈ మూడు ఎక్కడుంటే అది రాజధాని. మిగిలిందంతా రైతులను ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రిగా ఆయన చేసే పనేంటి? ఎలా సంపాయించుకుని బాగుపడాలని ఆలోచించడం కాదు. రైతులు ఎలా బాగుపడాలని ఆలోచించాలి కదా? రియల్‌ ఎస్టేట్‌ చేయాలంటే రైతులకు అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మనమేంటి తక్కువకు తీసుకుని, ఇష్టమొచ్చినవాళ్లకివ్వడం? ఎంటైర్‌ ల్యాండ్‌ ఈజ్‌ గవర్నమెంట్‌ ల్యాండ్‌. రైతుల దగ్గర్నుంచి అటువంటి పరిస్థితులు లేని భూమి ఉంటే చూడాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా చేస్తే ఫర్వాలేదు గానీ, రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అన్యాయం చేయాలన్న రీతిలో అవినీతి చేయడం నిజంగా దుర్మార్గం.  

చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే కోడి కత్తి పొరపాటున భుజంపైన తగిలింది. అదే గొంతు మీద తగిలి.. మూడు సెంటీమీటర్ల లోతు తెగితే మనిషి బతికుండే వాడా? ప్రమాదకరమైన పథకం వేశారనేందుకు ఇదే నిదర్శనం.  

సాక్షి : 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మీ విశ్వసనీయత పెరగడానికి అలవికాని హామీలు నేను ఇవ్వనన్నారు. రైతు రుణమాఫీని సమర్థించనన్నారు. అందువల్ల విశ్వసనీయత పెరిగింది. ఇప్పుడు మీరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు కాకుండా పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాలకు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే వీటన్నింటినీ పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? 
జగన్‌ : రైతు రుణమాఫీని నేను సమర్థించను అని నేను ఏనాడూ అనలేదు. అది చెయ్యలేనిది, సాధ్యం కానిదనే ఆ రోజు చెప్పాను. నిజంగా కేంద్రం ముందుకొచ్చి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానంటే నా కన్నా సంతోష పడేవాళ్లు ఎవరూ ఉండరు. బంగారంగా చెయ్యమనే చెబుతాను. కానీ సాధ్యమవుతుందా? కాదా? అనేది తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకూ తెలుసు. అసలు రాష్ట్ర బడ్జెట్‌ ఏమిటి? నంబర్‌ ఏమిటి? ఏమేర చెయ్యగలుగుతాం? చెయ్యలేము అనేది ప్రతిపక్ష నాయకుడిగా నాకూ అవగాహన ఉంది. నాకూ సలహాదారులున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై సరైన అవగాహనతో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగల వ్యక్తులుగా మనం మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా కాగల వ్యక్తులమని చెప్పి ప్రజల దగ్గర ఓట్లడుగుతున్నాం.

అలాంటి మనకు విశ్వసనీయత ఉండాలి. మనం ఏదైనా మాట చెప్పి, అది చెయ్యలేకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. చరిత్ర హీనులమవుతామనేది అర్థం కావాలి. దేవుడు ఆశీర్వదించి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మాదిరి ఈ రోజు ఎంత సంపాదించాను, రేపు ఎంత సంపాదిస్తాననే అలోచన కోసం రావడం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం అంతకన్నా లేదు. నాకు ఒక్కదాని మీదే వ్యామోహం ఉంది ఒక్కటే... చరిత్ర సృష్టించాలి. ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్తే ప్రజలకు ఎంత మంచి చేయాలంటే... ఆ మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలనేది నా కల. దాని కోసం తాపత్రయపడుతున్నాను. దేవుడు ఆశీర్వదించి నాతో చేయించగలిగితే అది చేస్తాను. నాతో కుదరదు అంటే నేను తప్పుకుంటాను. ఇంకొకటి లేదు.
 
సాక్షి : రైతులకు తెలంగాణలో కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు బంధు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇలాంటిది ఏమైనా చేస్తారా? 

జగన్‌: వీరందరికంటే ముందు రైతు భరోసా అని చెప్పింది మనం. ఈ స్కీమ్‌ గురించి ఎవరూ చెప్పకముందే నా పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన మా పార్టీ ప్లీనరీలో నవరత్నాల సందర్భంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించాం. తర్వాత కొన్ని నెలల తర్వాత పాదయాత్ర ప్రారంభించా. ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు మే మాసంలోనే ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు ఇస్తామని నవరత్నాల్లో భాగంగా ప్లీనరీలో ప్రకటించాం. వీళ్లెవరూ ఆలోచించకముందే నేను చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర హెక్టారు (1.25 ఎకరాల లోపు భూమి) భూమి ఉన్న కుటుంబాలు అక్షరాలా 42 లక్షలు ఉన్నాయి. అనగా రైతు కుటుంబాల్లో సగమన్నమాట. హెక్టారు వరకూ ఉన్న వారిని తీసుకుంటే ఈ 42 లక్షలకు మరో 19 లక్షల కుటుంబాలు కలుస్తాయి. అనగా సుమారు 60 లక్షల కుటుంబాలు. అనగా మొత్తం రైతుల్లో 70 శాతం మంది హెక్టారు (2.5 ఎకరాల లోపు భూమి ఉన్న)లోపు ఉన్న వారే.

అందువల్ల ఎకరాకు ఇంత అని ఇస్తే వీరు ఎప్పటికీ బాగుపడరు. ఆ రోజుల్లో వీళ్లెవరూ చెప్పకముందే రైతుల కోసం మేం రూ.4 వేలు ఇవ్వాలా? రూ.5 వేలు ఇవ్వాలా? రూ.8 వేలు ఇవ్వాలా? అని ఆలోచన చేశాం. అయితే రూ.8 వేలు లేదా రూ.9 వేలు ఇచ్చినా ఇలాంటి చిన్న రైతులకు నేను మేలు చేయలేను. అందువల్లే రైతు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని చెప్పాం. పెద్ద రైతులకు బహుశా మనం ఇచ్చేది పెద్ద ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ చిన్న రైతులకు మనం ఇచ్చే మొత్తం వల్ల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గనుంది. బహుశా చాలా పంటలకు ఉత్పత్తి వ్యయాన్ని మనం ఇచ్చినట్లవుతుంది. అప్పు పుట్టని పరిస్థితిలో ఉన్న పేద రైతులకు రూ.12,500 చేతిలోకి వస్తుంది.

రెండోది ఏమంటే ఒకవేళ రుణమాఫీ లాంటి పథకాలకు పోయామంటే అవి రైతులకు చేతికి రావు. బ్యాంకుల్లోకి వెళ్లిపోతాయి. దానివల్ల రైతులకు మానసికంగా అప్పులు తీరిపోయినట్లు అనిపిస్తుందే గానీ రైతు జీవితం బాగుపడదు. ఆ రోజు నవరత్నాల గురించి మాట్లాడిన సందర్భంగా ధరల స్థిరీకరణ నిధి గురించి కూడా చెప్పా. ఈ రోజు చంద్రబాబు అనే వ్యక్తి దళారీలకు కెప్టెన్‌ అయ్యారు. నువ్వే (చంద్రబాబు) వ్యాపారిగా, దళారీలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు రైతులు ఎన్నడూ బాగుపడలేరు. మేమైతే రూ.3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కరువు లేదా వరదలు వస్తున్నాయి. అందువల్లే రూ.4,000 కోట్లతో విపత్తు సహాయక నిధి తీసుకొస్తామని చెప్పాం. నవరత్నాల్లో ఇవన్నీ ఉన్నాయి. రూ.2,000 కోట్లు రాష్ట్రం పెడితే రూ.2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది.  

సాక్షి : ఆంధ్రప్రదేశ్‌కు మేం రూ.20 వేల కోట్లు ఇస్తే ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు కదా? దీనిని బట్టి ఏమనిపిస్తోంది? 
జగన్‌ :  2017 జనవరి 27న చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసినంత మేలు ఏరాష్ట్రానికైనా చేసిందా? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే దాని అర్థం 2014 – 15, 2015 – 16, 2016 – 17 బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిన సహాయం ఓకే అన్నట్లే. ఎందుకంటే వీళ్లే (టీడీపీవారే) కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో వీరి మంత్రులు ర్యాటిఫై చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు మైక్‌ పట్టుకుని బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని, మోదీ బాగా చేస్తున్నారని పొగిడారు. 2017 – 18 బడ్జెట్‌ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఈ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి నెల ముందు అంతా బాగుందని మోదీని పొగిడారు.  మరి.. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి డబ్బు రాలేదనడం ఏమిటి?  

నన్ను ప్రేమించే వారెవరైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధపు ఫ్లెక్సీని సృష్టించారు. ఆ ఫ్లెక్సీ మీద గరుడ పక్షి ఫొటో పెట్టారు. ఎవరైనా ఫ్లెక్సీ వేసేవారు గరుడ పక్షిని పెడతారా? మా అమ్మ ఫొటోనో, మా నాన్న ఫొటోనో పెడతారు.  

సాక్షి : బహుశా సమకాలీన భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల్లో మీరు నష్టపోయినంతగా ఎవరూ నష్టపోయి ఉండరు. వాటిని అడ్డుకోవడానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? 
జగన్‌ : రాజకీయ నాయకుడికి తనమీద తనకు నమ్మకముండాలి. ప్రజలమీద నమ్మకముండాలి. దేవుడి మీద నమ్మకముండాలి. ఫలానా ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకో. యూ షుడ్‌ హావ్‌ ద కరేజ్‌.. రాజీనామా చేసి రమ్మను. వచ్చిన తర్వాత బై ఎలక్షన్‌ కు వెళ్లు. మీ పార్టీ గుర్తుతో గెలిపించుకో. 

సాక్షి : అది మీరు చేస్తున్నారు.. అన్ని రాజకీయ పార్టీలు అలా చేయడం లేదు కదా.. ఇటీవల మాకు గాంధీభవన్‌లో జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. అందుకే మా శాసనసభ్యులు అమ్ముడు పోతున్నారని ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అన్నారు. ఓ జాతీయ పత్రికలో వార్త వచ్చింది. 
జగన్‌ : వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధే అమ్ముడు పోయినప్పుడు కింది వాళ్లను అని ఏం లాభం. ఇదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబునాయుడు మీద 2018లో జూన్‌ 8, జూన్‌2న పుస్తకాలు రిలీజ్‌ చేశారు. నాలుగేళ్ల బాబు అవినీతి పాలన మీద రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి అన్యాయపు పరిపాలనపై చార్జిషీట్‌ అనే పేరుతో పుస్తకం రిలీజ్‌ చేశారు. ఇది జరిగి మూడు నెలలు తిరక్క ముందే బాబు అవినీతి సొమ్ములో వాటా ఇవ్వగానే, ఇదే కాంగ్రెస్‌ పార్టీ దాన్ని తీసుకుని అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. పై వాళ్లకే లేనప్పుడు చిన్న చిన్న ఎమ్మెల్యేలు, చిన్నా చితక లీడర్లకు విలువలుండాలని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడం కూడా తప్పే. 

సాక్షి : మీరు అవకాశం ఇవ్వనందునే రాహుల్‌ గాంధీ చంద్రబాబుతో వెళుతున్నారని అంటున్నారు? 
జగన్‌ :అవకాశం ఇవ్వాలి అనేది ఎందుకు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యాలి. నీ బలం మీద నువ్వు పోటీ చెయ్యి. ప్రజలను నమ్ముకో. నువ్వు కష్టపడు. ఎవడో సపోర్ట్‌ చెయ్యాలి, ఎవడి భుజాలమీదో పరుగెత్తాలని అనుకుంటున్నావ్‌. నువ్వే విలువలను అమ్మేసుకుని, నువ్వే దిగజారిపోయి, రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చావ్‌. నీకే విలువలు లేనప్పుడు వాళ్లు అమ్ముడు పోతే తప్పేముంది? 

సాక్షి : జనవరిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ తరహాలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాడని చెబుతున్నారు. మీరు కూడా ఇచ్చాపురం బహిరంగ సభలో అలాంటి సంచలన ప్రకటన ఏమైనా చెయ్యబోతున్నారా? 
జగన్‌ :అలాంటిదేమీ లేదు. అనౌన్స్‌ చెయ్యడమే ఒక సంచలనం అని ఎందుకనుకోవాలి? ఈ రోజుకు కూడా పాదయాత్ర జరుగుతూండగానే పార్లమెంటరీ వ్యూస్‌ తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌ను పిలిపించుకుని మాట్లాడుతున్నాం. మేము చేయించుకుంటున్న సర్వేలను బట్టి.. వాటిపై ఒకరికొకరం డిస్కస్‌ చేసుకుంటున్నాం. 

సాక్షి : ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబును మీరు తట్టుకోలేరని కదా? 
జగన్‌ :బేసికల్లీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే.. ‘సక్సెస్‌ హ్యాజ్‌ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్‌ ఈజ్‌ ఆర్ఫన్‌’ అని సామెత ఉంది. శ్రీశ్రీ గారు తెలుగులో ఇలాంటివే చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నేను నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరు. నెత్తురు కక్కుతూ నేను నేలకు ఒరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. క్లిక్‌ అయితే నువ్వు అపర మేధావివి. కాలేదనకో నీకు తొందరెక్కువ.. నీకు దుడుకెక్కువ అంటూ.. ఇవన్నీ సర్వ సహజంగా జరిగేవే. కానీ ఎండ్‌ ఆఫ్‌ ద డే ఏది చేసినా విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ప్రజలు మన జడ్జిలు, దేవుడు మన జడ్జి అనేది ఎప్పుడూ మరచిపోకూడదు. అదే నేను నమ్ముతా. 

సాక్షి : ఎప్పుడైనా ఏ మూలనైనా ఎందుకీ రాజకీయాలు అని విరక్తి కలిగిందా? 
జగన్‌ : ఒక్కోసారి అనిపిస్తుంది.. కానీ ఇన్ని కోట్ల మంది.. లాస్ట్‌ ఎలక్షన్స్‌లో 1.30 కోట్ల మంది నన్ను నమ్మి నాకు ఓట్లేశారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా ఆయనకు 1.35 కోట్ల మంది మాత్రమే ఓట్లేశారు. నాకంటే కేవలం 5 లక్షల మందే ఎక్కువ. కోటి ముప్పయి లక్షల మంది నామీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసినప్పుడు కష్టాలు వచ్చినాయి కదా అని వదిలేసి పోతే.. వీళ్లందరికీ అన్యాయం చేసినవాడినవుతానేమోనన్నది ఆల్వేస్‌ బిహైండ్‌ మై హెడ్‌. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రావాలి. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు కూడా వస్తుంది కదా..  

బాబు ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. తెలంగాణకు పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యపు పని లేదంటాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తాడు. ఆంధ్రాలోనేమో ఎమ్మెల్యేలను నిర్లజ్జగా కొనుగోలు చేసి నలుగుర్ని మంత్రుల్ని చేస్తాడు. మళ్లీ అదే వ్యక్తి తెలంగాణకు పోయి మరోమాట మాట్లాడతాడు.  ఆంధ్ర రాష్ట్రం ఒక మనిషి అనుకుంటే దాన్ని పొడిచెందెవరు? ఒకరు కత్తిచ్చారు. ఇంకొకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మూడో వ్యక్తి పొడిచాడు. ఇందులో ముగ్గురూ నేరస్తులు. అలాంటి వ్యక్తులు కూటమిగా వచ్చినా, విడివిడిగా వచ్చినా ఢీకొంటాం. ఇంతకు ముందు కూడా మేం కాంగ్రెస్, బీజేపీ.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోం. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకమెక్కువ. కాబట్టి ఎవరితోనూ పొత్తు పెట్టుకోం.  

హైకోర్టును విభజించండని అఫిడవిట్‌ ఇచ్చింది బాబే

సాక్షి : జగన్‌పై ఉన్న కేసుల విచారణను జాప్యం చేయడం కోసమే హైకోర్టును విభజించారు. హడావుడిగా విజయవాడకు తీసుకొచ్చారనే ఆరోపణపై మీరేమంటారు? 
జగన్‌ :అసలు నాకు అర్థం కానిదేమంటే, హైకోర్టుకు, నాకు సంబంధం ఏముంది? హైకోర్టును విభజించాలని, వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని నేను ఎన్నడూ కోరలేదు. నేను ఏనాడూ డిమాండు చేయలేదు. నేను ఏనాడూ లేఖ రాయలేదు. పది సంవత్సరాలు మనకు హైదరాబాద్‌లోనే ఉండటానికి హక్కుంది. నువ్వు అక్కడింత వరకూ పర్మినెంట్‌ అనే పేరుతో ఒక్క భవనం కట్టలేదు. పర్మినెంట్‌ అనే పేరుతో హైకోర్టే కట్టకుండా హైకోర్టును షిఫ్ట్‌ చేయాలని ఏ బుద్ధి ఉన్న వాడూ అడగరు. ప్రతిపక్ష నాయకుని బాధ్యతలో నేనున్నప్పుడు అసలు అడగనే అడగను. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలిసి ఉండి కూడా హైకోర్టును ఎట్టిపరిస్థితుల్లోనూ విభజించండని విజ్ఞప్తి చేస్తూ.. దానికి సంబంధించిన భవనాలన్నీ తయారైపోయాయి.. మీరు షిఫ్ట్‌ చేయండి.. అని తానంతట తానే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేశారు.

దానికి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదు, అవసరమైతే ఒక భవనం కూడా ఇస్తామని రివర్స్‌ అఫిడవిట్‌ ఫైల్‌ చేసింది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కారు భవనాలు ఇస్తామని అంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి హైకోర్టు షిఫ్ట్‌ కావడం ధర్మం కదా? ఎందుకు మీరు షిఫ్ట్‌ చేయడం లేదు? అంటూ పలానా తేదీ నుంచి షిఫ్ట్‌ చేయండని కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. ఆ నేపథ్యంలో హైకోర్టు షిఫ్ట్‌ అయింది. చంద్రబాబు నాయుడి కోరిక మేరకు హైకోర్టు బదిలీ అయితే దాన్ని తిరిగి రాజకీయం చేసి వేరే వాళ్లపై బురద చల్లేందుకు ఉపయోగించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది. ఇంతటి దారుణమైన  వ్యక్తి మరొకరు ఉండరు.  

నేను విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాలు ఆగిపోయాయి

సాక్షి : మీపై హత్యాయత్నానికి సంబంధించిన కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది. దీనిపై చంద్రబాబు కామెంట్‌ చేశారు. దీనిని మీరేమంటారు? 
జగన్‌:  అసలు దాడి ఎక్కడ జరిగింది.. ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వీఐపీ లాంజి అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అలాంటి ప్రదేశంలోకి ఒక కత్తి.. అన్ని సెక్యూరిటీ ప్రమాణాలను దాటి ఎలా రాగలిగింది? అక్కడ పనిచేసిన ఆ మనిషి ఆ కత్తిని ఎలా తేగలిగాడు? ఆ మనిషి తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరుడు హర్షవర్దన్‌ చౌదరికి చెందిన రెస్టారెంట్‌లో పని చేయగలిగాడు కాబట్టే ఆ కత్తిని తీసుకుని రాగలిగాడు. ఆ హర్షవర్దన్‌ చౌదరి 2014లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఆశించారు. ఆయనకు చంద్రబాబునాయుడి దగ్గర నుంచి లోకేశ్‌ వరకూ చివరకు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ చౌదరి దాకా అందరితో సంబంధాలు ఉన్నాయి. హత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి గతంలోనే హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్నారట.

అలాంటి వ్యక్తికి పోలీసులు ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు? ఇంకో అడుగు ముందుకెళ్లి చూస్తే మొన్న కోర్టు అడుగుతున్న ప్రశ్నల్లో మరొకటి ముందుకొచ్చింది. నా పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే నాటికే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై హత్యాయత్నం జరిగేంత వరకూ ఎయిర్‌ పోర్టులో సీసీ కెమెరాలు పని చేయలేదట. అంటే దాదాపుగా మూడు నెలల పాటు విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. అదీ కరెక్టుగా ఎప్పుడు పనిచేయడం మానేశాయంటే విశాఖపట్నం జిల్లాలోకి జగన్‌ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాతే. ఇంత దారుణమైన కుట్ర జరుగుతున్నప్పుడు సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు దారుణం. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నాపై హత్యాయత్నాన్ని వెటకారం చేస్తూ దాడి చేసిన వ్యక్తి జగన్‌ అనుచరుడని తేల్చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైతే అదీ బ్లూకలర్‌లో ప్లెక్సీ వేస్తాడు.

కానీ ఆ ఫ్లెక్సీ ఎల్లో కలర్‌లో ఉంది. దానిపైన గరుడ పక్షి బొమ్మ పెట్టి మార్ప్‌డ్‌ ప్లెక్సీ ఎవడైనా పెట్టగలుగుతాడా? ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పాత ఫ్లెక్సీ మీద తయారు చేయించారు. ఎయిర్‌ పోర్టులో నాపై హత్యాయత్నం జరిగాక నేను చాలా హుందాగా చంద్రబాబు మీదగానీ, మరొకరి మీదగానీ అనవసరమైన ఆరోపణలు చేయలేదు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం ధర్మం కాదని అన్ని విషయాలు తెలిసిన తర్వాతే మాట్లాడాలని సంయమనం పాటించి మౌనంగా ఉన్నాను. ప్రథమ చికిత్స చేసిన తర్వాత అందరి ముందే చొక్కా మార్చుకుని ఒక్క మాట మాట్లాడకుండా హైదరాబాద్‌కు వచ్చి నేరుగా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నా. దాన్ని కూడా ఏ రకంగా చిత్రీకరించారంటే అన్యాయంగా మాట్లాడారు. అసలు దీని వెనుక ఎవరున్నారు? కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా రాగలిగింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోలీసుల చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి?  

బాబు, పవన్‌లు ముసుగు తీసి కలిసి రండి..

సాక్షి : మరి ఆయన (మోదీ) నిస్సహాయతను ఏమనుకోవాలి? 
జగన్‌ : ఇక్కడ ఎన్ని స్కామ్‌లు చేసినా, కుంభకోణాలు చేసినా మోదీ మాత్రం మన చంద్రబాబే కదా? పోనీలే అనుకుంటూ వదిలేసిన పరిస్థితులూ కనిపిస్తున్నాయి.   

సాక్షి : తాను, పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే జగన్‌కు ఎందుకు బాధ అని చంద్రబాబు అంటున్నారు.. 
జగన్‌ : నాకెక్కడ బాధండీ. నాకసలు బాధ లేదు. నేను వాళ్లను కలవమనే చెబుతున్నాను. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? ఇంతకు ముందు కలిసి మీరు పోటీ చేశారు. ఇప్పుడు విడిపోయినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ముసుగు తీసేసి కలిసికట్టుగా రండయ్యా.. నాకు భయం లేదు. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఇవ్వాళ కూడా నేను ఒక్కడినే పోటీ చేస్తానని చెబుతున్నా. మీరందరూ మళ్లీ కలిసి రండయ్యా అని చెబుతున్నా. పొత్తులు ఏమీ ఉండవని చెబుతున్నా.   

అసెంబ్లీలో రాజ్యాంగానికి ఏకంగా తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రులను చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము మళ్లీ శాసనసభలోకి ప్రవేశిస్తే దాన్ని కూడా అంగీకరించినట్టే అవుతుంది. అధికార పార్టీ ఈ మాదిరిగా చేసినా కూడా ఆమోదయోగ్యనీయమే అనే స్థాయికి ప్రజాస్వామ్యం వెళ్లిపోతుంది. అందువల్ల దీనికి ఎక్కడో చోట పుల్‌స్టాప్‌ పెట్టాలి. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. అప్పుడే ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు వస్తాయి. అందుకే ఏకంగా ప్రజల వద్దకే వెళ్లి ఈ విషయం చెబుదాం అని పాదయాత్రకు శ్రీకారం చుట్టాం. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా నేషనల్‌ మీడియా కూడా దీనిపై దృష్టి సారించేలా చేశాం.  – వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top