‘చంద్రబాబుకు సరిగా బ్రీఫ్‌డ్‌ చేసినట్లు లేరు’

YSRCP Leader PVP Fires On TDP Over Fake Publicity - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రాచారంపై విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై నేను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయలేదని అన్నారు. ఎడిట్‌ చేసిన మాటలతో వివాదస్పదం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు అక్కడి వాళ్లు సరిగా బ్రీఫ్‌డ్‌ చేసినట్లు లేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తన ప్రసంగం ఇంగ్లీష్‌లో ఉందని.. చంద్రబాబు గారు జయదేవ్‌తో ట్రాన్స్‌లేట్‌ చేయించుకుని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.  ఈ ఒక్క అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజా వైఫల్యాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని అసెంబ్లీ, మండలిలలో తీర్మానాలు చేయలేదా అని నిలదీశారు. ప్రధానికి ధన్యవాదములు తెలిపింది చంద్రబాబు కాదా అని  ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు డీఎన్‌ఏలోనే ఉన్నాయని విమర్శించారు. ఇష్యూను డైవర్ట్‌ చేయడానికే తనపైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

20 రోజుల్లో ఐదేళ్ల జీవితం గురించి నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. మంచి విషయాలపై చర్చ చేద్దామని తెలిపారు. తాను బెజవాడలో పుట్టానని.. టీడీపీ ఆడుతున్న మైండ్‌ గేమ్‌లు తన దగ్గర చెల్లవని స్పష్టం చేశారు. పోరాటల్లో మడమ తిప్పేది, వెనుకడుగు వేసేది లేదని వ్యాఖ్యానించారు. తన గురించి బెజవాడ ప్రజలకు బాగా తెలుసనని పేర్కొన్నారు. తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కోరారు. ప్రత్యర్థులు చేసే గ్లోబెల్స్‌ ప్రచారానికి భయపడనని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీ ఏప్రిల్‌ 9వ తేదీన కాదని 11వ తేదీ అని మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top