నీ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది

YSRCP Leader Narayana Swamy React on Vangaveeti Radha - Sakshi

వంగవీటి రాధా తీరుపై గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు

నారాయణస్వామి ఆగ్రహం

చిత్తూరు, పుత్తూరు: ‘నీ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది.. టీడీపీ తీర్థం పుచ్చుకుని నీ తండ్రి వంగవీటి రంగా ఆత్మబలిదానాన్ని శాశ్వతంగా చెరిపేశావు.. చరిత్ర హీనుడిగా మిగిలిపోయావు..నీ స్వార్థం కోసం, నీ పదవీకాంక్ష కోసం మొత్తం కాపుజాతినే పణంగా పెట్టావు’ అని విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ వంగవీటి రంగా తాను నమ్మిన సిద్ధాంతా లు, ఆశయాల కోసం, కాపుజాతి చైతన్యం కోసం టీడీపీపై జీవితమంతా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఉన్మాదుల చేతిలో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని చంపించిన టీడీపీలో చేరడమే కాకుండా వంగవీటి రంగా హత్యకు   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏ విధమైన సంబంధం లేదని  చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. 30 ఏళ్ల తరువాత వంగవీటి రాధా కళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భగవంతుడులాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.  పదవుల కోసం వంగవీటి రాధా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో కాపుజాతి మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటోందన్నారు. ఈ రోజు రెండోసారి వంగవీటి మోహన్‌రంగాని హత్య చేసినట్లు తన మనసు బాధపడుతోందన్నారు.

మాయలోడు చంద్రబాబు
చంద్రబాబు టక్కుటమారా గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో మరోసారి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఓట్లు కొనుగోలు చేసేందుకు నక్క తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఇంటికి ఒక కేజీ బంగారం ఫ్రీగా ఇచ్చేస్తానని చంద్రబాబునాయుడు జీవో ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ఎద్దేవా చేశారు. మాయలోడు మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top