ఇది మోసపూరిత బడ్జెట్‌!

YSRCP Leader Kolusu Parthasarathy Criticise TDP Govt Over AP Budget - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి

సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జవాబుదారీతనం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళవారం విజయవాడలో విలేరులతో మాట్లాడుతూ.. రైతులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. రైతు సుఖీభవ పేరుతో కేటాయించిన రూ. 5 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారో అన్న విషయంపై స్పష్టత లేదని విమర్శించారు. రైతులకు రెండు విడతల్లో చెల్లించాల్సిన రుణమాఫీ రూ. 8300 కోట్ల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదన్నారు.   

మూలనిధికి కేటాయింపులు లేవు..
‘బీసీ సబ్ ప్లాన్ కోసం రూ. 50 వేల కోట్లు అన్నారు. గడిచిన నాలుగు బడ్జెట్ సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లు మాత్రమే . ప్రతీ కులానికి కార్పొరేషన్ అని సీఎం ప్రకటించారు . అయితే ఆయా కార్పోరేషన్ల మూలనిధికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. నిరుద్యోగభృతి కోసం గత బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించి రూ. 116 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సారి భృతి రెట్టింపు చేస్తామంటూ కేవలం రూ.1200 కోట్లే ఎలా కేటాయిస్తారు’ అని పార్థసారథి ప్రశ్నించారు. ఇది పూర్తిగా మోసపూరిత బడ్జెట్‌ అని దుయ్యబట్టారు.

కాగా మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎన్నికల వేళ సంప్రదాయబద్ధంగా ఓటాన్‌ అకౌంట్‌ (మధ్యంతర) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సిన ప్రభుత్వం.. రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు ఉంచిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో కూడా అప్పులతోపాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేసింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను యనమల ప్రవేశపెట్టారు. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీగా బడ్జెట్‌ కేటాయింపులు చేసేద్దామనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోంది. రూ.2099.47 కోట్లను రెవిన్యూ లోటు కింద.. రూ.32,390 కోట్లను ద్రవ్యలోటు కింద బడ్జెట్‌లో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top