'బీసీలకు ఏం ఒరగబెట్టారో చెప్పండి'

 ysrcp leader janga krishna murthy fires chandrababu naidu - Sakshi

సాక్షి, కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో బీసీలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలతో పాటు బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది వైఎస్సార్ మాత్రమేనని గుర్తు చేశారు. తొమ్మిది సంవత్సరాలు పాలించిన కాలంలో చంద్రబాబుకు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదరణ పేరుతో బీసీలను మభ్య పెట్టారే తప్ప వారి ఆర్థిక స్వావలంబనకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు రూ. 10 వేల కోట్లతో సబ్ ప్లాన్ నిధులు ఏర్పాటు చేస్తాం అన్నారు.. బీసీలకు స్పెషల్ బడ్జెట్‌ ఏర్పాటు చేస్తాం అన్నారు.. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టభద్రత కల్పిస్తామన్నారు.. కానీ అన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారిని మోసం చేసిన చంద్రబాబు నేడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాలను తెలియజేసేందుకు వైఎస్సార్పీపీ కార్యాచరణ రూపొందించిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రలో బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top